Ysrcp Fifth List : వైసీపీ ఐదో జాబితా విడుదల-నర్సారావు పేట ఎంపీ అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్-tadepalli news in telugu ysrcp fifth list released anil kumar yadav promoted to narasaraopet mp candidate ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ysrcp Fifth List : వైసీపీ ఐదో జాబితా విడుదల-నర్సారావు పేట ఎంపీ అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్

Ysrcp Fifth List : వైసీపీ ఐదో జాబితా విడుదల-నర్సారావు పేట ఎంపీ అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్

Bandaru Satyaprasad HT Telugu
Jan 31, 2024 09:40 PM IST

Ysrcp Fifth List : నాలుగు ఎంపీ స్థానాలకు, మూడు ఎమ్మెల్యే స్థానాలకు ఇన్ ఛార్జ్ లను మారుస్తూ వైసీపీ ఐదో జాబితాను ప్రకటించింది. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ నర్సారావుపేట ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది.

వైసీపీ ఐదో జాబితా విడుదల
వైసీపీ ఐదో జాబితా విడుదల

Ysrcp Fifth List : ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికార వైసీపీ పార్టీలో మార్పుచేర్పులు చేస్తుంది. అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల ఇన్ ఛార్జ్ లను మారుస్తుంది. తాజాగా వైసీపీ ఐదో జాబితా విడుదల చేసింది. సీఎం జగన్ ఆదేశాలతో ఇన్ ఛార్జ్ లను మార్చినట్లు మంత్రి బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. నాలుగు ఎంపీ స్థానాలకు, మూడు ఎమ్మెల్యే స్థానాలకు ఇన్‌ఛార్జ్ లను మారుస్తూ వైసీపీ ఐదో జాబితాను ప్రకటించింది.

  • అరకు వ్యాలీ(ఎస్టీ)- రేగం మత్స్య లింగం
  • సత్యవేడు(ఎస్సీ)-నూకతోటి రాజేష్
  • అవనిగడ్డ- డా.సింహాద్రి చంద్రశేఖరరావు
  • కాకినాడ(ఎంపీ)- చలమలశెచ్చి సునీల్
  • మచిలీపట్నం(ఎంపీ)-సింహాద్రి రమేష్ బాబు
  • నర్సారావుపేట(ఎంపీ)-పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్
  • తిరుపతి(ఎస్సీ)(ఎంపీ)-మద్దిల గురుమూర్తి

సీఎం జగన్ ఆదేశాలతో పార్టీ రీజినల్ కో-ఆర్టినేటర్ విజయసాయిరెడ్డికి అదనంగా గుంటూరు పార్లమెంటు నియోజకవర్గం బాధ్యతలు అప్పగించారు. ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గం, కందుకూరు, సంతనూతలపాడు, కావలి అసెంబ్లీ నియోజకవర్గాలకు రీజినల్ కో-ఆర్డినేటర్ గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నియమించింది అధిష్టానం. ఇప్పటి వరకూ తొలి జాబితాలో 11 స్థానాలకు, రెండో జాబితాలో 27 స్థానాలకు, మూడో జాబితాలో 21 స్థానాలకు, నాలుగో జాబితాలో 8 స్థానాలకు పార్టీ సమన్వయకర్తలను మార్పుచేర్పు చేసింది వైసీపీ.

ఎస్సీ, ఎస్టీ నియోజక వర్గాల్లోనే ఎక్కువ మార్పులు

గెలుపే లక్ష్యంగా వైసీపీ అసెంబ్లీ అభ్యర్థులను ఎంపిక చేస్తోంది. డిసెంబర్ 11 నుంచి ఇప్పటి వరకు ఐదు జాబితాలను ప్రకటించారు. వీటిలో పార్లమెంటు, అసెంబ్లీ నియోజక వర్గాలకు సమన్వయకర్తలను ఆ పార్టీ ప్రకటిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సైతం సీట్లు నిరాకరిస్తూ కొత్తవారికి చోటు కల్పిస్తున్నారు. మరికొన్ని చోట్ల స్థాన చలనం కల్పిస్తున్నారు. ఐదు జాబితాల్లో కలిపి 61 అసెంబ్లీ నియోజక వర్గాల్లో అభ్యర్థుల్ని ఆ పార్టీ మార్చేసింది. వీటిలో అత్యధికంగా ఎస్సీ, ఎస్టీ నియోజక వర్గాలే ఉన్నాయి.

