HIV Symptoms: ఎయిడ్స్ బారిన పడిన 824 మంది విద్యార్థులు, హెచ్ఐవీ లక్షణాలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే-824 students infected with aids symptoms of hiv should be known by everyone ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Hiv Symptoms: ఎయిడ్స్ బారిన పడిన 824 మంది విద్యార్థులు, హెచ్ఐవీ లక్షణాలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే

HIV Symptoms: ఎయిడ్స్ బారిన పడిన 824 మంది విద్యార్థులు, హెచ్ఐవీ లక్షణాలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే

Haritha Chappa HT Telugu
Jul 10, 2024 04:33 PM IST

HIV Symptoms: త్రిపురలో 800 మందికి పైగా విద్యార్థులకు హెచ్ఐవీ పాజిటివ్ అని తేలడం అందరినీ ఆశ్చర్యపరిచింది. త్రిపురలోని అంతమంది విద్యార్థులకు ఈ వ్యాధి ఎలా వ్యాపించింది? ఎయిడ్స్ లక్షణాలు ఎలా ఉంటాయి.

ఎయిడ్స్ లక్షణాలు
ఎయిడ్స్ లక్షణాలు (Shutterstock )

HIV Positive Symptoms: త్రిపురలో 800 మందికి పైగా విద్యార్థులకు హెచ్ఐవీ పాజిటివ్ గా తేలింది. వారిలో నలభై మందికి పైగా చనిపోయారని వార్తలు వచ్చాయి. దీనితో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోయారు. అకస్మాత్తుగా ఇన్ని ఎయిడ్ కేసులు వెలుగులోకి రావడం, ఇంత మందికి ఈ వ్యాధి వ్యాపించడం అందరికీ షాక్‌కు గురి చేసింది. అదే సమయంలో ఈ వ్యాధి వచ్చినప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఈ వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తిస్తే తగిన మందులు వాడడం వల్ల ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉంది.

ఎయిడ్స్ అంటే ఏమిటి?

ఎయిడ్స్ వ్యాధి గురించి అందరూ అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎయిడ్స్ ఒక తీవ్రమైన వ్యాధి. దీన్ని సరైన సమయంలో గుర్తించి చికిత్స చేయాలి. లేకపోతే ఇది ప్రాణాంతకంగా మారుతుంది. ఇది హెచ్ఐవి వైరస్ కారణంగా వ్యాపిస్తుంది. సకాలంలో చికిత్స చేయకపోతే, ఈ వైరస్ రోగి రోగనిరోధక శక్తిని తీవ్రంగా దెబ్బతీస్తుంది, దీని వల్ల సోకిన వ్యక్తి మరణించవచ్చు. దీనికి సరైన సమయంలో చికిత్స పొందాలంటే దాని లక్షణాలను తెలుసుకోవాలి. తద్వారా శరీరంలో కనిపించే మార్పులను అర్థం చేసుకోవాలి.

ఎయిడ్స్ లక్షణాలు ఏమిటి?

ఒక వ్యక్తికి ఎయిడ్స్ సోకినప్పుడు కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయి. ఫ్లూ లేదా ఇతర వైరల్ అనారోగ్యాల మాదిరిగానే ఎయిడ్స్ కూడా కొన్ని రకాల సంకేతాలు కనిపిస్తాయి.

  1. జ్వరం, కండరాల నొప్పులు
  2. తలనొప్పి
  3. గొంతు నొప్పి
  4. రాత్రి పూట చెమటలు పట్టడం
  5. ఈస్ట్ ఇన్ఫెక్షన్లు
  6. నోటికి పూతలు రావడం
  7. గ్రంథులు వాపు
  8. విరేచనాలు

ఎయిడ్స్ సోకిన తరువాత పైన చెప్పిన లక్షణాలు మొదటగా కనిపిస్తాయి. మొదటి దశలోనే ఈ లక్షణాలు కనిపిస్తాయి. హెచ్ఐవీ తీవ్రంగా మారడానికి కొన్ని నెలల సమయం పడుతుంది. ఈ సమయంలో అనేక లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. రెండో దశలో ఎలాంటి లక్షణాలు కనిపించవు. ఈ దశ 10 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఉంటుంది. ఈ సమయంలో వ్యక్తికి ఎటువంటి లక్షణాలు కనిపించవు. అయితే, వారు ఈ కాలంలో ఈ వైరస్‌ను ఇతరులకు వ్యాప్తి చేయవచ్చు. చికిత్స చేయకపోతే, హెచ్ఐవి సోకిన వ్యక్తి 3 వ దశకు చేరుకుంటాడు. ఇది చాలా ప్రమాదకరం. ప్రాణాలు పోయే అవకాశం పెరుగుతుంది.

హెచ్ఐవి కారణంగా ఎయిడ్స్ ఉన్నవారి రోగనిరోధక శక్తి దెబ్బతింటుంది. అటువంటి పరిస్థితిలో, వారిలో ఎటువంటి ఇన్ఫెక్షన్ అయినా సులభంగా సోకుతుంది. దీని వల్ల శరీరంలోని ఏ భాగమైనా సులభంగా ప్రభావితమవుతుంది. అలాంటి వారిలో బాక్టీరియల్, వైరస్, ఫంగస్ ఇన్ఫెక్షన్లు వేగంగా సోకుతాయి. దీని వల్ల వారికి అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి.

అకస్మాత్తుగా ఈ వ్యాధి ఎలా వ్యాపించింది?

త్రిపురలో 220 పాఠశాలలు, 24 కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో హెచ్ఐవీ వైరస్ వ్యాపించినట్టు గుర్తించారు. అది ఎలా వ్యాపించిందనేది ఇప్పుడు అందరి మనసుల్లోని ప్రశ్న. విద్యార్థుల్లో డ్రగ్ ఇంజెక్షన్ల వాడకం వల్ల ఎయిడ్స్ సోకి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు.

నిరాకరణ: ఈ వ్యాసంలో పేర్కొన్న పద్ధతి, పద్ధతులు మరియు క్లెయిమ్ లను సూచనలుగా మాత్రమే తీసుకోండి. అటువంటి చికిత్స/ఔషధం/ఆహారం మరియు సలహాను అనుసరించే ముందు డాక్టర్ లేదా నిపుణుడిని సంప్రదించండి.

Whats_app_banner