YSRCP Incharges 9th List : నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి, మంగళగిరిలో కొత్త అభ్యర్థి…! వైసీపీ 9వ జాబితా ఇదే
YSRCP Incharges Latest List : కొత్త ఇంఛార్జులకు సంబంధించి తొమ్మిదో జాబితాను విడుదల చేసింది వైసీపీ అధినాయకత్వం. ఈ లిస్ట్ లో కీలకమైన మంగళగిరి స్థానం ఉంది.
YSRCP 9th Incharges List 2024: వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార వైసీపీ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే పలు నియోజకవర్గాల ఇంఛార్జులను మార్చిన ఫ్యాన్ పార్టీ… తాజాగా తొమ్మిదో జాబితాను శుక్రవారం రాత్రి వెల్లడించింది. ఇందులో 2 అసెంబ్లీ స్థానాలతో పాటు ఒక పార్లమెంట్ నియోజకవర్గానికి సంంబధించిన ఇంఛార్జులను ప్రకటించింది.
వైసీపీ తొమ్మిదో జాబితా:
నెల్లూరు ఎంపీ - వేణుంబాక విజయసాయిరెడ్డి
కర్నూలు - ఎండి ఇంతియాజ్
మంగళగిరి - మురుగుడు లావణ్య
తాజాగా ప్రకటించిన జాబితాలో కీలకమైన మంగళగిరి స్థానం ఉంది. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్కే ఉండగా… కొత్త ఇంఛార్జుగా మురుగుడు లావణ్య పేరును ఖరారు చేశారు. శుక్రవారం ముఖ్యమంత్రి కార్యలయం నుంచి పిలుపు రావటంతో మురుగుడు లావణ్య ముఖ్యమంత్రి జగన్ ను కలిశారు. మంగళగిరికి గతంలో గంజి చిరంజీవిని సమన్వయకర్తగా నియమించగా.. ఇప్పుడు ఆ స్థానంలో మార్పు చేసింది వైసీపీ. ఇక ఇటీవలే ఐఎఎస్ ఉద్యోగానికి వీఆర్ఎస్ ఇచ్చిన ఎండి ఇంతియాజ్ అహ్మద్ ను కర్నూలు నియోజకవర్గ ఇంఛార్జ్ గా ప్రకటించింది. ఫలితంగా ఆయన బరిలో ఉండటం ఖాయమని తెలుస్తోంది. ఇక నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ ఇంఛార్జుగా విజయసాయిరెడ్డి పేరు ఖరారైంది.
ఇటీవలనే వైఎస్సార్సీపీ తరపున ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులతో కూడిన ఎనిమిదో జాబితాను కూడా ఈ బుధవారమే విడుదల చేసింది. పార్లమెంట్ నియోజకవర్గాల్లో గుంటూరుకు కిలారు రోశయ్య, ఒంగోలుకు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని.. అసెంబ్లీ స్థానాల్లో పొన్నూరుకు మంత్రి అంబటి రాంబాబు సోదరుడు అంబటి మురళి, కందుకూరుకు బుర్రా మధుసూదన్ యాదవ్, జీడీ నెల్లూరుకు కృపాలక్ష్మిని సమన్వయకర్తలుగా నియమిస్తూ పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది.
ఇప్పటికే వైసీపీ లోక్‌సభ ఎంపీలు డాక్టర్ సంజీవ్‌కుమార్ (కర్నూలు), లావు శ్రీకృష్ణ దేవరాయలు (నరసరావుపేట), వల్లభనేని బాలశౌరి (మచిలీపట్నం), రఘురామకృష్ణరాజు (నరసాపురం) పార్టీకి రాజీనామా చేశారు. మొత్తం అయిదుగురు లోక్‌సభ సభ్యులు, రాజ్యసభ సభ్యుడిగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీని వీడారు. అరకు ఎంపీ గొడ్డేటి మాధవి , హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ కు టికెట్ కేటాయించ లేదు. 2019లో లోక్‌సభకు ఎన్నికైన వారిలో ఏడుగురు ఎంపీలకు ఈసారి అవకాశం లేకుండా పోయింది.
అరకు ఎంపీగా ఉన్న గోడ్డేటి మాధవిని అరకు అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ సమన్వయకర్తగా నియమించారు. తాజాగా అక్కడ మరో కొత్త సమన్వయకర్తను తెరపైకి తీసుకువచ్చారు. మాధవిని పూర్తిగా పక్కన పెట్టేశారు. ఆమెకు మరోచోట టికెట్ ఇస్తారా లేదా అనే విషయంలో స్పష్టత లేదు. ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ ఈసారి ఎన్నికల్లో పోటీ చేయలేనని ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు.
గత జనవరి నుంచి వైసీపీ అసెంబ్లీ, లోక్‌సభ నియోజక వర్గాలకు అభ్యర్థుల్లో మార్పులు చేర్పులు చేస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో దాదాపు 65 స్థానాల్లో మార్పులు చేసింది. కొందరిని పూర్తిగా పక్కన పెట్టడమో, పార్లమెంటు అభ్యర్థుల్ని ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్యేలను ఎంపీ స్థానాలకు ప్రకటించడమో చేశారు. మొత్తం ఎనిమిది జాబితాల్లో పెద్ద ఎత్తున బీసీ అభ్యర్థులకు స్థానం కల్పించారు.