Janasena Resignations: టిక్కెట్లు దక్కక అలకలు, అసంతృప్తులు.. రాజీనామాల బాటలో జనసేన ముఖ్య నేతలు..-janasena leaders resignations for not getting chance to contest in elections ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Janasena Resignations: టిక్కెట్లు దక్కక అలకలు, అసంతృప్తులు.. రాజీనామాల బాటలో జనసేన ముఖ్య నేతలు..

Janasena Resignations: టిక్కెట్లు దక్కక అలకలు, అసంతృప్తులు.. రాజీనామాల బాటలో జనసేన ముఖ్య నేతలు..

HT Telugu Desk HT Telugu
Apr 05, 2024 01:58 PM IST

Janasena Resignations: సార్వత్రిక ఎన్నికల ముందు జనసేనకు వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఒకరి తరువాత ఒకరు రాజీనామాలు చేస్తున్నారు. ఏపిలో అధికారంలో ఉన్న వైసిపిని ఎదుర్కొనడానికి టిడిపి, జనసేన, బిజెపిలు కూటమి కట్టాయి. అయితే కూటమి పార్టీల్లో లుకలుకలు ఎక్కువయ్యాయి.

జనసేనలో చల్లారని అసంతృప్తులు, పార్టీని వీడుతున్న నేతలు
జనసేనలో చల్లారని అసంతృప్తులు, పార్టీని వీడుతున్న నేతలు

Janasena Resignations: ఎన్నికల్లో పొత్తుల్లో భాగంగా ఎన్డీఏ కూటమితో జట్టు కట్టి జనసేన బాగా నష్టపోయింది. కూటమి కార్యరూపం దాల్చడానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముఖ్య కారణం. కూటమికి కర్త కర్మ క్రియ ఆయనే అన్నట్లు ఆయన ప్రకటనలు స్పష్టం చేస్తున్నాయి.

ఓట్లు చీలకుండా ఉండేందుకు కూటమిని ఏర్పాటు చేసేందుకు తానే కష్టపడ్డానని, అందుకు బీజేపీ BJPతో మాటలు పడాల్సి వచ్చిందని Pawan Kalyan గతంలో ప్రకటించారు. కూటమి ఏర్పడిన తరువాత ఆ పార్టీ నుంచే ఎక్కువ వ్యతిరేకతం వ్యక్తం కావడం గమనార్హం.

40 ఎమ్మెల్యే సీట్లు ఆశించిన జనసేన నేతలకు చివరకు భంగపాటు తప్పలేదు. తొలుత 24 సీట్లు కేటాయించి, మళ్లీ మూడు సీట్లు కోత పెట్టారు. చివరికి కేవలం 21 స్థానాల్లో మాత్రమే జనసేన పోటీ చేయడంపై ఆ పార్టీ కార్యకర్తలు తమ అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేశారు.

21 స్థానాల్లో కూడా వేరే పార్టీల నుంచి వచ్చిన వారికే టికెట్లు కేటాయించడంపై జనసేనలో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. జనసేన పార్టీలో టికెట్ దక్కని నేతలు బహిరంగంగానే తమ ఆక్రోశాన్ని, బాధను, దు:ఖాన్ని వెళ్ళగక్కుతున్నారు.

కొంత మంది ఏకంగా కన్నీరు పెట్టుకుంటున్నారు. ఐదేళ్ల పాటు పార్టీ కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసి, తీరా ఎన్నికలు వచ్చేసరికి వలస పక్షులకు టిక్కెట్లు ఇచ్చారని జనసైనికులు ధ్వజమెత్తుతున్నారు. పవన్ కళ్యాణ్ వ్యవహార శైలిపై తీవ్ర విమర్శలు చేస్తూ జనసేన నాయకులు పార్టీ నుంచి బయటకు వచ్చేస్తున్నారు.

ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి టిక్కెట్లు

పార్టీ కోసం ఆస్తులు, భూములు అమ్ముకొని పోటీకి సిద్ధపడుతున్న జనసేన నాయకులకు పవన్ పొత్తు పేరుతో షాక్ ఇచ్చారు. జనసేనకు గత ఐదేళ్ల పాటు పార్టీ కోసం పని చేసి, కష్ట నష్టాల్లో పార్టీ జెండాను మోసిన వారికంటే, ఎన్నికలప్పుడు పార్టీలో చేరిన వారికి పవన్ కళ్యాణ్ టిక్కెట్లు ఇవ్వడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కూటమి పొత్తులో భాగంగా వచ్చిన అరకొర సీట్లలోనే ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి టిక్కెట్లు ఇవ్వడంపై జనసేన నాయకులు అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఇక జనసేనలో జనసేనలో ఇటీవలి చేరిన‌ కొణతాల రామకృష్ణకు అనకాపల్లి అసెంబ్లీ టిక్కెట్టును పవన్ కళ్యాణ్ ఇచ్చారు.