తొలి జాబితా

డిసెంబర్‌ 11న విడుదల చేసిన జాబితాలో 11 సమన్వయకర్తలను ప్రకటించారు. వీటిలో ప్రత్తిపాడు ఎస్సీ నియోజక వర్గానికి బాలసాని కిరణ్‌కుమార్‌, కొండేపిలో ఆదిమూలపు సురేష్‌, వేమూరులో వరికూటి అశోక్‌బాబు, తాడికొండలో మేకతోటి సుచరిత, సంతనూతలపాడులో మేరుగు నాగార్జున ఉన్నారు. ఇవన్నీ ఎస్సీ రిజర్వుడు స్థానాలుగా ఉన్నాయి. మొదటి జాబితాలో ఐదు ఎస్సీ రిజర్వుడు స్థానాల్లో అభ్యర్థుల్ని మార్చేశారు. మిగిలిన వాటిలో చిలకలూరిపేటలో మల్లెల రాజేష్‌ నాయుడు, గుంటూరు పశ్చిమలో విడదల రజిని, అద్దంకిలో పాణెం హనిమిరెడ్డి, మంగళగిరిలో గంజి చిరంజీవి, రేపల్లెలో ఈపూరు గణేష్‌, గాజువాకలో వరికూటి రామచంద్రరావులు ఉన్నారు.

రెండో జాబితా

జనవరి 2వ తేదీన విడుదల చేసిన జాబితాలో పలువురు ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను మార్చేశారు. వీటిలో అనంతపురం ఎంపీగా మాలగుండ్ల శంకరనారాయణ, హిందూపురం ఎంపీగా జోలదరాశి శాంత, ఎస్టీ రిజర్వుడు స్థానమైన అరకులో కొళ్లగుళ్లి భాగ్యలక్ష్మీలను సమన్వయకర్తలుగా నియమించారు. అసెంబ్లీ నియోజక వర్గాల్లో రాజాం ఎస్సీ రిజర్వుడు స్థానంలో తాలె రాజేష్‌, పాయకారావుపేట(ఎస్సీ)లో కంబాల జోగులు, పి.గన్నవరంలో విప్తర్తి వేణుగోపాల్, పోలవరం(ఎస్టీ) తెల్లం రాజ్యలక్ష్మీ, ఎర్రగొండపాలెంలో తాటిపర్తి చంద్రశేఖర్‌, అరకులో(ఎస్టీ) గొడ్డేటి మాధవి, పాడేరు(ఎస్టీ)లో మత్స్యరాస విశ్వేశ్వర రాజు ఉన్నారు.

రెండో జాబితాలో అనకాపల్లిలో మలసాల భరత్‌కుమార్‌, రామచంద్రాపురంలో పిల్లి సూర్యప్రకాష్‌, పిఠాపురంలో వంగాగీత, జగ్గంపేటలో తోట నరసింహం, ప్రత్తిపాడులో వరుపుల సుబ్బారావు, రాజమండ్రి సిటీలో మార్గాని భరత్, రాజమండ్రి రూరల్‌లో చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, కదిరిలో బి.ఎస్‌.మక్బూల్ అహ్మద్, ఎమ్మిగనూరులో మాచాని వెంకటేష్, తిరుపతిలో భూమన అభినయ్ రెడ్డి, గుంటూరు ఈస్ట్‌లో షేక్ నూరి ఫాతిమా, మచిలీపట్నంలో పేర్ని కృష్ణమూర్తి, చంద్రగిరిలో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, పెనుగొండలో కె.వి.ఉషశ్రీ చరణ్, కళ్యాణదుర్గంలో తలారి రంగయ్య, విజయవాడ సెంట్రల్‌లో వెల్లంపల్లి శ్రీనివాసరావు, విజయవాడ వెస్ట్‌లో షేక్‌ ఆసిఫ్‌ ఉన్నారు.

