Manjummel Boys: ఈ మలయాళం సర్వైవల్ థ్రిల్లర్ మూవీపై కాసుల వర్షం.. తొలి రోజే భారీ కలెక్షన్లు
Manjummel Boys: బాక్సాఫీస్ దగ్గర మరో మలయాళం మూవీ దుమ్ము రేపుతోంది. సర్వైవల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన మంజుమ్మల్ బాయ్స్ మూవీ రిలీజైన తొలి రోజే మమ్ముట్టి భ్రమయుగం కలెక్షన్లను బీట్ చేయడం విశేషం.
Manjummel Boys: మలయాళం సినిమాలు వరుసగా బాక్సాఫీస్ పై దండయాత్ర చేస్తున్నాయి. తక్కువ బడ్జెట్ తో భారీ వసూళ్లు సాధించే ఈ ఇండస్ట్రీకి మరో హిట్ ఖాయంగా కనిపిస్తోంది. సర్వైవల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన మంజుమ్మల్ బాయ్స్ అనే సినిమా రిలీజైన తొలి రోజే మంచి వసూళ్లు రాబట్టడం విశేషం. చిదంబరం డైరెక్ట్ చేసిన ఈ మూవీ గురువారం (ఫిబ్రవరి 22) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
మంజుమ్మల్ బాయ్స్ బాక్సాఫీస్
ఈ ఏడాది ఎక్కువ మంది రిలీజ్ కోసం ఎదురు చూసిన మలయాళం సినిమాల్లో ఈ మంజుమ్మల్ బాయ్స్ కూడా ఒకటి. సౌబిన్ షాహిర్, శ్రీనాథ్ భాసీలాంటి వాళ్లు నటించిన ఈ మూవీకి తొలి షో నుంచే పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. మూవీపై ముందు నుంచే అంచనాలు ఉండటంతో ఈ మంజుమ్మల్ బాయ్స్ ఓపెనింగ్స్ బాగున్నాయి.
తొలి రోజు ఈ సినిమాకు రూ.3.3 కోట్లు వచ్చాయి. మరోవైపు మమ్ముట్టి నటించిన భ్రమయుగం మూవీకి తొలి రోజు వచ్చిన వసూళ్లు రూ.3.1 కోట్లు మాత్రమే. దీంతో మెగాస్టార్ మమ్ముట్టి సినిమా కంటే ఎక్కువ కలెక్షన్లు సాధించి మంజుమ్మల్ బాయ్స్ సంచలనం సృష్టించింది. తొలి రోజు గురువారం కేరళ మార్కెట్ లో ఈ సినిమా ఆక్యుపెన్సీ 59.29గా ఉంది.
ఒక్క కేరళలోనే ఈ మూవీకి రూ.2.7 కోట్లు వచ్చాయి. 948 షోలలో 1.79 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి. ఇక శుక్రవారం (ఫిబ్రవరి 23) రెండో రోజు కూడా మంజుమ్మల్ బాయ్స్ కలెక్షన్లు బాగానే ఉన్నాయి. మధ్యాహ్నం వరకు చూస్తే ఈ సినిమాకు రూ.1.43 కోట్లు వచ్చాయి. ఓ నిజ జీవిత ఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. దీనిని డైరెక్టర్ చిదంబరం మరింత ఆసక్తి రేకెత్తించేలా చిత్రీకరించాడు.
2006లో కేరళకు చెందిన ఓ యువకుడు తన ఫ్రెండ్స్ తో కలిసి తమిళనాడులోని కొడైకెనాల్ కు వెళ్లాడు. అక్కడి ఓ లోతైన గుహలోకి అతడు పడిపోతాడు. ఆ తర్వాత మిగిలిన ఫ్రెండ్స్ అతన్ని ఎలా రక్షించారన్నది ఈ మూవీ స్టోరీ.
ఈ మధ్యే వచ్చిన ప్రేమలు అనే మలయాళం మూవీ కూడా ఇలాగే బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను కేవలం రూ.3 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించగా.. తొలి పది రోజుల్లోనే ఈ మూవీ రూ.40 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది.