IPL 2024 Final KKR vs SRH: ఫైనల్ సమరానికి వర్షం ముప్పు ఉందా? పిచ్ ఎలా ఉండొచ్చు? లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
KKR vs SRH IPL 2024 Final: ఐపీఎల్ 2024 ఫైనల్ పోరు కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ మ్యాచ్‍కు వర్షం ఆటంకం ఉంటుందా.. పిచ్ ఎలా ఉండే అవకాశం ఉందో ఇక్కడ తెలుసుకోండి.
KKR vs SRH IPL 2024 Final: ఐపీఎల్ 2024 ఫైనల్‍కు అంతా సిద్ధమైంది. కోల్‍కతా నైట్‍రైడర్స్, సన్‍రైజర్స్ హైదరాబాద్ మధ్య చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఆదివారం (మే 26) ఈ టైటిల్ సమరం జరగనుంది. క్వాలిఫయర్-1లో గెలిచి కోల్‍కతా ఫైనల్ చేరింది. రెండో క్వాలిఫయర్‌లో సత్తాచాటి హైదరాబాద్ తుదిపోరులో అడుగుపెట్టింది. ఈ సీజన్‍లో సూపర్ ఫామ్‍లో ఉన్న ఈ రెండు జట్ల మధ్య ఫైనల్ ఆసక్తికరంగా ఉండనుంది. అయితే, ఈ ఫైనల్‍పై వాన ప్రభావం ఉంటుందా.. పిచ్ ఎలా ఉండనుంది.. టైమింగ్.. లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇక్కడ చూడండి.
వాన పడే ఛాన్స్ ఎంత?
కోల్‍కతా, హైదరాబాద్ మధ్య ఐపీఎల్ 2024 ఫైనల్ జరిగే ఆదివారం (మే 26) చెన్నైలోని చెపాక్‍లో వర్షం పడే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. వాన పడే ఛాన్స్ 5శాతమే అని అక్యువెదర్ పేర్కొంది. ఒకవేళ వాన పడినా మ్యాచ్‍కు స్వల్ప అంతరాయమే ఏర్పడే అవకాశం ఉంది. ఒకవేళ వర్షం వల్ల ఆదివారం మ్యాచ్ సాధ్యం కాకపోయినా ఫైనల్‍కు సోమవారం రిజర్వ్ డే కూడా ఉంటుంది. అయితే, ఆదివారం ఆస్థాయిలో వాన పడే అవకాశాలు లేవు.
చెన్నైలోని చెపాక్‍లో నేడు (మే 25) వాన పడింది. దీంతో కోల్‍కతా, హైదరాబాద్ ట్రైనింగ్ సెషన్‍కు అంతరాయం ఏర్పడింది. అయితే, ఆదివారం ఫైనల్ జరిగే సమయంలో వాన పడే అవకాశాలు తక్కువే.
పిచ్ ఇలా..
కోల్‍కతా, హైదరాబాద్ మధ్య ఐపీఎల్ ఫైనల్ కోసం చెపాక్ స్టేడియంలో ఎర్రమట్టి పిచ్ రెడీ అయింది. ఈ పిచ్ ఎక్కువగా బ్యాటింగ్‍కు సహకరించనుంది. అలాగే, స్పిన్నర్లకు కూడా మద్దతు లభించే అవకాశం ఉంది. టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంపిక చేసుకునే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది.
టైమింగ్, లైవ్ స్ట్రీమింగ్
సన్‍రైజర్స్ హైదరాబాద్, కోల్‍కతా నైట్‍రైడర్స్ మధ్య చెన్నై చెపాక్‍లో ఐపీఎల్ 2024 ఫైనల్ ఆదివారం (మే 26) రాత్రి 7 గంటల 30 నిమిషాలకు మొదలవుతుంది. అందుకు అరగంట ముందు 7 గంటలకు టాస్ పడుతుంది.
ఈ ఫైనల్ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ స్పోర్ట్ నెట్‍వర్క్ టీవీ ఛానెళ్లలో లైవ్ టెలికాస్ట్ అవుతుంది. జియోసినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ఈ మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ చూడవచ్చు.
ప్లేఆఫ్స్ క్వాలిఫయర్-1లో సన్‍రైజర్స్ హైదరాబాద్‍పై గెలిచి ఫైనల్‍లో నేరుగా అడుగుపెట్టింది కోల్‍కతా. లీగ్ దశలో టాప్‍లో నిలిచిన ఆ జట్టు అదే జోష్‍తో తుదిపోరుకు వచ్చింది. అయితే, చెపాక్‍లో జరిగిన క్వాలిఫయర్-2లో రాజస్థాన్‍పై అలవోకగా గెలిచి ఫైనల్‍కు వచ్చింది ప్యాట్ కమిన్స్ సారథ్యంలోని హైదరాబాద్. చెపాక్ పరిస్థితులను వాడుకొని బౌలింగ్‍లోనూ అదరగొట్టి రాజస్థాన్‍పై ఎస్ఆర్‌హెచ్ గెలిచింది. ఫైనల్‍లో కోల్‍కతాపై గెలుస్తామనే గట్టి నమ్మకంతో హైదరాబాద్ ఉంది. జోరు కొనసాగించి మూడో ఐపీఎల్ టైటిల్ పట్టేయాలని కోల్‍కతా తహతహలాడుతోంది. ఈ ఐపీఎల్ 2024 సీజన్‍లో దూకుడు మంత్రాన్ని పాటిస్తున్న ఈ రెండు జట్ల మధ్య ఫైనల్ జరుగుతుండటంతో ఈ హైవోల్టేజ్ ఫైనల్‍పై ఆసక్తి మరింత ఉంది.