Nellore Police Searches : నెల్లూరు నారాయణ సంస్థల్లో తనిఖీలు, రూ.1.81 కోట్ల నగదు సీజ్
Nellore Police Searches : నెల్లూరులో మాజీ మంత్రి నారాయణ విద్యాసంస్థలు, అనుచరుల ఇళ్లలో పోలీసులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో లెక్కల్లో చూపని రూ.1.81 కోట్ల నగదు సీజ్ చేశామన్నారు. జీఎస్టీ ఎగవేతకు పాల్పడినందుకు NSpira సంస్థ ఎండీపై కేసు నమోదు చేశామన్నారు.
Nellore Police Searches : నెల్లూరు రాజకీయం వేడెక్కింది. మాజీ మంత్రి నారాయణ సంస్థలలో(Narayana educational society) పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాలపై నెల్లూరు పోలీసులు(Nellore Police) ప్రకటన చేశారు. నారాయణ విద్యా సంస్థలు, ఎన్.స్పిరా మేనేజ్మెంట్ మోసపూరిత లావాదేవాలకు పాల్పడిందని ఆరోపించారు. దీంతో ఆ సంస్థ ఎండీ పునీత్ కొత్తపా పై కేసు నమోదు చేశామన్నారు. ఈ తనిఖీల్లో రూ.1.81 కోట్ల అనధికార నగదును సీజ్ చేశామని ప్రకటించారు.
నెల్లూరు డీటీసీ ఫిర్యాదు మేరకు ట్యాక్స్ ఎగవేత, నకిలీ పత్రాలు దాఖలుపై నారాయణ విద్యాసంస్థలు, వాటి అనుబంధ సంస్థ ఎన్.స్పిరా ఎండీపై కేసు నమోదుచేశారు. దీంతో ఈ సంస్థల సంబంధిత వ్యక్తుల ఇళ్లపై సోమవారం ఉదయం నుంచి పోలీసు బృందాలు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో లెక్కలు చూపని రూ.1.81 కోట్లు నగదును గుర్తించి సీజ్ చేసినట్లు నెల్లూరు పోలీసులు తెలిపారు. దీనిపై నెల్లూరు బాలాజీ నగర్ పీఎస్ లో పలు సెక్షన్ల కింద కేసు చేశామన్నారు.
నారాయణ విద్యాసంస్థలు జీఎస్టీ(GST) ఉల్లంఘనలకు పాల్పడినట్లు రవాణా శాఖ ఇచ్చిన ఫిర్యాదుతో బాలాజీ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. జీఎస్టీ పోర్టల్ నమోదు చేసినట్లు NSpira సంస్థ నెల్లూరు హరనాథపురంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నప్పటికీ... ఆ సంస్థ అకౌంట్లను హైదరాబాద్ లోని కార్పొరేట్ ఆఫీసులో నిర్వహిస్తున్నట్లు తనిఖీల్లో గుర్తించామన్నారు. ఎన్.స్పిరా సంస్థ నారాయణ సంస్థలకు చెందిన పాఠశాలలు, కళాశాలలకు సేవలు అందిస్తున్నారు. ఇది ప్రధానంగా నారాయణ సంస్థలకు ఆహారం, బస, భద్రత, మౌలిక సదుపాయాలు, బస్సులు, హౌస్ కీపింగ్ సేవల్ అందిస్తుందన్నారు. అయితే ఈ సంస్థ మోటార్ వెహికల్ చట్టం ప్రకారం వాహనాల పన్నులు చెల్లించకుండా... తక్కువ పన్ను స్లాబ్ రేట్లు పొందేందుకు కొన్ని అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించామన్నారు.
92 వాహనాలను Nspira సంస్థ రూ.20.68 కోట్లకు కొనుగోలు చేసి... నారాయణ సంస్థలకు అద్దెకు ఇచ్చినట్లు రికార్డుల్లో ఉందన్నారు. కానీ ఈ వాహనాలు నారాయణ విద్యాసంస్థల పేరిట రిజిస్ట్రేషన్ అయ్యిందన్నారు. జీఎస్టీ ఎగవేతకు నిబంధనలు ఉల్లఘించినట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. ఈ సంస్థ ప్రతినిధుల ఇళ్లలో తనిఖీలు చేసినప్పుడు ఎలాంటి పత్రాలు లేని రూ.1.81 కోట్ల నగదును గుర్తించామన్నారు. ఈ నగదు ఫోర్జరీ, పన్ను ఎగవేత నేరాల ద్వారా వీరికి చేరిందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని నెల్లూరు పోలీసులు తెలిపారు.
సంబంధిత కథనం