MP Vemireddy Prabhakar Reddy : వైసీపీకి గట్టి షాక్, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజీనామా-త్వరలో టీడీపీలోకి!
MP Vemireddy Prabhakar Reddy : నెల్లూరు జిల్లాలో వైసీపీ గట్టి షాక్ తగిలింది. వైసీపీకి, ఎంపీ పదవికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజీనామా చేశారు.
MP Vemireddy Prabhakar Reddy : ఎన్నికల ముందు వైసీపీ గట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. నెల్లూరు వైసీపీలో కీలక నేత, రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి(Vemireddy Prabhakar Reddy) రాజీనామా చేశారు. ఆయన వైసీపీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు వేమిరెడ్డి వైసీపీ అధ్యక్షుడు, సీఎం జగన్ లేఖ రాశారు. వైసీపీ సభ్యత్వంతో పాటు తన రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. అయితే వ్యక్తిగత కారణాలతో తాను వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు వేమిరెడ్డి ప్రకటించారు.
అసెంబ్లీ టికెట్ల వ్యవహారం
నెల్లూరు పార్లమెంటు వైసీపీ అభ్యర్ధిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేరును కొద్ది రోజుల క్రితం అధిష్టానం ఖరారు చేశారు. అయితే తాను సూచించిన వారికి పార్లమెంటు పరిధిలో టిక్కెట్లు ఇవ్వాలని వేమిరెడ్డి పట్టుబట్టారు. అనిల్ కుమార్ యాదవ్ (Anil Kumar Yadav)విభేదాల నేపథ్యంలో ఆయనకు నెల్లూరు సిటీ టికెట్ వ్యవహారం మెలికిపెట్టారు. పార్టీ సైతం అనిల్ కుమార్ స్థానం మార్చింది. అయితే నెల్లూరు సిటీ(Nellore)లో తన భార్యకు అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని కోరారు. కానీ పార్టీ అనిల్ కుమార్ యాదవ్ అనుచరుడు ఎం.డి ఖలీల్ ను ఇన్ ఛార్జ్ గా నియమించింది. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు వేమిరెడ్డి దూరంగా ఉంటున్నారు. తాను అభ్యర్థులను సూచించినా పార్టీ పట్టించుకోలేదని వేమిరెడ్డి పార్టీ వ్యవహారాలకు అంటిముట్టనట్టు ఉన్నారు.
రాజ్యసభ పదవీకాలం ముగియనుండడంతో
గత వారం సీఎం జగన్మోహన్ రెడ్డి(CM Jagan) దిల్లీ పర్యటన సందర్భంగా అందుబాటులో ఉండాలని పార్టీ సమాచారం ఇచ్చినా వేమిరెడ్డి పట్టించుకోలేదు. ముందస్తు షెడ్యూల్ ఉందంటూ ఆయన దుబాయ్ వెళ్లిపోయారు. అంతకు ముందే ఆయన పార్టీ మారేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు ప్రచారం జరిగింది. మరికొద్ది రోజుల్లో వేమిరెడ్డి రాజ్యసభ పదవీకాలం ముగియనుండటంతో తన దారి తాను చూసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.
చంద్రబాబుతో భేటీ!
వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీ(TDP)లో చేరేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. ఇవాళ వైసీపీకి రాజీనామా చేసిన ఆయన త్వరలోనే టీడీపీలో చేరేందుకు రెడీ అవుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇటీవల టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి హైదరాబాద్ లో భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసంలో వేమిరెడ్డి చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. త్వరలోనే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తన అనుచరులతో కలిసి టీడీపీలో చేరుతారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వేమిరెడ్డి దంపతుల్ని చంద్రబాబు టీడీపీలోకి ఆహ్వానించినట్టు పార్టీ ముఖ్యనేతలు చెబుతున్నారు.
వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి టీడీపీలోకి ఆహ్వానించారు. వేమిరెడ్డి దంపతులు వైసీపీకి రాజీనామా చేయడం మంచి పరిణామన్నారు. వేమిరెడ్డి కుట్రలు, కుతంత్రాలు చేసే నేత కాదని, వైసీపీలో ఇమడలేకే వేమిరెడ్డి బయటకు వచ్చారని సోమిరెడ్డి తెలిపారు.
సంబంధిత కథనం