Muskmelon । కర్బూజ తింటే ఆరోగ్యానికి ఎంత మంచిదో.. కానీ వారు జాగ్రత్త!-muskmelon amazing health benefits and side effects of kharbuja fruit ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Muskmelon । కర్బూజ తింటే ఆరోగ్యానికి ఎంత మంచిదో.. కానీ వారు జాగ్రత్త!

Muskmelon । కర్బూజ తింటే ఆరోగ్యానికి ఎంత మంచిదో.. కానీ వారు జాగ్రత్త!

HT Telugu Desk HT Telugu
Apr 25, 2023 02:32 PM IST

Muskmelon Health Benefits: కర్బూజపండులో అనేక పోషకాలు ఉన్నాయి, వేసవిలో ఈ పండు తింటే కలిగే ప్రయోజనాలు, అలాగే దుష్ప్రభావాలు తెలుసుకోండి.

Muskmelon Health Benefits:
Muskmelon Health Benefits: (Unsplash)

Muskmelon Health Benefits: వేసవికాలంలో విరివిగా లభించే పండ్లలో మస్క్‌మిలన్ (Muskmelon) కూడా ఒకటి. దీనిని మనం తరచుగా కర్బూజా అని పిలుస్తాం. ఇది పండిన వాసనతో తియ్యని రుచిని కలిగి ఉండే పండు. కర్బూజలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పండులో కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, డైటరీ ఫైబర్, సోడియం, విటమిన్ ఎ, ఫోలిక్ యాసిడ్, నియాసిన్, విటమిన్ సిలతో పాటు కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి మినరల్స్, కెరోటినాయిడ్స్‌ సమృద్ధిగా ఉండే పోషకాహారం. ఇందులో కొవ్వు, కొలెస్ట్రాల్ లేదా సంతృప్త కొవ్వు ఉండదు. కాబట్టి కర్బూజ తినడం వలన అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

ఈ పండులో నీటి శాతం కూడా ఎక్కువగా ఉంటుంది, ఇది మీ శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. కాబట్టి ఈ వేసవి కాలంలో కర్భూజాను తప్పకుండా తింటూ ఉండండి. కర్బూజా తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలేమిటో ఇక్కడ తెలుసుకోండి.

కొవ్వు తగ్గిస్తుంది

కర్బూజాలో మంచి మొత్తంలో పొటాషియం ఉంటుంది, ఇది శరీర కొవ్వును తగ్గిస్తుంది. అంతేకాకుండా ఈ పండులో నీరు కూడా ఎక్కువ ఉండటం వలన, ఇది మీ కడుపును నిండుగా ఉంచుతుంది, ఆకలిని తీరుస్తుంది, చిరుతిళ్లు తినాలనే కోరికను తగ్గిస్తుంది. కర్బూజా అధిక పీచు కలిగిన పండు, ఇది జీర్ణవ్యవస్థ పనితీరును వేగవంతం చేస్తుంది. జీవక్రియ రేటును పెంచుతుంది. ఈ రకంగా కర్బూజ కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది.

అధిక బరువు నియంత్రణ

కర్బూజా తియ్యగా ఉంటుంది కానీ, ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఈ పండు తినడం ద్వారా తీపి తినాలన్న మీ కోరికను అణిచివేస్తుంది. అందువల్ల మీ శరీరంలో ఎక్కువ కేలరీలు చేరవు. ఇది మీ బరువు తగ్గడానికి అద్భుతంగా సహాయపడుతుంది. బరువు తగ్గాలనుకునే వారు కర్బూజాను ఉదయం అల్పాహారంగా తినడం అత్యంత ప్రయోజనకరమైన మార్గం. ఈ పండును మీరు దీన్ని సలాడ్ రూపంలో లేదా స్మూతీ రూపంలో కూడా తీసుకోవచ్చు.

ఒత్తిడిని నియంత్రించగలదు

కర్బూజాలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది, ఇది హృదయ స్పందనను సాధారణీకరిస్తుంది. మెదడుకు ఆక్సిజన్ సరఫరాను పెంచుతుంది. ఈ పండు తిన్నప్పుడు మనకు మరింత విశ్రాంతికరమైన, ఏకాగ్రతతో కూడిన అనుభూతిని కలిగిస్తుంది, తద్వారా ఒత్తిడిని తొలగించేలా పనిచేస్తుంది. ఇందులో సూపర్ ఆక్సైడ్ డిస్ముటేస్‌ సమ్మేళనం ఉంటుంది, ఇది రక్తపోటును తగ్గించడం, నరాలను సడలించడం ద్వారా ఒత్తిడిని నివారిస్తుంది.

గుండెకు మంచిది

కర్బూజా తినడం హృద్రోగుల ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ పండులో ఉండే యాంటీకోగ్యులెంట్ గుణాలు, ఇందులో ఉండే అడెనోసిన్ రక్తం పలుచబడటానికి సహాయపడుతుంది, ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని స్వయంచాలకంగా తగ్గిస్తుంది. ఈ పండులో పొటాషియం కూడా పుష్కలంగా ఉంటుంది, ఇది రక్తపోటును నియంత్రిస్తుంది, తద్వారా మన గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.

కంటిచూపు పెరుగుతుంది

కర్బూజాలో తగినంత మొత్తంలో విటమిన్ ఎ, కెరోటిన్ ఉండటం వల్ల కంటిశుక్లం నివారించడంలో, కంటిచూపును మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

రోగనిరోధక శక్తిని పెంచడంలో, క్యాన్సర్ కణాలను నిరోధించడంలోనూ కర్బూజలోని పోషకాలు ప్రభావంతంగా పనిచేస్తాయి.

Muskmelon Side-Effects

కర్బూజ అతిగా తినడం వలన కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి, అవి ఎలాంటివో ఇక్కడ చూడండి.

కర్బూజలలో చక్కెర అధికంగా ఉంటుంది కాబట్టి అధికంగా తినడం ద్వారా బరువు తగ్గకపోగా, మరింత పెరిగే ప్రమాదం ఉంది. అంతేకాకుండా కర్బూజను ఎక్కువగా తినేస్తే విరేచనాలు (Loose Motions), గ్యాస్ సమస్యలు కలగవచ్చు. మధుమేహ వ్యాధిగ్రస్తులకు, కర్బూజలను తినడం ప్రమాదకరం కావచ్చు. ఇది అధిక మొత్తంలో చక్కెరను ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది, తద్వారా ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది.

WhatsApp channel

సంబంధిత కథనం