Blood Sugar Reduce Drinks । ఉదయం పూట ఇలాంటి జ్యూస్‌లు తాగండి, రక్తంలో చక్కెర తగ్గుతుంది, ఎనర్జీ పెరుగుతుంది!
Blood Sugar Reduce Drinks: రక్తంలో చక్కెర స్థాయిలను మెరుగ్గా నిర్వహించడానికి మీరు మీ అల్పాహారం సమయంలో తీసుకోగల పానీయాలు కొన్ని ఉన్నాయి, అందులో మూడు ఇక్కడ తెలుసుకోండి.
Blood Sugar Reduce Drinks: ఏదైనా తిన్నవెంటనే లేదా తాగిన వెంటనే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి ఇది అందరిలోనూ ఉంటుంది. అయితే కొద్ది సమయానికి మళ్లీ మామూలు స్థితికి వస్తుంది. కానీ మధుమేహం ఉన్నవారిలో రక్తంలో చక్కెర అనేది మామూలు స్థితికి రాదు. అందుకే తీసుకునే ఆహార పానీయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే రక్తంలో పెరిగే చక్కెర శాతాన్ని అదుపు చేయలేకపోతే అది శరీరంలోని అవయవాలను దెబ్బతీస్తుంది. కాబట్టి మధుమేహులు వారికి సూచించిన ఔషధాలను తీసుకుంటూనే, తినే ఆహారాల విషయంలోనూ శ్రద్ధపెట్టాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఉదయం పూట తీసుకునే ఆహారాలపై కచ్చితంగా శ్రద్ధ అవసరం. రాత్రంతా ఏమి తినకుండా ఉంటాము. ఆకలితో ఉదయం పూట మనం తీసుకునే ఆహారాలు ఒక్కసారిగా రక్తంలో చక్కెరను పెంచే ఆస్కారం ఉంటుంది.
కాబట్టి మధుమేహం ఉన్నవారైనా, లేనివారైనా ఉదయం పూట చక్కెరలు ఎక్కువలేని ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఈ అలవాటు మిమ్మల్ని దీర్ఘకాలం పాటు ఆరోగ్యంగా ఉంచుతుంది.
రక్తంలో చక్కెర స్థాయిలను మెరుగ్గా నిర్వహించడానికి మీరు మీ అల్పాహారం సమయంలో తీసుకోగల పానీయాలు కొన్ని ఉన్నాయి, అందులో మూడు ఇక్కడ తెలుసుకోండి.
కాకరకాయ జ్యూస్
కాకరకాయ రసం మధుమేహం ఉన్నవారికి గొప్ప పానీయం అని చెప్పవచ్చు. ఇది మీ శరీరంలోని బ్లడ్ షుగర్ లెవల్స్‌ను క్రమబద్ధీకరించడంలో సహాయపడుతుంది. కాకరకాయ రసంలో చరంటిన్ అనే క్రియాశీల పదార్ధం ఉంటుంది. ఇది రక్తంలో గ్లూకోజ్-తగ్గించే ఏజెంట్. ఉదయం పూట ఒక గ్లాసు కాకరకాయ రసం తీసుకున్నారంటే, అది మీ రక్తంలో చక్కెర స్థాయిలను సమర్థవంతంగా నియంత్రించడంలో సహాయపడుతుంది.
మెంతుల నీరు
మెంతులు సహజంగా ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరిచే ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. మెంతులలో కరిగే ఫైబర్, సపోనిన్స్ అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియ, కార్బోహైడ్రేట్ల శోషణను మందగిస్తుంది. తద్వారా రక్తంలో గ్లూకోజ్‌ని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇదేకాకుండా మెంతులు కొలెస్ట్రాల్, రక్తపోటును తగ్గించడానికి కూడా ఒక సూపర్ ఫుడ్. మెంతుల నీరు చర్మం లేదా స్కిన్ రంగు మెరిసేలా చేయడానికి కూడా సహాయపడుతుంది. .
తులసి టీ
తులసిలో హైపోగ్లైసీమిక్ , యాంటీ ఇన్ల్పమేటరీ గుణాలు ఉన్నాయి, ఇవి మధుమేహం, దాని ఇతర సమస్యలను అదుపుచేయడంలో సహాయపడతాయి. తులసిలోని గుణాలు ఇన్సులిన్ సెన్సిటివిటీని, గ్లూకోజ్ జీవక్రియను మెరుగుపరుస్తాయి. ఆటో ఇమ్యూన్ డిజార్డర్‌లను నిర్వహించడానికి, రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో కూడా తులసి సహాయపడుతుంది. 7-8 తులసి ఆకులను తీసుకొని ఒక గ్లాసు నీటిలో వేసి అందులోనే కొద్దిగా అల్లం వేసి మరిగించి చివరగా నిమ్మరసం కలుపుకొని టీ లాగా ఉదయాన్నే తాగితే చాలా ఆరోగ్యకరం.
సంబంధిత కథనం