Monsoon care: వర్షాకాలంలో ఈ 5 అస్సలు తినకండి.. వీటితో జ్వరాలు, రోగాల ముప్పు పెరుగుతుంది-avoid these foods in monsoon to reduce risk of viral fevers typhoid and more ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Monsoon Care: వర్షాకాలంలో ఈ 5 అస్సలు తినకండి.. వీటితో జ్వరాలు, రోగాల ముప్పు పెరుగుతుంది

Monsoon care: వర్షాకాలంలో ఈ 5 అస్సలు తినకండి.. వీటితో జ్వరాలు, రోగాల ముప్పు పెరుగుతుంది

Koutik Pranaya Sree HT Telugu
Sep 15, 2024 10:30 AM IST

Foods to avoid in Monsoon: వైరల్ ఫీవర్లు, టైఫాయిడ్, డెంగ్యూ వంటి అనేక వ్యాధులు వర్షాకాలంలో చాలా వేగంగా వ్యాపిస్తాయి. కాబట్టి తినే ఆహారాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. వర్షాకాలంలో మీరు చాలా జాగ్రత్తగా తినాల్సిన ఆహారాల గురించి ఈ రోజు మేము మీకు చెప్పబోతున్నాము.

వర్షాకాలంలో తినకూడని వస్తువులు
వర్షాకాలంలో తినకూడని వస్తువులు (Shutterstock)

వర్షాకాలం వస్తూ వస్తూ తనతో రోగాలను కూడా తీసుకొస్తుంది. పసిపిల్లల దగ్గర్నుంచి వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఇంట్లో ఎవరికో ఒకరికి జ్వరం, జలుబు లాంటివి ఉంటున్నాయి. ఈ సీజన్ లో ఆహారంలో చిన్నపాటి నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదానికి కారణం అవుతుంది. వైరల్ ఫీవర్, టైఫాయిడ్, డెంగ్యూ వంటి అనేక ప్రమాదకర వ్యాధులు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. ముఖ్యంగా పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. ఈ సమయంలో కొన్ని ఆహారాలకు దూరంగా ఉండటం మంచిది.

ఆకుకూరలు వద్దు:

వర్షాకాలంలో వ్యాధులు రాకుండా ఉండాలంటే ఆకుకూరలు తినకుండా ఉండాలి. ఎందుకంటే ఈ సీజన్లో తేమ ఎక్కువగా ఉండటం వల్ల క్యాబేజీ, ఆకుకూరలు, పాలకూర వంటి ఆకుకూరల్లో బ్యాక్టీరియా, పరాన్నజీవులు పెరగడం ప్రారంభమవుతాయి. అలాంటి కూరగాయలను ఎంత శుభ్రం చేసినా కష్టమే. సరిగా ఉడికించకపోతే పొట్టకు సంబంధించిన సమస్యలు వచ్చి జీర్ణ సమస్యలు వచ్చేస్తాయి. కాబట్టి వాటికి దూరంగా ఉండటం మంచిది.

పాల ఉత్పత్తులు:

వర్షాకాలంలో కొన్ని రకాల పాల ఉత్పత్తుల వాడకంలో కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. పెరుగు, పనీర్ వంటి వాటిని మార్కెట్లో కొన్నిచోట్ల అంత శుభ్రంగా తయారు చేయరు. వాటిని తినడం వల్ల అనేక వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. వర్షాకాలంలో బ్యాక్టీరియా పెరుగుదల ప్రమాదం వీటిలో గణనీయంగా ఉంటుంది. ఈ ఉత్పత్తులు మీ ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. సాధ్యమైనంత వరకు తాజా డైరీ ఉత్పత్తులను మాత్రమే ఉపయోగించండి. వీలైతే ఇంట్లో చేసుకోండి.

స్ట్రీట్ ఫుడ్స్:

స్ట్రీట్ ఫుడ్ ఎంత రుచికరంగా ఉన్నా ఆరోగ్య పరంగా ఇది చాలా అనారోగ్యకరమైనది. సీజన్ ఏదైనా సరే స్ట్రీట్ ఫుడ్ తినొద్దని వైద్యులు సూచిస్తున్నారు. అయితే ముఖ్యంగా వర్షాకాలంలో ఈ ఆహారాలకు ఖచ్చితంగా దూరంగా ఉండాలి. బండిపై విక్రయించే చాట్, టిక్కీ, సమోసా, పూరీ, పకోడా వంటి స్ట్రీట్ ఫుడ్ ను అంత పరిశుభ్రత పాటించి తయారు చేయరు. కాబట్టి వాటిని తినడం వల్ల వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది.

సీఫుడ్స్:

సీఫుడ్స్‌కి కూడా దూరంగా ఉండాలి. వర్షాకాలంలో చేపలు, పీతలు, రొయ్యలు వంటి సీఫుడ్స్ సులభంగా కలుషితమవుతాయి. నీటి ద్వారా వచ్చే వ్యాధులు కూడా దీనిని తినే వ్యక్తిని ప్రభావితం చేస్తాయి. ఫుడ్ పాయిజనింగ్ కూడా అవ్వొచ్చు. అందుకే వర్షాకాలంలో వీటికి దూరంగా ఉండాలి.

రెడీమేడ్ సలాడ్లు:

రోడ్ల మీద కట్ చేసి అమ్మే పండ్లను తినకూడదు. ముఖ్యంగా వర్షాకాలంలో వీటికి దూరంగా ఉండాలి. తరిగిన పండ్ల ముక్కలను ఏమీ కప్పకుండా ఉంచితే వాటిని అస్సలు తినకూడదు. ఫ్రూట్ చాట్ వంటి వాటికి దూరంగా ఉండటం మంచిది.