Tamarind Face Packs | పులుపుతో మెరుపు మీ సొంతం.. కొత్తగా ట్రై చేయండి..-tamarind face packs for beautiful skin ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Tamarind Face Packs | పులుపుతో మెరుపు మీ సొంతం.. కొత్తగా ట్రై చేయండి..

Tamarind Face Packs | పులుపుతో మెరుపు మీ సొంతం.. కొత్తగా ట్రై చేయండి..

Geddam Vijaya Madhuri HT Telugu
Mar 05, 2022 01:31 PM IST

చింతపండు. ఈ పదం వినగానే మీకు ముందుగా గుర్తుకు వచ్చేది చట్నీ. అయితే ఇది సౌందర్య సాధనంగా వాడతారని ఎంతమందికి తెలుసు. నిజానికి, మీరు నిస్తేజమైన చర్మంతో ఉన్నట్లయితే చింతపండు ఫేస్ ప్యాక్ మిరాకిల్ చేస్తుంది. పెళ్లికూతురు వంటి గ్లోను ఇచ్చే సత్తా దీనికి ఉంది. నమ్మడానికి కాస్త ఇబ్బందిగా ఉన్నా.. మీర వాస్తవాన్ని మాత్రం తిరస్కరించలేరు.

చింతపండు ఫేస్ ప్యాక్స్
చింతపండు ఫేస్ ప్యాక్స్

Tamarind Face Packs | సడెన్​గా ఏదైనా ఈవెంట్‌కు వెళ్లాల్సి ఉందా? మీ చర్మం కాంతితో మెరిసిపోవాలని అనుకుంటున్నారా? అయితే మీకు కావాల్సింది చింతపండు ఫేస్ ప్యాక్​. అవునండి చింతపండే. దీనిలో ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. ఇది అనేక చర్మ ప్రయోజనాలను ఇస్తుంది. చింతపండును రెగ్యులర్​గా తీసుకోవడం, అప్లై చేయడం వల్ల మచ్చలు తగ్గి చర్మం మృదువుగా మారుతుందని.. ప్రఖ్యాత చర్మవ్యాధి నిపుణురాలు, డాక్టర్ నివేదిత దాదు వెల్లడించారు.

ఎక్స్‌ఫోలియేటింగ్ ఏజెంట్ నుంచి యాంటీ బ్లెమిష్, పిగ్మెంటేషన్ మేనేజర్ వరకు, చింతపండు చర్మానికి అద్భుతంగా పనిచేస్తుందని నివేదిత తెలిపారు. ఇది ఆల్ఫా-హైడ్రాక్సీ యాసిడ్(AHA)కు మంచి మూలం. ఇది వివిధ ప్రముఖ ఎక్స్‌ఫోలియేటింగ్ క్రీమ్‌లలో ప్రధాన పదార్ధాలలో ఇది ఒకటి. ఈ పదార్థాలు చర్మం లోపల లోతుగా ఉన్న మురికిని, మలినాలను తొలగించడంలో సహాయపడతాయి. ఇది మీ చర్మంపై యాంటీ ఏజింగ్ ప్రభావాన్ని చూపిస్తుంది. చింతపండులో ఆల్ఫా-హైడ్రాక్సీ యాసిడ్స్ ఉండటమే దీనికి కారణం.

చింతపండుతో ఫేస్ ప్యాక్​లు ఎలా చేసుకోవాలంటే..

చర్మాన్ని కాంతివంతం చేసే ఫేస్ ప్యాక్: కొంత చింతపండును తీసుకుని రాత్రంతా నానబెట్టి, దాని గుజ్జును తీయండి. దీన్ని వడకట్టి, తేనె, పసుపు, కొన్ని చుక్కల పాలు లేదా పెరుగు జోడించండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసి.. బాగా శుభ్రమైన చర్మంపై అప్లై చేయండి. 20 నుండి 30 నిమిషాలు అలాగే ఉంచి సాధారణ నీటితో శుభ్రం చేసుకోండి.

టాన్ రిమూవల్ ఫేస్ ప్యాక్: నానబెట్టిన చింతపండును తీసుకుని, దాని గుజ్జును తీసి, ఒక టీస్పూన్ శనగపిండిని.. కొన్ని చుక్కల రోజ్ వాటర్​ను కలపండి. దీనిని చర్మానికి అప్లై చేసుకుని 20 నుంచి 30 నిమిషాల పాటు అలాగే ఉంచి కడిగేయండి.

స్కిన్ హైడ్రేషన్ ప్యాక్: చింతపండు గుజ్జును తీసి, అలోవెరా జెల్ జోడించండి. దానిని బాగా కలపండి. ఇప్పుడు తేనె, గ్రీన్ టీ నీరు జోడించండి. ఇప్పుడు ఈ జెల్ లాంటి మిశ్రమాన్ని మీ చర్మంపై అప్లై చేసి, సున్నితంగా మసాజ్ చేసి, 15 నిమిషాలు అలాగే ఉంచండి. దీన్ని శుభ్రం చేసుకోండి. ఎక్కువ ప్రయోజనాలను పొందడానికి ప్రతి వారం ఈ చింతపండు ఫేస్ ప్యాక్‌లను వేసుకోవచ్చు. ఇది మీ చర్మాన్ని ప్రకాశింపజేస్తుంది.

కానీ అమ్మాయిలు గుర్తించుకోండి. ఈ ప్యాక్స్​తో మీ చర్మం చికాకుగా అనిపించవచ్చు. అలా అనిపిస్తే.. ఫేస్ ప్యాక్‌ను త్వరగా కడిగేయండి. అనంతరం తేలికపాటి మాయిశ్చరైజర్‌ను అప్లై చేసి.. ఐస్​ క్యూబ్స్​తో మసాజ్ చేయండి.

WhatsApp channel