Vemireddy Meets CBN: టీడీపీలోకి వేమిరెడ్డి..! అదే బాటలో మరికొందరు వైసీపీ నేతలు.. దూకుడు పెంచిన చంద్రబాబు-mp vemireddy to ycp some other ycp leaders are on the same path meets chandrababu ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Vemireddy Meets Cbn: టీడీపీలోకి వేమిరెడ్డి..! అదే బాటలో మరికొందరు వైసీపీ నేతలు.. దూకుడు పెంచిన చంద్రబాబు

Vemireddy Meets CBN: టీడీపీలోకి వేమిరెడ్డి..! అదే బాటలో మరికొందరు వైసీపీ నేతలు.. దూకుడు పెంచిన చంద్రబాబు

Sarath chandra.B HT Telugu
Published Feb 14, 2024 08:21 AM IST

Vemireddy Meets CBN: వైసీపీ ఎంపీ వేమిరెడ్డి టీడీపీ గూటికి చేరనున్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఢిల్లీ పర్యటన తర్వాత స్తబ్దుగా ఉన్నట్టు కనిపిస్తున్నా తెర వెనుక పనుల్ని చక్కబెట్టుకునే పనిలో బాబు బిజీగా ఉన్నారు.

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో వేమిరెడ్డి దంపతుల భేటీ
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో వేమిరెడ్డి దంపతుల భేటీ

Vemireddy Meets CBN: ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో వైసీపీ నుంచి మరో ముఖ్య నాయకుడు టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. రాజ్యసభ Rajyasabha సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి Vemireddy prabhakar Reddy వైసీపీని వీడి టీడీపీలో చేరేందుకు రెడీ అవుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. గత కొద్ది రోజులుగా వేమిరెడ్డి వైసీపీ అధిష్టానం తీరుపై అసంతృప్తితో ఉన్నారు.

నెల్లూరు పార్లమెంటు YCP అభ్యర్ధిగా వేమిరెడ్డి పేరును కొద్ది రోజుల క్రితం ఖరారు చేశారు. ఆ తర్వాత తాను సూచించిన వారికి పార్లమెంటు పరిధిలో టిక్కెట్లు ఇవ్వాలని వేమిరెడ్డి సూచించినా పార్టీ పట్టించుకోలేదు. దీంతో వేమిరెడ్డి అంటిముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. నెల్లూరు Nellore అసెంబ్లీ స్థానాలకు తాను సూచించిన వారిని కాకుండా ఇతరులకు టిక్కెట్లు ఇవ్వడంతో అలకబూనారు. పార్టీ నాయకులకు అందుబాటులో లేకుండా పోయారు. .

గత వారం సిఎం జగన్మోహన్ రెడ్డి Ys Jagan ఢిల్లీ పర్యటన సందర్భంగా అందుబాటులో ఉండాలని సమాచారం ఇచ్చినా వేమిరెడ్డి పట్టించు కోలేదు. ముందస్తు షెడ్యూల్ ఉందంటూ దుబాయ్ వెళ్లిపోయారు. అంతకు ముందే ఆయన పార్టీ మారేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు ప్రచారం జరిగింది. మరికొద్ది రోజుల్లో రాజ్యసభ పదవీ కాలం ముగియ నుండటంతో తన దారి తాను చూసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.

తాజాగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు CBN తో వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి భేటీ జరిగింది. మంగళవారం ఉదయం హైదరాబాద్‌లో చంద్రబాబు నివాసంలో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. వైసీపీని వీడి టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. త్వరలోనే వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి తన వర్గంతో కలిసి టీడీపీలో చేరుతారని టీడీపీ వర్గాలు చెబుతున్నారు. వేమిరెడ్డి దంపతుల్ని టీడీపీలోకి ఆహ్వానించినట్టు TDP నేతలు చెబుతున్నారు.