ఇటీవలి టిడిపి నుంచి జనసేనలో చేరిన‌ మాజీ ఎమ్మెల్యే పులపర్తి ఆంజనేయులుకు భీమవరం టిక్కెట్టు ఇచ్చారు.‌ తిరుపతి వైసిపి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులుకు జనసేన టిక్కెట్టు ఇచ్చింది. అవనిగడ్డ టిక్కెట్టును టిడిపి నుంచి జనసేనలో చేరిన మండలి బుద్ధప్రసాద్ కి ఇచ్చారు. ఆయన పార్టీలో చేరిన ఒక్కరోజు వ్యవధిలో అయనకు టిక్కెట్టు కేటాయించారు.

ఇలా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి జనసేన పార్టీ ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చింది. అలాగే పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించిన రెండు లోక్‌సభ స్థానాల్లో ఒక స్థానాన్ని వలస పక్షికే ఇచ్చారు. వైసిపి నుంచి జనసేనలో చేరిన వల్లభనేని బాలశౌరికి మచిలీపట్నం ఎంపి‌ టిక్కెట్టు‌ ఇచ్చారు.

రాజీనామాల పర్వం

పార్టీ కోసం కష్టపడిన తమకు టిక్కెట్లు ఇవ్వకుండా, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి టిక్కెట్లు ఇవ్వడంపై జనసేన నేతలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. మరోవైపు పార్టీకి బలమైన నియోజకవర్గాలుగా ఉన్న గాజువాక, జగ్గంపేట, పెద్దాపురం, పాలకొల్లు, భీమిలి, ముమ్మిడివరం, కాకినాడ సిటీ, రాజమండ్రి రూరల్, అమలాపురం, ఆచంట, తణుకు, విజయవాడ పశ్చిమ తదితర నియోజకవర్గాలను పొత్తులో భాగంగా టిడిపి, బిజెపిలకు విడిచిపెట్టడంపై కూడా జనసేనానిపై నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు‌. దీంతో జనసేన నేతలు ఆ పార్టీని వీడుతున్నారు.

అనకాపల్లి నియోజకవర్గ ఇంచార్జ్‌ పరుచూరి భాస్కరరావు జనసేన పార్టీకి రాజీనామా చేశారు. జనసేన కీలక నేతల్లో ఒకరు, ముమ్మిడివరం ఇన్ చార్జ్ పితాని బాలకృష్ణ కూడా పవన్ కల్యాణ్ పార్టీకి గుడ్ బై చెప్పి వైసిపి తీర్థం పుచ్చుకున్నారు. పవన్‌ తనకు మాటిచ్చి తప్పారని, అలాంటి నిలకడలేని మనిషితో కొనసాగలేనంటూ ఆయన జనసేనకు గుడ్‌బై చెప్పారు. పవన్ పోటీ చేస్తున్న పిఠాపురంలోనే జనసేన నేత, గత ఎన్నికల్లో పిఠాపురం ఎమ్మెల్యేగా జనసేన తరపున పోటీ చేసిన మాకినేని శేషు కుమారి ఆ పార్టీకి రాజీనామా చేసి వైసిపిలో చేరారు

మరోవైపు టికెట్ దక్కకపోవడంతో కాకినాడ సిటిలో జనసేన ఇంచార్జ్ ముత్తా శశిధర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. 2019 ఎన్నికల్లో కాకినాడ సిటీ నుంచి పోటీ చేశారు. గతంలో కాకినాడలో పర్యటించిన సమయంలో ఇక్కడి సీటును ముత్తా శశిధర్‌కే కేటాయిస్తానని పవన్ హామీ ఇచ్చారు. పొత్తులో భాగంగా ఆ సీటు ఇప్పుడు టిడిపికి వదిలేసి, ముత్తా శశిధర్‌‌కు మొండిచేయి చూపారు. జనసేన నాయకులపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసి మరీ కాకినాడ మాజీ మేయర్ కవికొండల సరోజ పార్టీకి రాజీనామా చేశారు.

ఉమ్మడి తూర్పు గోదావరిలో రాజీనామాలు..

