Foundation Side effects: ప్రతిరోజూ ముఖానికి ఫౌండేషన్ అప్లై చేస్తున్నారా? ఇలా చేస్తే జరిగేది ఇదే
Foundation Side effects: అందం మీద మోజుతో కాస్మెటిక్స్ ఉత్పత్తులు అధికంగా వాడే వారి సంఖ్య ఎక్కువే. ముఖ్యంగా ఫౌండేషన్‌ను ప్రతి రోజూ ముఖానికి పట్టిస్తారు. ఇది భవిష్యత్తులో చర్మ సమస్యలకు కారణం అవుతుంది.
Foundation Side effects: ప్రతిరోజూ ఫౌండేషన్ ముఖానికి అప్లై చేయడం వల్ల మీరు అందంగా కనిపించవచ్చు. కానీ దీర్ఘకాలంలో ఇది కొన్ని ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంది. రొటీన్ మేకప్‌లలో ఫౌండేషన్ రాయడం అనేది సాధారణమైపోయింది. చర్మం ప్రకాశవంతంగా కనిపించేందుకు, కాంతివంతంగా కనిపించేందుకు, కాస్త తెలుపు రంగులో కనిపించేందుకు ఈ ఫౌండేషన్‌ను అప్లై చేస్తూ ఉంటారు. ఇలా ప్రతిరోజూ ఫౌండేషన్ అప్లై చేస్తే చర్మ రంధ్రాలు పూడుకు పోతాయి. దీనివల్ల చర్మ సమస్యలు వస్తాయి.
చాలామంది ఫౌండేషన్ అప్లై చేసుకున్నాక దాన్ని సరిగ్గా తొలగించుకోరు. అలానే నిద్రపోతారు. దీనివల్ల మూరికి, నూనె, మృతకణాలు చర్మం లోపలే ఉండిపోతాయి. ఇవి బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్, మొటిమలు వంటివి ఏర్పడడానికి దారితీస్తాయి. కాబట్టి ఫౌండేషన్ ముఖానికి అప్లై చేయడానికి ముందు చర్మాన్ని పరిశుభ్రంగా కడుక్కోవాలి. అలాగే ఇంటికి చేరుకున్నాక ఫౌండేషన్‌ను పూర్తిగా తొలగించుకోవాల్సిన అవసరం ఉంది.
ఫౌండేషన్‌ను సరిగా తొలగించుకోకుండా రోజంతా ఉంచుకోవడం వల్ల చర్మంపై అలెర్జీలు వస్తాయి. అలాగే దురదలు, చికాకు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఎర్రగా ఉండే దద్దుర్లు, వాపు వంటివి కూడా వస్తాయి. కొంతమందికి సున్నితమైన చర్మం ఉంటుంది. ఆ చర్మం ప్రతి రోజూ ఫౌండేషన్ రాయడం వల్ల తట్టుకోలేకపోవచ్చు. అలాంటివారికి ఇతర చర్మ సమస్యలు ఏవైనా రావచ్చు.
చాలా ఫౌండేషన్లలో ఆల్కహాల్ లేదా మ్యాట్ ఫినిష్ పౌడర్లను వినియోగిస్తారు. ఇవి చర్మం నుండి అదనపు నూనెను గ్రహిస్తాయి. ఫలితంగా చర్మం పొడిబారిపోతుంది. ప్రకాశవంతంగా ఉండదు. ఫౌండేషన్ చర్మంపై ఉన్నంతకాలం మెరుగైన రంగు కనిపిస్తున్నప్పటికీ... అడుగు బాగాన ఉన్న చర్మం మాత్రం పొడిగా మారుతుంది. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే గ్లిజరిన్, హైలురోనిక్ యాసిడ్ వంటి పదార్థాలతో తయారుచేసిన హైడ్రేటింగ్ ఫౌండేషన్లను వాడడం మంచిది. ఇది చర్మంలోని సహజంగా ఉండే తేమ సమతుల్యతను కాపాడడానికి సహకరిస్తుంది.
ఫౌండేషన్ ప్రతిరోజు రాసేవారు త్వరగా ఏజెంట్ లక్షణాలను పొందుతారు. అంటే వారి చర్మంపై ముడతలు, గీతలు వంటివి త్వరగా వస్తాయి. కొన్ని ఫౌండేషన్లలో రసాయనాలు, సింథటిక్ సువాసనలు కలిగిన పదార్థాలు ఉంటాయి. ఇవి ఆక్సికరణ ఒత్తిడికి కారణం అవుతాయి. దీనివల్ల చర్మ కణాలకు హాని కలుగుతుంది. కాబట్టి చర్మంపై ముడతలు, గీతలు, మచ్చలు, మొటిమలు వంటివి త్వరగా వస్తాయి. ఇవన్నీ కూడా వృద్ధాప్య ఛాయాలను చూపిస్తాయి.
కాబట్టి చర్మం మెరుపు కోసం ఫౌండేషన్ రాసుకున్నట్లయితే... ఇంటికి వచ్చాక దాన్ని పూర్తిగా తొలగించి చర్మాన్ని మంచి నీటితో శుభ్రం చేసుకోవడం చాలా అవసరం. చర్మ రంధ్రాలలో పూడికలు లేకుండా క్లీన్ చేసుకోవాలి. తర్వాత ముఖానికి మాయిశ్చరైజర్ ను రాయాలి. ఇలా చేయడం వల్ల చర్మం మళ్లీ తేమవంతంగా మారుతుంది. రోజంతా ముఖంపై ఫౌండేషన్ లేకుండా చూసుకోవడమే ఉత్తమం. నాలుగైదు గంటలు ఫౌండేషన్ ఉన్న ఫరవాలేదు. ఆ తర్వాత ముఖానికి ఎలాంటి కాస్మెటిక్స్ రాయకుండా సహజంగా ఉండేలా జాగ్రత్త పడాలి. లేకుంటే చర్మ సమస్యలు ఏవైనా త్వరగా దాడి చేయవచ్చు.
టాపిక్