నెల్లూరు లోక్‍సభ టీడీపీ అభ్యర్థిగా వేమిరెడ్డి పోటీచేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. కొంతకాలం నుంచి వైసీపీకి దూరంగా ఉన్న ఎంపీ వేమిరెడ్డి పరిస్థితుల్లో మార్పు లేకపోవడంతో తన దారి తాను చూసుకోవాలని భావిస్తున్నారు. వేమిరెడ్డి భార్య ప్రశాంతి కూడా టీడీపీలోకి రానున్నట్టు చెబుతున్నారు. నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి సైతం టీడీపీలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని టీడీపీ ఎన్నికల బాధ్యతలు చూస్తున్న వర్గాలు తెలిపాయి.

నేతలతో చంద్రబాబు వరుస భేటీలు….

ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే అభ్యర్థుల్ని ఖరారు చేసిన నియోజక వర్గాల్లో నాయకులతో చంద్రబాబు చర్చలు జరిపారు. సత్తెనపల్లిలో కోడెల శివరామ్‌ ను వైసీపీ రెచ్చగొడుతోందని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ.. చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. సత్తెనపల్లిలో కోడెల శివరామ్‌ వ్యవహారంపై చంద్రబాబు పార్టీ నాయకులతో చర్చించినట్టు తెలుస్తోంది.

సోమవారం సాయంత్రం ఉండవల్లి Undavalli నివాసంలో పలువురు ముఖ్య నాయకులు చంద్రబాబుతో భేటీ అయ్యారు. చంద్రబాబుతో భేటీ అయిన వారిలో ఆనం రామనారాయణ రెడ్డి, అఖిలప్రియ, కన్నా లక్ష్మీనారాయణ, నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి, దామచర్ల జనార్థన్, ఉగ్ర నరసింహారెడ్డి, కందుల నారాయణ రెడ్డి, బిటెక్ రవి తదితరులు ఉన్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసే అభ్యర్థులకు ప్రచారం ప్రారంభించాలని చంద్రబాబు సూచిస్తున్నారు. జాబితాలు విడుదల చేస్తే స్థానికంగా పోటీ ఉన్న చోట ఇబ్బందులు తలెత్తుతాయని భావిస్తున్నారు. పొత్తులపై ఇంకా స్పష్టత రాకపోవడం, టీడీపీ బలంగా ఉన్న స్థానాలను కూడా పొత్తులో భాగంగా వదులుకోవాల్సి రావడం ఇబ్బందికరంగా మారింది.

ఈ నేపథ్యంలో జాబితాలను విడుదల చేస్తే ప్రత్యర్థులకు మరింత బలం చేకూర్చినట్టు అవుతుందని భావిస్తున్నారు. ఖచ్చితంగా పోటీ చేసే అభ్యర్థులకు చంద్రబాబు ఇప్పటికే టిక్కెట్ల కేటాయింపు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది.

పార్టీ మారడం లేదన్న ఆదాల…

వేమిరెడ్డితో పాటు ఆదాల, మాగుంట కూడా టీడీపీలో చేరుతున్నారనే ప్రచారాలను ఆదాల ఖండించారు. తాను పార్టీ మారే ప్రసక్తే లేదన్నారు.. వైసీపీ నుంచి పోటీ చేస్తున్నానని చెప్పారు. అసెంబ్లీకా, లోక్‌సభకా అనేది అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.

వేమిరెడ్డితో పాటు మాగుంటతో కూడా చర్చలు జరిపానని ఆదాల స్పష్టం చేశారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాత్రం తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని, తన ప్రయత్నం ఫలించలేదని స్పష్టం చేశారు.

వేమిరెడ్డి అభిప్రాయాన్ని అధిష్టానానికి చెప్పానని, మాగుంట మాత్రం పార్టీలోనే కొనసాగాలనుకుంటున్నారని చెప్పారు. వైసీపీ టికెట్ ఇస్తే మాగుంట పోటీ చేస్తానంటున్నారన్నారు.

నెల్లూరు రూరల్ నుంచి ఆనం విజయ్ కుమార్ రెడ్డి పోటీ ప్రచారంపై స్పందించిన ఆదాల, సీఎం జగన్ ను కలిసినంత మాత్రాన పోటీ చేస్తారని అనుకోవడం సరికాదన్నారు. నెల్లూరు సిటీ లేదా రూరల్ లో సహకారం అందించాలని కోరి ఉండవచ్చన్నారు.

Whats_app_banner