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన ప్రధాన కార్యదర్శి, ఆలమూరుకు చెందిన దళిత నేత తాళ్ల డేవిడ్ రాజ్ జనసేనకు రాజీనామా చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు సభలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ కండువాను చంద్రబాబు మేడలో వేస్తుంటే ఆయన తిరస్కరించారని అన్నారు. భవిష్యత్లో ఇంకెంత అవమానం జరుగుతుందో అనే బాధతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు.

మరోవైపు.. పవన్ కళ్యాణ్ తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తూ పార్టీకి జగ్గంపేట ఇన్చార్జ్ పాఠం శెట్టి సూర్యచంద్ర రాజీనామా చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతానని ప్రకటించారు. అమలాపురం జనసేన ఇన్ఛార్జ్ శెట్టిబత్తుల రాజాబాబు పార్టీకి రాజీనామా చేశారు. జనసేన కంచుకోటను టిడిపికి ధారాదత్తం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 2019 ఎన్నికల్లో ఓటమి నుంచి నేటి వరకు జనసేన జెండా జీవితంగా, పార్టీ తన ప్రాణంగా బతికానన్నారు.

అన్ని జిల్లాల్లో అలకలే…

మాజీ మంత్రి, కాపు సంక్షేమ అధ్యక్షుడు చేగొండి హరి రామజోగయ్య తనయుడు, ఆచంట నియోజకవర్గం జనసేన ఇన్ చార్జ్ సూర్యప్రకాష్ వైసిపిలో చేరారు. ఆయన కూడా వైసిపిలో చేరారు. తణుకు జనసేన పార్టీ ఇంచార్జ్ విడివాడ రామచంద్రరావుకే టిక్కెట్టు అని నియోజకవర్గంలో పర్యటించినప్పుడు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. దీంతో ఆయన నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి క్షేత్రస్థాయిలో పనిచేసుకున్నారు. చివరికి ఆయనకు టిక్కెట్టు ఇవ్వలేదు. దీంతో మనస్తాపనకి లోనైన రామచంద్రరావు, జనసేనకి రాజీనామా చేశారు. అనంతరం వైసిపిలో చేరారు.

పొత్తు Allianceలో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సీటు బిజెపి BJPకి ఇచ్చారు‌. అయితే దీనిపై జనసేన నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ పశ్చిమ జనసేన నాయకుడు పోతిన మహేష్‌ బిజెపి అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పోతిన మహేష్‌కు ఎమ్మెల్యే సీటు వస్తుందని పవన్ హామీ ఇవ్వడంతో ..ఆయన నియోజకవర్గంలో విసృతంగా పర్యటించి జనసేనను బలోపేతం చేశారు. అయితే టికెట్‌ దక్కకపోవడంతో పోతిన మహేష్ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

తాను పవన్ కల్యాణ్‌ను కలిసినప్పుడు మొదటి జాబితాలో నీ పేరు ప్రకటించలేకపోయామని, రెండో జాబితాలో నీ పేరు ఉంటుందని పవన్ కల్యాణే స్వయంగా తెలిపారని పోతిన మహేష్‌ పేర్కొన్నారు. తీరా తన సీటును వేరే వ్యక్తికి ఖారారు చేశారని, ఇది అన్యాయమని ఆయన కన్నీరు మున్నీరు అయ్యారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో తాను బలంగా పని చేశానని, అయిన కూడా తనకు సీటు దక్కలేదని, తెర వెనుక ఏం జరిగిందో తెలియదని పోతిన మహేష్‌ చెప్పారు.

బలమైన స్థానాన్ని ఎందుకు వదులుకోవాలని, ఎవరి కోసం త్యాగం చేయాలని పార్టీ అధినేతను పోతిన మహేష్‌ ప్రశ్నించారు. ఎవరి కోసమో తాను జెండా కూలిగా మారబోనని పోతిన మహేష్‌ స్పష్టం చేశారు. ప్రతికూల పరిస్థితుల్లో పవన్ కల్యాణ్‌తో ఉన్నామని, 2019 ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత చాలామంది జనసేనను విడిచి వెళ్లిపోయారని, అయినా కూడా తాను జనసేనలోనే ఉండి పార్టీని బలోపేతం చేశానని ఆయన చెప్పుకొచ్చారు.

తనలాంటి వ్యక్తులకు ఈ రోజున రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చిందంటే ఇంతకంటే దురదృష్టం మరొకటి లేదని పోతిన మహేష్‌ వ్యాఖ్యానించారు.ఇక రాజోలులో దేవ వరప్రసాద్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ ఇండిపెండెంట్ గా పోటీ చేయడానికి నియోజకవర్గం ఇన్ చార్జ్ బొంతు రాజేశ్వరరావు సిద్ధమయ్యారు.

WhatsApp channel

సంబంధిత కథనం