Fish and Curd: చేపలు తినే రోజు పెరుగును తినకూడదా? ఈ రెండింటిని ఒకేసారి తింటే ఏం జరుగుతుంది?
Fish and Curd: కొన్ని రకాల ఆహార కాంబినేషన్లు ఆరోగ్యానికి మంచిది కాదు. ఆయుర్వేదంలో కొన్ని రకాల ఆహారాలను కలిపి తినకూడదని అంటారు. అలా పెరుగు, చేప కాంబినేషన్ కూడా మంచిది కాదనే వాదన ఉంది.
Fish and Curd: వేసవిలో కచ్చితంగా తినాల్సిన ఆహారాలలో పెరుగు ఒకటి. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పెరుగును తినడం వల్ల పొట్ట ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రొబయోటిక్స్ పొట్టలోని మంచి బాక్టీరియాను పెంచుతాయి. చర్మ సమస్యలకు పెరుగు ఎంతో అవసరం. అలాగే చేపలు కూడా ఆరోగ్యానికి మేలు చేసేవే. చేపలు ఎంత తిన్నా బరువు పెరగరు. బరువు తగ్గాలనుకునే వారు చేపలను తమ ఆహారంలో భాగం చేసుకోవాలి. అయితే పెరుగు, చేపలు ఈ రెండూ విడివిడిగా ఆరోగ్యకరమైనవే. అయినా ఒకేరోజు ఈ రెండింటినీ భోజనంలో భాగం చేసుకోవడం వల్ల మాత్రం కొన్ని రకాల సమస్యలు వస్తాయని చెబుతున్నారు ఆయుర్వేద వైద్యులు.
పెరుగు, చేపలను భోజనంలో భాగం చేసుకుని తినడం వల్ల జీర్ణ రుగ్మతలు ఇచ్చే అవకాశం ఉంది. మధ్యాహ్న భోజనం లేదా రాత్రి భోజనంలో మొదట చేపల కూర తిని, చివరగా పెరుగు తినేవారు ఎంతోమంది. ఇలా తింటే పొట్టలో చేపలు,పెరుగు కలుస్తాయి. వాటి వల్ల కొన్ని రకాల చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
కొంతమందిలో జీర్ణశక్తి చాలా తక్కువగా ఉంటుంది. అలాంటివారు చేపలు, పాలను కలిపి తినడం వల్ల అవి జీర్ణం కావడం కష్టంగా మారుతుంది. అయితే జీర్ణశక్తి అనేది వ్యక్తులకు వేరువేరుగా ఉంటుంది. కాబట్టి అధిక జీర్ణశక్తి కలవారు తిన్నా కూడా ఈ రెండు జీర్ణం కావచ్చు. కానీ ఎవరికి జీర్ణం అవుతుందో ,ఎవరికి జీర్ణం కాదో అంచనా వేయడం కష్టం. చేపలు, పాలతో చేసిన పదార్థాలతో కలిపి తినడం వల్ల కొంతమందిలో గ్యాస్ట్రిక్, అజీర్ణం, కడుపుబ్బరం వంటి సమస్యలు వస్తాయి. లాక్టోజ్ ఇంటాలరెన్స్ సమస్య ఉన్నవారు పాలను, చేపలను ఒకే భోజనంలో భాగం చేసుకోకూడదు.
పోషకాలు ఎక్కువే
చేపలు, పెరుగు... ఈ రెండూ కూడా పోషకాలు దట్టించిన ఆహారాలే. వీటిలో ప్రత్యేకమైన విటమిన్లు, ఖనిజాలు, స్థూల పోషకాలు అధికంగా ఉంటాయి. ఒకేసారి ఎక్కువ మొత్తంలో శరీరంలో అధిక పోషకాలు చేరడం వల్ల కూడా జీర్ణక్రియకు అంతరాయాన్ని కలిగిస్తాయి. కాబట్టి వీటిని విడివిడిగా తినడం ముఖ్యం. కూరగాయలు, ధాన్యాలు, చిక్కుళ్ళు వంటి వాటితో వీటిని కలిపి తినడం వల్ల ఆరోగ్యకరంగా ఉంటారు.
కొందరిలో చేపలు లేదా పాల ఉత్పత్తుల అలెర్జీ ఉండవచ్చు. అలాంటివారికి దురద, దద్దుర్లు, తామర వంటి చర్మ లక్షణాలు కనిపిస్తాయి. తిన్న వెంటనే అలెర్జీ కనిపిస్తే చేపలు లేదా పాలతో చేసిన పదార్థాలను దూరంగా ఉంచడం మంచిది.
ఒకే భోజనంలో చేపలను, పెరుగును భాగం చేసుకోకూడదు. మధ్యాహ్న భోజనంలో చేపలు తింటే రాత్రి భోజనంలో పెరుగును కొద్ది మొత్తంలో తినేందుకు ప్రయత్నించండి. అంతే తప్ప ఒకే భోజనంలో చేపలు తిన్నాక పెరుగును తినడం లేదా పెరుగును తిన్నాక చేపలు తినడం మంచి పద్ధతి కాదు. చేపల్లో హిస్టామిన్లు ఉంటాయి. పాల ఉత్పత్తుల్లో లాక్టోస్ ఉంటుంది. ఈ రెండూ కూడా అరిగించుకోలేని శక్తి గల వారికి దద్దుర్లు, మొటిమలు వంటి సమస్యలు అధికంగా అవుతాయి.
ఇలా చేపలు, పెరుగును కలిపి తీసుకుంటే అజీర్ణం, జీర్ణకోశ అసౌకర్యం వంటి సమస్యలు వస్తాయి. చేపల్లో ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉంటాయి. అలాగే పెరుగులో కొవ్వు పదార్థాలు ఉంటాయి. ఈ రెండూ కలిపి తినడం వల్ల ఆ వ్యక్తుల్లో చర్మం పైన జిడ్డు అధికంగా చేరుతుంది. మొటిమలు ఎక్కువగా వస్తాయి.
కాబట్టి ఒక పూట చేపలతో భోజనం చేసినప్పుడు... ఆరోజు పెరుగును తినకుండా ఉండడమే మంచిది. లేదా పాలతో చేసిన ఇతర పదార్థాలను కూడా తినకుండా ఉండడమే ఉత్తమం.