మూడో జాబితా

జనవరి 11న ప్రకటించిన మూడో జాబితాలో శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థిగా పేరాడ తిలక్, విశాఖపట్నం ఎంపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ లక్ష్మీ, ఏలూరు ఎంపీ అభ్యర్థిగా కారుమూరి సునీల్ కుమార్ యాదవ్, విజయవాడ ఎంపీగా కేశినేని నాని, కర్నూలు ఎంపీగా గుమ్మనూరి జయరాం, తిరుపతి ఎంపీగా కోనేటి ఆదిమూలం పేర్లను ప్రకటించారు. రిజర్వుడు స్థానాల్లో పూతలపట్టులో సిట్టింగ్ ఎమ్మెల్యే ఎంఎస్‌బాబును తప్పించి మూతిరేవుల సునీల్‌కుమార్‌ను నియమించారు. చింతలపూడిలో కంభం విజయరాజు, కోడుమూరులో డాక్టర్‌ సతీష్‌, గూడూరులో మేరిగ మురళి, సత్యవేడులో మద్దిల గురుమూర్తిలను ఖరారు చేశారు. ఇచ్చాపురం సమన్వయకర్తగా పిరియ విజయ, టెక్కలిలో దువ్వాడ శ్రీనివాస్, రాయదుర్గంలో మెట్టు గోవిందరెడ్డి, దర్శిలో బూచేపల్లి శివప్రసాద్‌ రెడ్డి, చిత్తూరులో విజయానందరెడ్డి, మదనపల్లెలో నిస్సార్ అహ్మద్, రాజంపేటలో ఆకేపాటి అమర్‌నాథ్ రెడ్డి, ఆలూరులో బూసినే విరూపాక్షి, పెనమలూరులో జోగి రమేష్‌, పెడనలో ఉప్పాల రాములను సమన్వయకర్తలుగా నియమించారు.

నాలుగో జాబితా

నాలుగో జాబితాలో ఏకంగా ఎనిమిది చోట్ల ఎస్సీ అభ్యర్థుల పేర్లు మారిపోయాయి. చిత్తూరు ఎంపీ నారాయణ స్వామిని ఖరారు చేశారు. గంగాధర నెల్లూరులో ఎన్‌.రెడ్డప్పను, శింగనమలలలో జొన్నలగడ్డ పద్మావతి స్థానంలో ఎం.వీరాంజనేయులు, నందికొట్కూరులో డాక్టర్ దారా సుదీర్, తిరువూరులో నల్లగట్ల స్వామిదాసు, మడకశిరలో ఈర లక్కప్ప, కొవ్వూరులో తలారి వెంకట్రావు, గోపాలపురంలో తానేటి వనిత, కనిగిరిలో దద్దాల నారాయణ యాదవ్‌లను ఖరారు చేశారు. నాలుగో జాబితాలో 9 స్థానాల్లో 8 ఎస్సీ స్థానాల్లో అభ్యర్థుల్ని మార్చేశారు. అభ్యర్థుల మార్పులు జరిగిన నియోజక వర్గాల్లో రిజర్వుడు స్థానాల్లో స్థాన చలనం కల్పిస్తే, ఓసీలు ఉన్న చోట సిట్టింగుల వారసులకు చోటు కల్పించారు. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజక వర్గాల్లోనే రకరకాల కారణాలతో అభ్యర్థుల్ని మార్చేయడమో, సీటు నిరాకరించడమో జరిగింది. ఇంకెంత మందికి ఉద్వాసన, స్థాన చలనం జరుగుతుందో వేచి చూడాలి.

Whats_app_banner