Nellore Kotamreddy Protest: కోటంరెడ్డి గృహ నిర్బంధం
Nellore Kotamreddy Protest: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. నియోజక వర్గం పరిధిలోని పొట్టేపాలెంలో కలుజు మరమ్మతులు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకు పిలుపునిచ్చారు. అనుచరులతో కలిసి ఆందోళనకు సిద్ధమైన కోటంరెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు.
Nellore Kotamreddy Protest: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని పోలీసులు గృహ నిర్బంధించారు. దీంతో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రికత్త నెలకొంది. పోట్టెపాలెం కలుజు మరమ్మతులు చేయాలని డిమాండ్ చేస్తూ కోటంరెడ్డి ఆందోళనకు పిలుపునిచ్చారు. ఉదయాన్ని ఇంటి నుంచి ఆందోళన చేపట్టేందుకు వెళుతున్న కోటంరెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కోటంరెడ్డి అనుచరులు ఆందోళనకు సిద్ధమయ్యారు. పోలీసులు భారీగా మొహరించడంతో కోటంరెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.
నెల్లూరు రూరల్ పరిధిలో పొట్టేపాల్లెం కలుజు రిపేర్లు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపేందుకు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జలదీక్ష చేపట్టేందుకు సిద్ధమయ్యారు. కోటంరెడ్డి దీక్షకు అనుమతి లేదంటూ, దీక్ష చేపట్టకుండా తెల్లవారుజామున హౌస్ అరెస్టు చేశారు. దీంతో కోటంరెడ్డి నివాసానికి అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇంటి వద్ద పోలీసులు, కార్యకర్తలు మొహరించడంతో తీవ్ర ఉద్రికత్త నెలకొంది.
నాలుగేళ్లుగా అధికార పార్టీ ఎమ్మెల్యేగా మంత్రుల చుట్టూ, అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నా, సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదని కోటంరెడ్డి ఆరోపించారు. విధిలేని పరిస్థితుల్లోనే తాను నిరసనకు దిగాల్సి వచ్చిందని చెప్పారు. రూరల్ నియోజక వర్గంలో అధ్వాన్నంగా ఉన్న రోడ్లు, జగనన్న కాలనీలో కనీస వసతులు, ఇరిగేషన్ కాల్వలకు మరమ్మతులు, ముస్లిం గురుకుల పాఠశాల, బారాసాహెబ్ దర్గా సమస్యలపై గతంలో చాలా సార్లు ముఖ్యమంత్రికే నేరుగా విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయిందన్నారు.
నియోజక వర్గం పరిధిలో ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డులో గణేష్ ఘాట్‌ను అభివృద్ధి చేయాలని, నెల్లూరులో క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. బారాషాహీద్ దర్గా అభివృద్ధితో పాటు మసీదు నిర్మాణం పూర్తి చేయాలని, అసంపూర్తిగా నిలిచిపోయిన షాదీమంజిల్ పనులు పూర్తి చేయాలని కోరారు. ఆమంచర్ల పెద్ద పారిశ్రామిక వాడ అభివృద్ధి పనులు పూర్తి చేయాలని కొమ్మరపూడి రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
నియోజక వర్గంలో అంబేడ్కర్ భవన్ కమ్ స్టడీ సర్కిల్ నిర్మించాలని, బిసి భవన్, కాపు భవన్ నిర్మాణాలను పూర్తి చేయాలని కోటంరెడ్డి డిమాండ్ చేశారు. కొమ్మరపూడి, కొండ్లపూడి, దేవరపాళెం, డొంకాని గ్రామాల్లో ఇరిగేషన్ లిఫ్ట్ పథకాలను పూర్తి చేయాలన్నారు. వేలాల వ్యవసాయభూములకు సాగునీటి కోసం అమంచర్ల డీప్‌కట్ నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ముస్లింలు, దళితులకు గురు కుల పాఠశాలల నిర్మాణం పూర్తి చేయడంతో పాటు జగనన్న కాలనీల్లో కనీస సదుపాయాలు కల్పించాలంటూ కోటంరెడ్డి డిమాండ్ చేస్తున్నారు.
సమస్యల పరిష్కారం కోరుతూ అధికారుల నుంచి ముఖ్యమంత్రి వరకు ఎంత మందికి ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందని ఆరోపించారు. సమస్యలపై గట్టిగా ప్రశ్నించడంతోనే తన ఫోన్లు ట్యాప్ చేశారని గతంలో కోటంరెడ్డి ఆరోపించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాన్ని కొనసాగించారు. అసెంబ్లీ ప్రాంగణానికి ప్లకార్డును ప్రదర్శిస్తూ వెళ్లారు.
పొట్టేపాలెం వద్ద బ్రిడ్జి నిర్మాణం కోసం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విజ్ఞప్తి చేస్తున్నా కనీసం స్పందించడం లేదని కోటంరెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతోనే ఆందోళనకు దిగాల్సి వచ్చిందని చెబుతున్నారు. కొమ్మలపూడి లిప్ట్ ఇరిగేషన్ పనుల కోసం పది కోట్లు నిధులు విడుదల చేసినా, కాంట్రాక్టరుకు డబ్బులు ఇవ్వకపోవడంతో 70శాతం పనులు ఎక్కడివి అక్కడే ఉన్నాయని, వాటిని పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు.