Zika virus : దేశంలో మరోమారు జికా వైరస్​ కలకలం.. పూణెలో ఇప్పటికే ఆరు కేసులు!-another zika virus case detected in pune total cases at six ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Zika Virus : దేశంలో మరోమారు జికా వైరస్​ కలకలం.. పూణెలో ఇప్పటికే ఆరు కేసులు!

Zika virus : దేశంలో మరోమారు జికా వైరస్​ కలకలం.. పూణెలో ఇప్పటికే ఆరు కేసులు!

Sharath Chitturi HT Telugu
Jul 02, 2024 12:48 PM IST

Zika Virus in India : పూణెలో ఇప్పటివరకు ఆరు జికా వైరస్​ కేసులు నమోదయ్యాయి. వీరిలో ఇద్దరు గర్భవతులు సైతం ఉన్నారు.

జికా వైరస్​ కలకలంతో అధికారుల చర్యలు..
జికా వైరస్​ కలకలంతో అధికారుల చర్యలు..

జికా వైరస్​ దేశంలో మారోమారు కలకలం సృష్టిస్తోంది. మహారాష్ట్ర ప్రధాన నగరాల్లో ఒకటైన పూణెలో ఇప్పటికే ఈ వైరస్​కు సంబంధించి ఆరు కేసులు వెలుగులోకి వచ్చాయి. బాధితుల్లో ఇద్దరు గర్భవతి కూడా ఉన్నారు.

పూణెలో జికా వైరస్​ కలకలం..

పూణెలో ఇప్పటివరకు మొత్తం ఆరు జికా వైరస్​ కేసులు నమోదవ్వగా వాటిల్లో నాలుగు కేసులు ఏరండ్వానే ప్రాంతంలోవే. మరో రెండు ముంధ్వా ప్రాంతానికి చెందినవి.

ఇక గత రాత్రి ఓ 16 వారాల గర్భవతికి జికా వైరస్​ సోకినట్టు నిర్థరణ అయ్యింది. ఆమె రిపోర్టులు పాజిటివ్​ వచ్చాయి. గత వారంలో 22 వారాల గర్భవతి అయిన 28ఏళ్ల మహిళకు సైతం జికా వైరస్​ సోకింది.

గర్భవతికి జికా వైరస్​ సోకితే పిండంలో మైక్రోసెఫలి అనే సమస్య ఏర్పడే అవకాశం ఉంది.మైక్రోసెఫలి అంటే తల భాగం సాధారణం కన్నా చాలా చిన్నగా ఉండటం. మెదడు అభివృద్ధి చెందడం పడిపోవడం. పైగా జికా వైరస్​ వల్ల పుట్టబోయే బిడ్డలకు కంటి సమస్య, వినికిడి సమస్యలు తలెత్తవచ్చు.

అయితే ఈ ఇద్దరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.

వీరితో పాటు కొన్ని రోజుల క్రితం ఓ 46ఏళ్ల వైద్యుడు, ఆయన కూతురికి జికా వైరస్​ సోకింది. పరీక్షల్లో పాజిటివ్​ తేలింది. ఈ వైద్యుడికి జ్వరం, దద్దుర్లు వంటి లక్షణాలు కనిపించగా, వెళ్లి ఆసుపత్రిలో చేరారు. ఆ తర్వాత ఆయన కుమార్తెకి కూడా వైరస్​ సోకింది.

ఓ 47ఏళ్ల మహిళ, ఆమె కుమారుడు (22ఏళ్లు) కూడా జికా వైరస్​ బారినపడ్డారు.

జికా వైరస్​కు కారణం ఏడెస్​ దోమ. డెంగ్యూ, చికెన్​గునియా తరహాలోనే జికా వైరస్​ని కూడా ఈ దోమ వ్యాపింపజేస్తుంది. 1947లో యుగాండాలో తొలిసారి ఈ వైరస్​ని గుర్తించారు.

ఇక పూణెలో జికా వైరస్​ కలకలం నేపథ్యంలో అధికారులు అప్రమత్తం అయ్యారు. దోమల వ్యాప్తిని తగ్గించేందుకు ఫాగ్గింగ్​, ఫ్యూమిగేషన్​ వంటి చర్యలు చేపట్టినట్టు స్పష్టం చేశారు.

"ఇప్పటివరకు 20 సాంపిల్స్​ని టెస్ట్​ చేయించాము. ఆరుగురికి జికా వైరస్​ సోకినట్టు తేలింది. పూణె మున్సిపల్​ కార్పొరేషన్​కి చెందిన ఆరోగ్య విభాగం సర్వే చేస్తోంది. ముందస్తు జాగ్రత్తగా ఫాగ్గింగ్​ వంటి చర్యలు చేపట్టింది," అని అధికారులు మీడియాకు వివరించారు.

జికా వైరస్​ కేసుల్లో 80శాతం మందికి లక్షణాలు బయటకు కనిపించవు. అందుకే వైరస్​ సోకిందని తెలియడానికి చాలా సమయం పడుతుంది. చికిత్స అందించేందుకు ఆలస్యమవుతుంది.

మహారాష్ట్ర, కేరళలో తరచూ జికా వైరస్​ కేసులు బయటపడుతున్నాయి. ఇది ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది.

జికా వైరస్​ లక్షణాలు..

జికా వైరస్ వ్యాపించిన బాధితులలో ఎక్కువమందిలో ఎటువంటి లక్షణాలు కనిపించవు. తేలికపాటి జ్వరం, దద్దుర్లు కండరాల నొప్పి వంటివి సాధారణ లక్షణాలు మాత్రమే ఉంటాయి. కొన్ని సందర్భాలలో జికా వైరస్ సంక్రమణ సంకేతాలు లేని వ్యక్తులలో గిల్లెన్-బారే సిండ్రోమ్ వంటి నాడీ వ్యవస్థ లేదా మెదడులో సమస్యలకు దారితీస్తుంది. ఈ లక్షణాలు సాధారణంగా రెండు నుంచి ఏడు రోజుల పాటు ఉంటాయి. వ్యాధి వ్యాప్తి చెందిన 3–14 రోజుల తరువాత అనారోగ్యంతో బాధపడుతారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Whats_app_banner

సంబంధిత కథనం