Skin Allergy Foods: ఈ ఆహారాలు ఆరోగ్యకరమైనవే, కానీ కొందరిలో చర్మ అలెర్జీలకు కారణమవుతాయి-skin allergy foods these foods are healthy but can cause skin allergies in some people ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Skin Allergy Foods: ఈ ఆహారాలు ఆరోగ్యకరమైనవే, కానీ కొందరిలో చర్మ అలెర్జీలకు కారణమవుతాయి

Skin Allergy Foods: ఈ ఆహారాలు ఆరోగ్యకరమైనవే, కానీ కొందరిలో చర్మ అలెర్జీలకు కారణమవుతాయి

Haritha Chappa HT Telugu
Published Mar 10, 2024 12:40 PM IST

Skin Allergy Foods: కాలుష్యం వల్ల కొన్ని రకాల ఆహారాల వల్ల చర్మ సమస్యలు పెరిగిపోతున్నాయి. కొన్ని రకాల ఆహారాలు రహస్యంగా చర్మ అలెర్జీలను పెంచుతాయి.

చర్మ అలెర్జీలు
చర్మ అలెర్జీలు (pixabay)

Skin Allergy Foods: గాలి కాలుష్యం వల్ల, కొన్ని రకాల ఆహారాల వల్ల చర్మ అలెర్జీలు వస్తాయి. ఆరోగ్యాన్నిచ్చే ఆహారాలు కూడా మనకు తెలియకుండానే చర్మ అలెర్జీలకు దారితీస్తాయి. అలాంటి ఆహారాలు ఏవో తెలుసుకుంటే... మీకు చర్మ అలెర్జీలు ఎందుకు వస్తున్నాయో అర్థమవుతుంది. చర్మ అలెర్జీలు వచ్చినప్పుడు మీరు ఏం తినడం వల్ల అలెర్జీ వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోవడం చాలా మంచిది. ఇవన్నీ కూడా నిశ్శబ్ద ట్రిగ్గర్లుగా పనిచేస్తాయి.

కొన్ని ఆహారాలు చర్మ సమస్యలకు కారణం అవుతాయి. వాటి వల్ల ఎన్నో పోషకాలు శరీరానికి అందుతున్నా... చర్మానికి మాత్రం కొన్నిసార్లు అలెర్జీలు వచ్చే అవకాశం ఉంది. ఆ ఆహారాల్లో ఉండే ప్రోటీన్ నిర్మాణం, హిస్టామిన్ కంటెంట్ అనేవి అలెర్జీ కారకాలుగా ఉంటాయి. అలాంటి చర్మం అలెర్జీలను పెంచే ఆహారాలు ఏంటో ఇక్కడ కొన్ని ఇచ్చాము. మీకు అకారణంగా చర్మ అలెర్జీలు వస్తూ ఉంటే అవి ఈ ఆహార వల్లనేమో ఒకసారి చెక్ చేసుకోవాలి.

ఆవు పాలు

ఆవు పాలు మనకు మేలే చేస్తాయి. కానీ ఒక్కసారి మాత్రం అలెర్జీలను పెంచుతాయి. ఆవు పాలలో కేసైన్ అనే ప్రోటీన్ ఉంటుంది. ఈ ప్రోటీన్‌కు రోగనిరోధక శక్తి ప్రతిస్పందనగా అలెర్జీలను ఇస్తుంది. దద్దుర్లు రావడం వంటి చర్మ లక్షణాలు కనిపించవచ్చు.

కోడిగుడ్డు

ప్రతిరోజూ ఒక గుడ్డు తినమని పోషకాహార నిపుణులు చెబుతారు. కోడిగుడ్డు సంపూర్ణ ఆహారం. కొందరిలో మాత్రం ఇది చర్మ అలెర్జీకి కారణం అవుతుంది. గుడ్లలో రెండు రకాల ప్రోటీన్లు ఉంటాయి. ఇవి అలెర్జీ కారకాలు. గుడ్లు తీసుకోవడం వల్ల కొందరిలో దురద, దద్దుర్లు వంటివి చర్మంపై కనిపిస్తాయి. అవి రావడానికి కోడిగుడ్లలోని ప్రోటీన్లు కారణమై ఉండొచ్చు.

సోయా ఉత్పత్తులు

సోయా పాలు, సోయాబీన్స్, సోయా చంక్స్... ఇలా సోయా ఉత్పత్తులు మార్కెట్లో చాలా ఉన్నాయి. సోయాబీన్స్ లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఈ ప్రోటీన్ కూడా అలెర్జీ కారకంగానే పనిచేస్తుంది. సున్నితమైన చర్మాన్ని కలిగిన వ్యక్తుల్లో ఇవి అలెర్జీలను పెంచుతాయి. సోయాతో చేసిన ఉత్పత్తులు తిన్నాక దద్దుర్లు వంటివి కనిపిస్తే వాటిని తినడం తగ్గించండి.

గోధుమ పిండి

గోధుమలతో చేసిన ఆహారాలు తినడం వల్ల కొంతమందిలో అలెర్జీ వస్తుంది. ఎందుకంటే గోధుమల్లో గ్లూటెన్ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మానికి ఒక్కోసారి అలెర్జీలు వచ్చేలా చేస్తుంది.

చేపలు

కొన్ని రకాల చేపలలో అలెర్జీని కలిగించే ప్రోటీన్లు ఉంటాయి. ఇవి చర్మానికి హాని చేస్తాయి. చేపలు తిన్నాక దురద, దద్దుర్లు వంటివి వస్తే అలాంటి చేపలను తినడం మానుకోవాలని అర్థం.

నువ్వుల గింజలు

నిజానికి నువ్వులు మన శరీరానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ప్రతిరోజూ ఒక స్పూను నువ్వుల గింజలు తినమని వైద్యులు కూడా చెబుతారు. అయితే నువ్వుల్లో కొన్ని రకాల అలర్జీ ప్రోటీన్లు ఉంటాయి. ఇవి దద్దుర్లు, దురదను కలిగిస్తాయి. నువ్వులు తిన్న వెంటనే దద్దుర్లు, దురద వంటివి కనిపిస్తే అందులో ఉండే ప్రోటీన్లు మీకు పడడం లేదని అర్థం.

పైన చెప్పిన ఆహార పదార్థాలలో అలెర్జీ కారకాలైన ప్రోటీన్లు ఉంటాయి. కాబట్టి వాటిని తిన్నాక మీకు చర్మంలో ఎలాంటి తేడా కనిపించినా... వాటిని మితంగా తినడం లేదా పూర్తిగా మానేయడం చేయండి.

Whats_app_banner