Manjummel Boys Collections: లూసిఫర్‌ను కూడా దాటేసిన ముంజుమెల్ బాయ్స్.. 16 రోజుల్లో ఎంతంటే..
Manjummel Boys 16 Days Collections: మంజుమెల్ బాయ్స్ కలెక్షన్ల దూకుడు కొనసాగుతోంది. సూపర్ హిట్ లూసిఫర్ వసూళ్లను కూడా ఈ చిత్రం దాటేసింది. ఇంకా జోరు చూపిస్తోంది.
Manjummel Boys Collections: మలయాళ ఇండస్ట్రీలో మంజుమెల్ బాయ్స్ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. పెద్ద స్టార్ నటులు లేకుండా తక్కువ బడ్జెట్‍తో వచ్చిన ఈ చిత్రం అంచనాలకు మించి బాక్సాఫీస్ వద్ద దూసుకెళుతోంది. మలయాళ పరిశ్రమలో రికార్డులను బద్దలుకొడుతూ ముందుకు సాగుతోంది. సర్వైవల్ థ్రిల్లర్ మూవీగా ముంజుమెల్ బాయ్స్ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు చిదంబరం. రెండు వారాలు దాటినా వసూళ్ల జోరు చూపిస్తోంది ఈ చిత్రం.
మంజుమెల్ బాయ్స్ సినిమా 16 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.130 కోట్ల గ్రాస్ కలెక్షన్లను దాటేసింది. మూడో వారంలోనూ ఈ చిత్రం దుమ్మురేపుతోంది. జోరుగా వసూళ్లను రాబడుతోంది.
లూసిఫర్‌ను బీట్ చేసి..
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ సినిమా 'లూసిఫర్' లైఫ్ టైమ్ కలెక్షన్లను 16 రోజుల్లో దాటేసింది మంజుమెల్ బాయ్స్ సినిమా. లూసిఫర్ మొత్తంగా రూ.128 కోట్ల వసూళ్లను దక్కించుకుంది. అయితే, మంజుమెల్ బాయ్స్ ఇప్పుడు రూ.130 కోట్ల మార్క్ అధిగమించి లూసిఫర్‌ను దాటేసింది.
మలయాళ సినీ ఇండస్ట్రీలో టాప్ గ్రాసర్ల లిస్టులో మూడో ప్లేస్‍కు ముంజుమెల్ బాయ్స్ చేరుకుంది. 2018 (రూ.181 కోట్లు), పులిమురుగన్ (రూ.140) తర్వాతి స్థానంలో నిలిచింది. లూసిఫర్‌ను నాలుగో స్థానానికి దించేసింది.
తమిళనాడులోనూ హవా
మంజుమెల్ బాయ్స్ చిత్రానికి కేరళలోనే రూ.50కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. ఓవర్సీస్‍లోనూ దుమ్మురేపుతోంది. అయితే, మలయాళంలో వచ్చినా తమిళనాడులోనూ ఈ సినిమాకు భారీ వసూళ్లు దక్కుతున్నాయి. ఇప్పటికే తమిళనాడులో రూ.26కోట్లను ఈ చిత్రం రాబట్టింది. కొడైకెనాల్‍లోని గుహల బ్యాక్‍డ్రాప్‍లో ఈ చిత్రం రూపొందడం, గుణ సినిమా పాట కనెక్షన్ ఉండటంతో తమిళనాడులోనూ మంజుమెల్ బాయ్స్ సత్తాచాటుతోంది.
ఇప్పటికే అత్యంత వేగంగా రూ.100 కోట్ల గ్రాస్ దక్కించుకున్న మలయాళ మూవీగా మంజుమెల్ బాయ్స్ రికార్డు సొంతం చేసుకుంది. నార్త్ అమెరికాలో మిలియన్ డాలర్ల కలెక్షన్ల మార్కును దాటిన తొలి మలయాళ చిత్రంగానూ నిలిచింది. ఇంకా ఈ చిత్రానికి వసూళ్ల జోరు కొనసాగుతుండటంతో మరిన్ని ఘనతలు దక్కేలా కనిపిస్తోంది.
మంజుమెల్ బాయ్స్ గురించి..
మంజుమెల్ బాయ్స్ చిత్రంలో సౌబిన్ షాహిర్, శ్రీనాథ్ భాసీ, బాలు వర్గీస్, గణపతి ఎస్ పొడువల్, లాల్, దీపర్ పరంబోల్, అభిరామ్ రాధాకృష్ణన్, అరున్ కురియన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి చిదంబరం దర్శకత్వం వహించగా.. సౌబిన్ షాహిర్, బాబు షాహిర్, షాన్ ఆంటోనీ సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీకి సుషీన్ శ్యాం సంగీతం అందించారు.
కొచ్చి నుంచి కొందరు స్నేహితులు.. కొడైకెనాల్‍లోని గుణ గుహలకు వెకేషన్‍కు వెళతారు. అక్కడ చిక్కుల్లో పడిన ఒక ఫ్రెండ్‍ను కాపాడడం కోసం జరిగే ప్రయత్నాల చుట్టూ మంజుమెల్ బాయ్స్ కథ తిరుగుతుంది. యథార్థ ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు చిదంబరం. సర్వైవల్ థ్రిల్లర్‌గా ఉత్కంఠభరితంగా ఈ చిత్రాన్ని తీసుకొచ్చిన దర్శకుడిపై ప్రశంసలు వస్తున్నాయి.
తెలుగులోనూ..
మంజుమెల్ బాయ్స్ చిత్రం తెలుగు వెర్షన్ కూడా రాబోతోంది. తెలుగు రాష్ట్రాల్లో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనుంది. త్వరలోనే తెలుగు వెర్షన్ విడుదల తేదీ వెల్లడి కానుంది. మార్చి 15వ తేదీన రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు అంచనాలు ఉన్నాయి.