YSRCP Nellore : ఆ నేతల విషయంలో జగన్ పొరపాటు చేశారా..? నష్టం ఎవరికి..?-did jagan make a mistake in leaving key leaders from nellore district from ysrcp ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Ysrcp Nellore : ఆ నేతల విషయంలో జగన్ పొరపాటు చేశారా..? నష్టం ఎవరికి..?

YSRCP Nellore : ఆ నేతల విషయంలో జగన్ పొరపాటు చేశారా..? నష్టం ఎవరికి..?

Maheshwaram Mahendra Chary HT Telugu
Apr 06, 2024 01:29 PM IST

AP Elections 2024 : ఏపీలో ఎన్నికల వేళ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఓ వైపు కూటమి.. మరోవైపు ఒంటరిగా పోటీ చేస్తున్న వైసీపీ మధ్య హోరాహోరీ పోరు జరగనుంది. అయితే నెల్లూరు జిల్లాకు చెందిన పలువురు నేతలు పార్టీని వీడటం… వైసీపీకి కొంత నష్టమే చేకూర్చవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఆ జిల్లా విషయంలో జగన్ పొరపాటు చేశారా..? నష్టం ఆ నేతలకా..! పార్టీకా..?
ఆ జిల్లా విషయంలో జగన్ పొరపాటు చేశారా..? నష్టం ఆ నేతలకా..! పార్టీకా..?

YSRCP Nellore District : ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల యుద్ధంలో(AP Elections 2024) డైలాగ్ వార్ నడుస్తోంది. ఓవైపు కూటమిలోని చంద్రబాబు, పవన్ సూటిగా విమర్శనాస్త్రాలు సంధిస్తుంటే… అంతే ధీటుగా వైసీపీ నుంచి జగన్ ప్రశ్నలవర్షం కురిపిస్తున్నారు. సంక్షేమ బాటలో నడుస్తున్న వైసీపీ సర్కార్ ను మరోసారి గెలిపించాలని కోరుతున్నారు. అయితే ఈ ఎన్నికల్లో వైసీపీని ఓడించాలని కూటమి నేతలు గట్టిగా ప్రచారం చేస్తున్నారు.

ప్రస్తుతం ఏపీలోని పరిణామాలు చూస్తే….. టిక్కెట్లు రాని వారు, లేకపోతే వారు అడిగిన సీట్లు దక్కలేదన్న కారణాలతో పార్టీలకు రాజీనామా చేసి వేరే పార్టీలకు జంప్ అయిపోతున్నారు. ఇది అధికార, ప్రతిపక్ష పార్టీలను సైతం వెంటాడుతున్న సమస్య. ఫలితంగా ఆయా పార్టీలకు కొద్దిమేర నష్టం జరగొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అభ్యర్థి సరైన వ్యక్తి కాకపోతే, పార్టీ మారినప్పటికీ ఎటువంటి నష్టం వాటిల్లే అవకాశం లేదని చెబుతున్నారు. అదే అభ్యర్థి బలమైన వారైతే పార్టీలు మారినా…. రాజీనామా చేసిన పార్టీకి తప్పకుండా నష్టం జరగొచ్చని అంచనా వేస్తున్నారు.

సరిగ్గా ఇదే ఇప్పుడు రాష్ట్రంలో అధికార పార్టీని వేధిస్తోంది. వైసీపీకి గుండెకాయలాంటి నెల్లూరు జిల్లా(YSRCP Nellore)లో బలమైన నేతలు రాజీనామా చేయడంతో ఆ పార్టీకి కొద్దిమేర నష్టం జరిగే అవకాశాలు లేకపోలేదని విశ్లేషకులు అంటున్నారు. అయితే ఈ ఎపిసోడ్‌లో పార్టీ అధినేత జగన్ తప్పు చేశారా? లేక పార్టీలు మారిన ఆయా నాయకులు తప్పు చేశారా? అనేది ప్రశ్నగానే మిగిలింది. నెల్లూరు జిల్లాలో ఆర్థికంగా, బలమైన నేతగా పేరొందని వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి(vemireddy prabhakar reddy), మంచి మాస్ ఫాలోయింగ్ ఉన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసిపికి రాజీనామా చేసి…. తెలుగుదేశంలో చేరారు. అయితే వీరిద్దరిని వదులుకోవటంలో వైసీపీ హైకమాండ్ తప్పు చేసిందా..? లేక వారే పార్టీని ఇబ్బందిపెట్టే ప్రయత్నం చేశారా వంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

