Manjummel Boys Review: మంజుమ్మెల్ బాయ్స్ రివ్యూ - మలయాళం సర్వైవల్ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందంటే?
Manjummel Boys Review: మలయాళంలో వంద కోట్ల కలెక్షన్స్‌తో మంజుమ్మెల్ బాయ్స్ రికార్డులు క్రియేట్ చేసింది. కమల్‌హాసన్ గుణ కేవ్ బ్యాక్‌డ్రాప్‌లో సర్వైవల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాకు చిందంబరం దర్శకత్వం వహించాడు.
Manjummel Boys Review: మంజుమ్మెల్ బాయ్స్ ( Manjummel Boys)మలయాళంలో ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజై బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసుకున్నది. సర్వైవల్ థ్రిల్లర్‌గా దాదాపు 20 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ 100 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. రిలీజై రెండు వారాలు అవుతోన్న థియేటర్లలో కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. షౌబీన్ షాహిర్, శ్రీనాథ్ భాషి, సాబు వర్గీస్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు చిదంబరం దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ఎలా ఉందంటే?
మంజుమ్మెల్ బాయ్స్ కథ...
కొచ్చికి చెందిన కుట్టన్ (షౌబిన్ షాహిర్), సుభాష్ (శ్రీనాథ్ భాషి) తో పాటు అతడి మిత్రులందరూ చిన్నచితకా ఉద్యోగాలు చేసుకుంటూ కుటుంబాల్ని పోషించుకుంటుంటారు.మంజుమ్మెల్ బాయ్స్ పేరుతో ఓ అసోసియేషన్ ఏర్పాటుచేస్తారు. మంజుమ్మెల్ బ్యాచ్ అందరూ కలిసి కొడైకెనాల్ ట్రిప్‌కు వెళ్తారు. ఆ ట్రిప్‌కు సుభాష్ రానని అంటాడు.
కానీ కుట్టన్ బలవంతంగా అతడిని తీసుకెళతాడు. ఓ గుడిని దర్శించుకున్న తర్వాత గుణ కేవ్ చూడటానికి స్నేహితులందరూ వెళతారు. గుణకేవ్‌లో వందల అడుగుల లోతైన లోయలు ఉంటాయి. ఆ లోయల్లో పడ్డవాళ్లెవ్వరూ ప్రాణాలతో బయటపడ్డదాఖలాలు లేవు. గుణ కేవ్ లోపలికి వెళ్లడాన్ని పోలీసులు, అటవీశాఖ వారు నిషేదిస్తారు. ఫెన్సింగ్ ఏర్పాటుచేస్తారు. సెక్యూరిటీ సిబ్బందికి కళ్లుగప్పి మంజుమ్మెల్ బాయ్స్ గుణ కేవ్ లోపలికివెళతారు.
అనుకోకుండా సుభాష్ ఓ ఇరుకైన లోయలోకి జారిపడతాడు. సుభాష్ ప్రాణాలతో బయటపడటం అసాధ్యమని స్థానికులు చెబుతారు. అయినా కుట్టన్‌తో పాటు మిగిలిన స్నేహితులు వారి మాటలను పట్టించుకోరు. సుభాష్‌ను కాపాడేందుకు ప్రయత్నిస్తుంటారు. పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడానికి వెళితే సుభాష్‌ను హత్య చేశారని వారినే అనుమానిస్తారు. లోయ లోపలికి దిగడానికి పోలీసులు, ఫైర్ డిపార్ట్‌మెంట్ వారు భయపడటంతో చివరకు సుభాష్‌ను కాపాడటానికి కుట్టన్ లోయ లోపలికి వెళతాడు? ఆ తర్వాత ఏమైంది?
ఆ ప్రమాదం నుంచి సుభాష్ ప్రాణాలతో బయటపడ్డాడా? అతడిని కుట్టన్ సేవ్ చేశాడా? తమ స్నేహితుడి ప్రాణాలను కాపాడటం కోసం మంజుమ్మెల్ బాయ్స్ ఎలాంటి సాహసం చేశారు? సుభాష్ ఫ్యామిలీ కుట్టన్‌ను ఎందుకు అపార్థం చేసుకున్నది? అన్నదే మంజుమ్మెల్ బాయ్స్(Manjummel Boys Review) కథ.
సర్వైవల్ జోనర్‌లో...
సర్వైవల్ జోనర్ హాలీవుడ్‌లో చాలా ఫేమస్. ఈ జోనర్‌లో హాలీవుడ్‌లో రెగ్యులర్‌గా సినిమాలు రూపొందుతోంటాయి. ఇండియన్ స్క్రీన్‌పై మాత్రం సర్వైవల్ మూవీస్ రావడం అరుదనే చెప్పుకోవాలి. అలాంటి అరుదైన జోనర్‌లో వచ్చిన సినిమానే మంజుమ్మెల్ బాయ్స్. 2006లో జరిగిన యథార్థ ఘటనల ఆధారంగా దర్శకుడు చిదంబరం ఈ మూవీని తెరకెక్కించాడు.
సింపుల్ పాయింట్...
వందలాది అడుగుల లోతైన లోయలో పడిన ఓ యువకుడిని అతడి స్నేహితులు ప్రాణాలకు తెగించి ఎలా కాపాడారు అన్నదే ఈ సినిమా మెయిన్ స్టోరీలైన్. సింపుల్ పాయింట్‌తో రియలిస్టిక్‌గా ఈ సినిమాను తెరకెక్కించాడు డైరెక్టర్. నటీనటుల యాక్టింగ్, విజువల్స్, బీజీఎమ్ ఈ సినిమాకు ప్రాణం పోశాయి.
షౌబిన్ షాహిర్‌తో పాటు మిగిలిన పాత్రధారులది యాక్టింగ్ అన్న అనుభూతి ఎక్కడ కలగదు. రియల్‌లైఫ్‌లో యూత్ గ్యాంగ్ ఎలా ఉంటారు, వాళ్ల అల్లరి పనులు, గొడవలు, వారి మధ్య ఉండే అనుబంధాన్ని ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యేలా చాలా సహజంగా మంజుమ్మెల్ బాయ్స్‌లో చూపించారు.
గుణ కేవ్ ప్లస్ పాయింట్...
గుణ కేవ్ సెటప్ ఈ సినిమాకు(Manjummel Boys Review) పెద్ద ప్లస్ పాయింట్‌గా మారింది. కమల్ కల్ట్ సినిమా నేపథ్యాన్ని, ఆ సినిమాలోని కమ్మని నీ ప్రేమ లేఖలే అన్న పాటను, బీజీఎమ్‌ను దర్శకుడు చక్కగా వాడుకున్నాడు.
ఫస్ట్ హాఫ్ సినిమా మొత్తం కుట్టన్‌తో పాటు అతడి గ్యాంగ్ పరిచయం, కొడైకెనాల్ టూర్ వెళ్లడం లాంటి సన్నివేశాల చుట్టే నడిపించాడు డైరెక్టర్. ఆ సీన్స్ మొత్తం యూత్ ఆడియెన్స్‌ను ఆకట్టుకునేలా తీర్చిదిద్దాడు. సుభాష్ లోయలో పడిన తర్వాత సినిమా మొత్తం ఎమోషనల్ వైపు టర్న్ తీసుకుంటుంది.
పోలీసులతో పాటు స్థానిక ప్రజలు మంజుమ్మెల్ బాయ్స్‌కు సహాయం చేయడానికి ముందుకు రాకపోవడం, సుభాష్ ప్రాణాలతో లేడని చెప్పిన ఫ్రెండ్స్ వినకుండా స్నేహితుడిని కాపాడటం కోసం తపించే సీన్స్‌లో ఉద్వేగభరితంగా నడిపించాడు డైరెక్టర్. లోయలోకి వర్షపు నీళ్లు వెళుతుండటంతో అడ్డుగా వేయడానికి ఏం లేకపోవడంతో స్నేహితులే వరద నీటికి అడ్డుగా పడుకోవడం లాంటి సింపుల్ సీన్స్ ఆడియెన్స్‌ను కట్టిపడేస్తాయి.
సుభాష్ ప్రమాదాన్ని స్నేహితులు తమ కుటుంసభ్యుల దగ్గర దాచడం, ఆ తర్వాత అది రివీలయ్యే సీన్‌తో ఎమోషనల్‌గా సినిమాను ఎండ్ చేశారు. రోప్ గేమ్‌లో మంజుమ్మెల్ బాయ్స్ ఓడిపోయే సీన్‌ను ఒకటి ఫస్ట్‌హాఫ్‌లో వస్తుంది. ఆ గేమ్ ప్రాక్టీస్ వాళ్లకు ఎలా ఉపయోగపడిందనే సీన్‌ను క్లైమాక్స్‌లో డైరెక్టర్ వాడుకున్న తీరు హైలైట్ అనిపిస్తుంది.
కొన్ని లాజిక్‌లు మిస్...
మంజుమ్మెల్ బాయ్స్‌లో పోలీసులను కావాలనే నెగెటివ్‌గా చూపించినట్లుగా అనిపిస్తుంది. సుభాష్‌ను అతడి స్నేహితులు కాపాడుతుంటే పోలీసులు చోద్యం చూస్తున్నట్లుగా ఉండటం కన్వీన్సింగ్‌గా అనిపించదు. 120 అడుగుల కంటే ఎక్కువ లోతైన లోయలోకి ఆక్సిజన్ లేకుండా కుట్టన్ దిగడం లాజిక్‌లెస్‌గా అనిపిస్తుంది.
అందరూ హీరోలే…
ఈ సినిమాలో హీరోలు అంటూ ఎవరూ లేరు. ప్రతి పాత్రకు సమానమైన ఇంపార్టెన్స్ ఉంటుంది. వీరిలో షౌబీన్ షాహీర్ ఎక్కువగా గుర్తుండిపోతాడు. అతడి నటన ఆకట్టుకుంటుంది. మిగిలిన ఫ్రెండ్స్ బ్యాచ్ యాక్టింగ్ కూడా నాచురల్‌గా ఉంది. తమిళ నటులు జార్జ్ మరియన్, రామచంద్ర కీలక పాత్రలు చేశారు
బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్....
మంజుమ్మెల్ బాయ్స్ ఇండియన్ స్క్రీన్‌పై వచ్చిన బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్ మూవీస్‌లో ఒకటిగా తప్పకుండా నిలుస్తుంది. యాక్టింగ్ పరంగా, టెక్నికల్‌గా మంచి సినిమాగా అనుభూతిని కలిగిస్తుంది.