Nellore Politics : నెల్లూరులో మారుతున్న రాజకీయం, టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించిన ఆనం, మేకపాటి
Nellore Politics : నెల్లూరు జిల్లాలో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యేలు టీడీపీ చేరుతున్నట్లు ప్రకటించారు. మేకపాటి, ఆనం త్వరలో టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు.
Nellore Politics : నెల్లూరు రాజకీయాలు మళ్లీ కాకరేపుతున్నాయి. ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యేలు టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. తాజాగా ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. మరో ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి నారా లోకేశ్ తో భేటీ అయ్యారు. ఇన్నాళ్లు వైసీపీకి దూరంగా ఉన్న నేతలు టీడీపీలో చేరేందుకు నిర్ణయించుకున్నారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా త్వరలో టీడీపీ చేరనున్నట్లు సమాచారం. కోటంరెడ్డి సోదరుడు ఇప్పటికే టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.
టీడీపీలో చేరుతున్నా- ఆనం
టీడీపీలో చేరుతున్నట్టు వైసీపీ సస్పెండెడ్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ప్రకటించారు. మూడు రోజుల్లో నెల్లూరు జిల్లాలో యువగళం పాదయాత్ర ఎంటర్ కానుంది. యువగళం పాదయాత్ర విజయవంతం చేసేందుకు కృషి చేస్తామని ఆనం రామనారాయణ రెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో మార్పు మొదలైందన్న ఆయన... శుక్రవారం రాత్రి చంద్రబాబుతో భేటీ అయినట్లు చెప్పారు. చంద్రబాబుతో అన్ని విషయాలు చర్చించామన్నారు. లోకేశ్ యువగళం పాదయాత్రపై కూడా మాట్లాడుకున్నామన్నారు. ఆనం రామనారాయణ రెడ్డితోపాటు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని టీడీపీ నేతలు కలిశారు. వారిని పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పిన సందేశాన్ని వారికి వివరించారు. టీడీపీ నేతలతో భేటీ అనంతరం ఆ పార్టీలో చేరుతున్నట్టు ఆనం ప్రకటించారు. నెల్లూరు జిల్లాలో మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా టీడీపీలో చేరుతారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఏపీలో మార్పు మొదలైందని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ముగ్గురు లోకేశ్ పాదయాత్రలో పాల్గొంటారన్నారు.
టికెట్ కోసం జగన్ ఐదు సార్లు కలిశా- మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి
టీడీపీ ఎమ్మెల్సీ లోకేశ్ తో వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సమావేశం అయ్యారు. బద్వేలు నియోజకవర్గం అట్లూరులో లోకేశ్ యువగళం పాదయాత్రకు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సంఘీభావం తెలిపారు. ఈ నెల 13న ఉమ్మడి నెల్లూరు జిల్లాలోకి లోకేశ్ యువగళం పాదయాత్ర ప్రవేశించనుంది. ఈ నేపథ్యంలో మేకపాటి లోకేశ్‌తో భేటీ అయ్యి తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. అనంతరం మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. నారా లోకేశ్‌ను కలిసి రాజకీయ పరిణామాలపై చర్చించామన్నారు. ఉదయగిరిలోకి యువగళం పాదయాత్ర ప్రవేశిస్తున్న తరుణంలో ఆయన్ని ఆహ్వానించడానికి వచ్చానన్నారు. సీఎం జగన్ ను టికెట్ కోసం ఐదు సార్లు కలిసినా లాభం లేకపోయిందన్నారు. ఎమ్మెల్సీ పదవి మాత్రమే ఇస్తానన్నారని తెలిపారు. ఇక లాభం లేదనుకొని పార్టీ నుంచి బయటికి వస్తున్నట్లు ప్రకటించారు. త్వరలో టీడీపీ చేరుతున్నట్లు తెలిపారు. తనతో పాటు నెల్లూరు జిల్లాతు చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలు టీడీపీలో చేరతారన్నారు.