కీలక నేతలు రాజీనామా…

మంత్రి పదవి దక్కకపోవటంతో పాటు పలు కారణాలతో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి(Kotamreddy) పార్టీకి రాజీనామా చేసి టిడిపిలో చేరారు. ఆయన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారు. ఆ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి పంచుమర్తి అనురాధ గెలుపుకు సహకరించారు. అప్పటికే అసంతృప్తి రాగం వినిపించిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, అవకాశం చూసుకొని ఇలా చేశారు. ఆయన తొలిసారి 2014లో ఎన్నికల్లో వైసిపి తరపున గెలిచారు. 2019లో కూడా రెండో సారి నెల్లూరు రూరల్ నుంచే వైసిపి తరపున గెలుపొందారు. ఆయన మంత్రి పదవి ఆశించారు. కాని ఆయనకు ఇవ్వకుండా రాష్ట్రంలో అధిక జనాభా ఉన్న బిసిలకు ప్రాధాన్యత ఇవ్వాలని అనిల్ కుమార్ యాదవ్ కు ఇచ్చారు. మంత్రి వర్గ విస్తరణలో మరొకరికి ఇచ్చారు. అలాగే నెల్లూరు జిల్లాకు చెందిన కాకాని గోవర్ధన్ రెడ్డికి కూడా మంత్రి పదవి ఇచ్చారు. కాని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డికి మాత్రం మంత్రి పదవులు దక్కలేదు.‌ దీంతో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి పార్టీపై విమర్శలు చేస్తూ వచ్చారు. ఆనం రామనారాయణరెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థికి ఓటు వేశారు. దీంతో నెల్లూరు రెడ్లైనా వీరిద్దరికి పార్టీ ఉద్వాసన పలికింది. వెంటనే టిడిపిలో చేరారు‌. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికు మొదటి జాబితాలోనే టిడిపి టిక్కెట్టు దక్కింది. కాని ఆనం రామనారాయణరెడ్డికి చివరి జాబితాలో ఇచ్చారు. దీంతో ఆనం ఊపిరి పీల్చుకున్నట్లు అయింది.

వీరిద్దరిలానే మరో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కూడా ఎమ్మెల్సీ ‌ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేశారు. అయితే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి మొండి చేయి మిగిలింది. టిక్కెట్టు ఆశించి భంగపడ్డారు. ఆయనకు టిడిపి టిక్కెట్టు ఇవ్వలేదు. ఉండవల్లి శ్రీదేవికి మాత్రం బాపట్ల ఎంపి టిక్కెట్టు ఇస్తామని టిడిపి హామీ ఇచ్చింది. అయితే, చివరి నిమిషంలో ఆ స్థానాన్ని తెలంగాణకు చెందిన బీజేపీ నేతకు టీడీపీ కట్టబెట్టింది. దీంతో ఉండవల్లి శ్రీదేవి తన‌ ట్విట్టర్ ఖాతాలో వెన్నుపోటు సింబల్ తో పోస్టు చేసి, అసంతృప్తిని వెళ్లగక్కింది. నలుగురిలో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలు సిఎం జగన్ పై(CM jagan) తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కాని వీరికి టిక్కెట్టు దక్కలేదు. దీంతో వారి పరిస్థితి ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది అన్నట్లు తయారైంది.

అయితే నెల్లూరులో వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డికి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మంచి ప్రాధాన్యత ఇచ్చారు. నెల్లూరు జిల్లా అధ్యక్ష పదవితో పాటు రాజ్యసభ ఇచ్చారు. ప్రస్తుత ఎన్నికల్లో కూడా నెల్లూరు ఎంపి సీటు ఇచ్చారు. అంత ప్రాధాన్యత జగన్ ఎవ్వరికీ ఇవ్వలేదు‌‌. ప్రభాకరరెడ్డి తన‌కు ఎంపి, తన భార్యకు ఎమ్మెల్యే టిక్కెట్టు అడిగారు. కాని జగన్ ఒక్కరికే ఇస్తానని తేల్చి చెప్పారు. దీంతో వేంరెడ్డి అలక భూనారు.‌ వెంటనే వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎన్నికల సమయంలో వైసిపికి రాజీనామా చేసి, టిడిపిలో చేరారు. టిడిపిలో ఇలా చేరడమే తరువాయి, ఆయనకు, ఆయన భార్యకు ఎంపి, ఎమ్మెల్యే టిక్కెట్లను చంద్రబాబు ఇచ్చారు. అయితే కీలకమైన కోటంరెడ్డి, వేంరెడ్డిని పార్టీనే వదులుకుందా..? లేక వారే తమ దారి చూసుకున్నారా..? అన్నది పక్కన పెడితే…. వీరు పార్టీని వీడటం వైసీపీకి కొద్దిమేర నష్టం జరిగించే అంశమే అని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం