Spices In Tea : టీలో ఈ 5 మసాలాలు కలిపితే జీవక్రియ మెరుగుపడుతుంది!
Masala Tea Benefits In Telugu : టీ తాగితేనే కొందరికి రోజు మెుదలవుతుంది. అయితే ఇందులో మసాలాలు కలిపితే మీకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు దక్కుతాయి.
పొద్దున్నే ఒక కప్పు వేడి టీ తాగకపోతే రోజు మొదలుకాదు. చాలా మందికి పని సమయంలో 3-4 కప్పుల టీ తాగడం అలవాటు. శరీరాన్ని ఉత్తేజపరిచేందుకు, మంచి మానసిక స్థితిని నిర్వహించడానికి టీకి చాలా మంది బానిసలు. టీ తాగడం అనేది రోజూవారీ జీవితంలో అలవాటు అయిపోయింది. ఒక్కరోజు టీ లేకుంటే ఏదో కోల్పోయిన ఫీలింగ్ కలుగుతుంది. టీలో కొన్ని రకాల మసాలాలు కలిపితే మీ జీవిక్రియ రేటుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ పానీయం నూనె, స్పైసీ ఫుడ్ తిన్న తర్వాత జీర్ణక్రియకు సహాయపడుతుంది.
పాలు, పంచదార కలిపిన టీ తాగడం చాలా మందికి ఇష్టం. రోజూ ఉదయం ఇది తాగిన తర్వాతే పని మెుదలుపెడతారు. అయితే మీరు ఈ 5 మసాలా దినుసులను మిక్స్ చేసి టీని మరింత రుచికరమైన, ఆరోగ్యకరమైనదిగా మార్చుకోవచ్చు. మీరు మరింత ప్రయోజనం పొందుతారు. వివిధ వ్యాధుల నుండి కూడా ఉపశమనం పొందుతారు. టీలో కలపాల్సిన ఐదు మసాలాలు ఏంటో మనం తప్పకుండా తెలుసుకోవాలి.
దాల్చిన చెక్క టీ
దాల్చిన చెక్క టీ ఎంత రుచికరంగా ఉంటుందో అంతే ఆరోగ్యకరం. దాల్చిన చెక్కలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు ఉన్నాయి. దాల్చిన చెక్క టీ తాగడం వల్ల జీవక్రియ పెరుగుతుంది, జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అంతే కాకుండా ఈ టీ జలుబు, దగ్గుకు కూడా చాలా ఉపశమనాన్నిస్తుంది. కావాలంటే ప్రతిరోజూ దాల్చిన చెక్క టీ తాగవచ్చు. ఇది మీ జీవక్రియకు ఎంతగానో సాయపడుతుంది.
లవంగాల టీ
లవంగాలలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. లవంగాలను టీలో కలిపి తీసుకుంటే జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. ఇది కండరాల నొప్పిని కూడా తగ్గిస్తుంది. లవంగం టీ తాగడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. మీ శరీరంలోని వివిధ వ్యాధులతో పొరాడేందుకు సాయపడుతుంది.
అల్లం టీ
అల్లం టీ వల్ల కలిగే ప్రయోజనాల గురించి అందరికీ తెలుసు . అల్లంలో ఉండే ఔషధ గుణాలు అనారోగ్యం బారిన పడకుండా కాపాడతాయి. అల్లం టీ జలుబు, గొంతు నొప్పి నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంతో పాటు వివిధ రకాల సమస్యలకు అల్లం టీ బెస్ట్ ఆప్షన్. అల్లంలో ఉండే ఔషధ గుణాలు అనారోగ్యం బారిన పడకుండా కాపాడతాయి.
తులసి ఆకులు
తులసి ఆకులు మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా మేలు చేస్తాయి. విటమిన్లు, మినరల్స్ సమృద్ధిగా ఉన్న తులసి మనల్ని వివిధ వ్యాధుల నుండి కాపాడుతుంది. మీరు తులసి టీని వేసవి లేదా శీతాకాలం రెండు సీజన్లలో తాగవచ్చు. దీనిద్వారా మీరు అనేక సమస్యల నుంచి బయపడతారు. తులసి ఆకుల చాలా రకాలుగా ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
ఏలకులు టీ
ఏలకులు టీ రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది. ఏలకుల టీ తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. నోటి దుర్వాసన తొలగిపోతుంది. గొంతు నొప్పిని తగ్గిస్తుంది. ఒత్తిడి, ఆందోళన నుండి ఉపశమనం పొందుతుంది.
టీలో పైన చెప్పిన మసాలాలు కలిపితే ఆరోగ్యానికి మంచిది. అయితే టీని తాగడం కొంతమంది యుద్ధంలా చేస్తారు. కానీ ఇది అస్సలు మంచి పద్ధతి కాదు. మీరు టీ తాగడం అనేది మితంగా ఉండాలి. ఎక్కువగా చాయ్ తాగితే కడుపు సంబంధిత సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది.