Essential Vitamins in old Age : వయస్సు అయిపోతుందని బాధపడకండి.. ఈ విటమిన్లు తీసుకోండి..
Essential Vitamins in old Age: విటమిన్లు మన శరీర ఆరోగ్యానికి అవసరమయ్యే పోషకాలు. అవి లోపించినప్పుడు విభిన్న వ్యాధులు మనల్ని చుట్టుముడతాయి. అయితే వయస్సును బట్టి కొన్ని రకాల విటమిన్లు ఎక్కువ అవసరమవుతాయి. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం.
Essential Vitamins in old Age : వయస్సును బట్టి వేర్వేరు విటమిన్లు, ఖనిజ లవణాలు ఎక్కువగా అవసరమవుతాయి. బాల్యం, యవ్వనం, నడివయస్సు, వృద్ధాప్యం ఇలా మన జీవితంలో దశలను బట్టి.. మనం చేసే పనులను బట్టి శరీరానికి ఆ సమయంలో తగిన విటమిన్లు, ఖనిజ లవణాలు అవసరం. అయితే వయస్సు పైబడే కొద్దీ.. కొన్ని విటమిన్ల అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకు వాటి అవసరం మన శరీరానికి ఉందో.. వాటిని ఎందుకు మనం తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
విటమిన్ బీ 6
వయస్సు పెరుగుతున్న కొద్దీ మనలో జ్ఞాపకశక్తి తగ్గిపోతుంటుంది. మనం అనుభవించిన ఒత్తిడి, దురలవాట్లు, అనారోగ్యకరమైన జీవనశైలి ఇలాంటి అనేక కారణాలతో పాటు వయస్సు పైబడిన కొద్దీ జ్ఞాపకశక్తి కోల్పోతుంటాం. విటమిన్ బీ6 ఈ పరిస్థితిని మెరగుపరుస్తుందని పలు పరిశోధనలు నిరూపించాయి. శెనగలు, లివర్, కొవ్వు గల చేపల్లో ఇది లభ్యమవుతుంది.
విటమిన్ బీ12
విటమిన్ బీ 12.. రక్తం, కణాల వృద్ధికి తోడ్పడుతుంది. మాంసం, చేపలు, గుడ్లు, డెయిరీ ఉత్పత్తులలో బీ12 విటమిన్ లభ్యమవుతుంది. 50 ఏళ్ల పైబడిన వారిలో 30 శాతం మందిలో అట్రోఫిక్ గ్యాస్ట్రైటిస్ సమస్య ఉంటుంది. దీని కారణంగా శరీరం ఆహారం నుంచి బీ12 విటమిన్‌ను గ్రహించలేకపోతుంది. యాంటాసిడ్స్, కొన్ని రకాల మందుల వల్ల శరీరం విటమిన్ బీ12 ను నష్టపోతుంది.
విటమిన్ డీ
మన శరీరం కాల్షియంను శోషించుకోవడానికి విటమిన్ డీ అవసరం. ఆస్టియోపోరోసిస్ బారిన పడకుండా ఉండాలంటే కాల్షియం అవసరం. విటమిన్ డీ కండరాలు, నరాలు, రోగ నిరోధకత సక్రమంగా ఉండేలా చేస్తుంది. సూర్య రశ్మి నుంచి విటమిన్ డీ లభిస్తున్నప్పటికీ వయస్సు మీద పడుతున్నప్పుడు మీ శరీరం ఇలా సూర్య కిరణాలను విటమిన్ డీగా మార్చుకునే శక్తిని కోల్పోతుంది. మరోవైపు ఆహారం ద్వారా ఈ డీ విటమిన్ పెద్దగా లభించదు. సాల్మన్, మాకరెల్, సార్డైన్ చేపలు ఈ విటమిన్ డీ ఎక్కువ మొత్తంలో లభించే ఆహారం. అందువల్ల తరచుగా చేపలు తినాలి.
కాల్షియం
వయస్సు పెరిగే కొద్దీ కాల్షియం శోషించుకునే శక్తి తగ్గిపోతుంది. ఈ కారణంగా మీ ఎముకలు పెళుసుగా మారుతాయి. ఆస్టియోపోరోసిస్ సమస్య వస్తుంది. ముఖ్యంగా రుతుచక్రం ఆగిపోయిన మహిళల్లో సమస్య ఎక్కువగా ఉంటుంది. కాల్షియం ఇచ్చే ఆహారం తీసుకున్నప్పుడు మీ కండరాలు, కణాలు, నరాలు, రక్త నాళాలు బాగా పనిచేస్తాయి. 50 ఏళ్లు పైబడిన మహిళలు, 70 ఏళ్లు పైబడిన పురుషులు కాల్షియం ఎక్కువగా తీసుకోవాలి. పాలు, యోగర్ట్ వంటివి కాల్షియం ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు.
ఒమెగా - 3 ఎస్
ఒమెగా-3 ఎస్ ఒక ఫ్యాటీ యాసిడ్. ఇది మీ కంటి, మెదడు ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. వయస్సు సంబంధిత సమస్యలు అయిన అల్జీమర్స్, ఆర్థరైటిస్, అంధత్వం వంటి సమస్యలకు ఇదు విరుగుడు. కొవ్వు గల చేపలు, వాల్‌నట్స్, కనోలా నూనె, అవిశె గింజల నుంచి ఈ ఒమెగా--3 ఎస్ లభిస్తుంది.
పొటాషియం
మీ శరీరం నిర్వర్తించే ప్రతి క్రియలో పొటాషియం పాత్ర ఉంటుంది. గుండె, కిడ్నీలు, కండరాలు, నాడుల క్రియలు సక్రమంగా జరిగేలా చూస్తుంది. అంతేకాదు గుండె పోటు, హైబ్లడ్ ప్రెజర్, ఆస్టియోపోరోసిస్‌ను నివారిస్తుంది. వయస్సు పెరిగినా కొద్దీ ఆయా వ్యాధుల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఈ సమయంలో పొటాషియం అవసరం. ఎండు ఆప్రికాట్లు, అరటి పండ్లు, పాలు, పాలకూర, యోగర్ట్ వంటి వాటిలో పొటాషియం విరివిగా లభిస్తుంది.
మెగ్నీషియం
మీ శరీరం తనకు కావాల్సిన ప్రోటీన్, ఎముక తయారు చేసుకునేందుకు మెగ్నీషియం సహకరిస్తుంది. రక్తంలో షుగర్ లెవెల్స్ స్థిరంగా ఉండేందుకు తోడ్పడుతుంది. కానీ వివిధ వ్యాధులకు దీర్ఘకాలంగా మందులు వాడుతున్నందున మెగ్నిషియం లోపం ఏర్పడుతుంది. గింజలు, నట్స్, ఆకు కూరలు, కూరగాయల్లో మెగ్నీషియం లభిస్తుంది.
ఫైబర్
ఏ వయస్సు వారికైనా ఫైబర్ చాలా ముఖ్యం. కానీ వయస్సు పెరుగుతున్నప్పుడు ఫైబర్ ఇంకా అవసరం. జీర్ణ క్రియ సాఫీగా ఉండేలా చేస్తుంది. రక్తంలో కొలెస్ట్రాల్, గ్లూకోజ్ పెరగకుండా నిరోధిస్తుంది.
సంబంధిత కథనం