Mango Picking Tips | తియ్యని మామిడిపండును కోయకుండానే ఎలా గుర్తించవచ్చు?
Mango Picking Tips: కోయకుండానే తియ్యటి మామిడిపండ్లను (Sweet Mangoes) ఎంపిక చేసుకోడానికి కొన్ని టిప్స్ ఉన్నాయి, అవేమిటో మీరూ తెలుసుకోండి.
Mango Picking Tips: వేసవికాలం మామిడిపండ్ల కోసం ప్రత్యేకమైన సీజన్. ఇప్పుడు మార్కెట్లో అనేక రకాల మామిడిపండ్లు అందుబాటులో ఉన్నాయి. నారింజ పసుపు రెండు మిక్స్ చేసిన రంగులో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. వాటి చూస్తూనే నోరూరిపోతుంది. తియ్యటి మామిడిపండు రుచిని ఆస్వాదిద్దామనుకొని తిన్నారో, పుల్లటి పులుపు మీ నరాలను జివ్వుమనేలా చేయవచ్చు. ఎందుకంటే ఆకర్షణీయంగా కనిపించే మామిడిపండ్లు అన్నీ తియ్యగా ఉండకపోవచ్చు. అవి కాయలుగా ఉండగానే కృత్రిమ పద్ధతులను ఉపయోగించి వాటిని పండేలా చేయడమే ఇందుకు కారణం. విక్రేతలు తమ లాభం కోసం మామిడికాయలను కూడా పండ్లు కనిపించేలా చేసి అమ్మేస్తారు. మరి వీటిలో సహజంగా పండిన పండ్లను గుర్తించడం ఎలా? కోయకుండానే తియ్యటి మామిడిపండ్లను (Sweet Mangoes) ఎంపిక చేసుకోడానికి కొన్ని టిప్స్ ఉన్నాయి, అవేమిటో మీరూ తెలుసుకోండి.
మామిడిపండు తొడిమెను చూడండి
మీరు మామిడిపండ్లు కొనేటపుడు మొదట మామిడిపండు పైభాగంలో ఉండే దాని తొడిమెను (Mango stem) చూడండి. ఇది మామిడిపండును దాని కొమ్మతో అతుక్కొని ఉండే కాడ భాగం. ఇప్పుడు ఈ కాడను దగ్గరగా పరిశీలిస్తే, అది దాని సమీప ప్రాంతం నుంచి దగ్గకు వచ్చినట్లుగా, చుట్టు చర్మం ముడతలతో కుచించుకుపోయినట్లుగా ఉంటే, అది సహజంగా పండిన మామిడి. ఇలాంటి పండు తియ్యగా ఉంటుంది. అలాకాకుండా కాడ బిందువు స్పష్టంగా కనిపిస్తూ, దాని చుట్టూ ప్రాంతం కూడా నిగారిస్తూ ఉండటం లేదా కాడ చిన్నగా ఉన్నట్లు గమనిస్తే అది పండని మామిడి, ఇలాంటివి ఎంచుకుంటే పుల్లగా (Sour Mango) ఉంటాయి.
మామిడిపండు అడుగున చూడండి
మీరు ఎంచుకున్న మామిడిపండు అడుగు భాగాన్ని లేదా కింది భాగాన్ని పరిశీలించండి. మామిడిపండు కింది భాగంలో కొద్దిగా నలుపుగా లేదా ముదురు రంగులో ఉండటం, అక్కడ దాని చర్మం ఎండినట్లుగా ఉంటే అవి తాజాగా పండించిన మామిడిపండు కాదని అర్థం. అంటే ఈ పండు పక్వానికి వచ్చి చాలా కాలమే (Naturally Ripened Mango) అయ్యింది, ఇలాంటి పండు తియ్యగానే ఉంటుంది. అలాకాకుండా పండు అడుగు భాగం ఆకర్షణీయంగా కనిపిస్తే అది పండని మామిడి, పుల్లగా ఉండవచ్చు.
మామిడిపండును నొక్కండి
మామిడిపండు మధ్యలో ఎక్కడో ఒకచోట నొక్కుతూ ఉండండి. మీరు నొక్కుతున్నప్పుడు స్వల్ప ఒత్తిడికే ఆ మామిడిపండు మెత్తగా, రసంగా అవుతుంటే అది పండిన మామిడిపండు తియ్యగా ఉంటుంది. అలా కాకుండా మీరు పండును నొక్కినపుడు మెత్తగా సాగుతున్నట్లుగా లోపలకు జారుతుంటే అది కృత్రిమంగా పండించిన మామిడిపండు (Artificially ripened mango fruit) అని అర్థం చేసుకోవాలి. ఇవి పుల్లగా లేదా రుచిలో చప్పగా ఉండవచ్చు.
మామిడిపండు వాసన
చివరగా, మామిడిపండు వాసన చూడండి. మీరు వాసన చూసిన మామిడిపండు నిజమైన మామిడి వాసనలా తియ్యగా ఉందనిపిస్తే దానిని ఎంచుకోవచ్చు. వాసన వెంటనే ముక్కులోకి రాదు కానీ మీకు ఆ అనుభూతి కలుగుతుంది. మరోవైపు, అతిగా పండిన లేదా చెడిపోయిన మామిడిపండ్లు వెనిగర్ వంటి వాసనను లేదా మసి వాసనను ఇస్తాయి.
మామిడిపండ్లు కొనేముందు ఈ నాలుగు విషయాలను అర్థం చేసుకుని తియ్యని వాటిని ఎంచుకోండి. అంతేకానీ దాని రంగు పొంగును, పరిమాణంను చూసి ఎంచుకోకండి.
సంబంధిత కథనం