SRH vs RR IPL 2024 Qualifier 2: ఐపీఎల్ 2024 ఫైనల్లో సన్ రైజర్స్ హైదరాబాద్.. రాజస్థాన్ రాయల్స్ చిత్తు
SRH vs RR IPL 2024 Qualifier 2: ఐపీఎల్ 2024 ఫైనల్ చేరింది సన్ రైజర్స్ హైదరాబాద్. క్వాలిఫయర్ 2లో రాజస్థాన్ రాయల్స్ ను చిత్తు చేసి రెండోసారి ఫైనల్ చేరింది.
SRH vs RR IPL 2024 Qualifier 2: సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2024 ఫైనల్ చేరింది. శుక్రవారం (మే 24) జరిగిన రెండో క్వాలిఫయర్ లో రాజస్థాన్ రాయల్స్ ను 36 రన్స్ తేడాతో చిత్తు చేసింది. రాయల్స్ ముందు 176 రన్స్ టార్గెట్ విధించినా.. బౌలర్లంతా సమష్టిగా రాణించి సన్ రైజర్స్ ను గెలిపించారు. ఆదివారం (మే 26) కోల్‌కతా నైట్ రైడర్స్ తో ఫైనల్లో తలపడనుంది.
రాయల్స్ చిత్తు చిత్తు
176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 139 పరుగులు మాత్రమే చేయగలిగింది. సన్ రైజర్స్ తరఫున ఇంప్టాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దిగిన షాబాజ్ అహ్మద్ 4 ఓవర్లలో కేవలం 23 పరుగులకే 3 వికెట్లు తీసుకున్నాడు. అభిషేక్ శర్మ కూడా 4 ఓవర్లలో 24 పరుగులకే 2 వికెట్లు తీశాడు. రాయల్స్ బ్యాటర్లంతా చేతులెత్తేశారు.
రాయల్స్ తరఫున ధృవ్ జురెల్ 35 బంతుల్లోనే 56 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు. యశస్వి జైస్వాల్ 21 బంతుల్లో 42 రన్స్ చేశాడు. మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. ఓపెనర్ కాడ్మోర్ (10), సంజూ శాంసన్ (10), రియాన్ పరాగ్ (6), అశ్విన్ (0), హెట్‌మయర్ (4) దారుణంగా ఫెయిలయ్యారు. దీంతో రాయల్స్ అసలు మ్యాచ్ లో తలవంచింది.
క్లాసెన్ ఒక్కడే..
సన్ రైజర్స్ బ్యాటర్లలో హెన్రిచ్ క్లాసెన్ మాత్రమే హాఫ్ సెంచరీతో రాణించాడు. టాపార్డర్ లో వికెట్లు టపటపా పడిపోవడంతో క్లాసెన్ తన స్పీడులో కాకపోయినా.. అవసరమైన సమయంలో ఫిఫ్టీ చేసి ఆదుకున్నాడు. క్లాసెన్ 34 బంతుల్లో 4 సిక్స్ లతో 50 రన్స్ చేశాడు. అయితే అతడు క్రీజులో ఉంటే భారీ స్కోరు ఖాయం అనుకున్న సమయంలో 19వ ఓవర్ తొలి బంతికి ఔటయ్యాడు.
దీంతో సన్ రైజర్స్ భారీ స్కోరు చేయలేకపోయింది. అటు బౌలర్లకు, ఇటు బ్యాటర్లకు సమానంగా అనుకూలిస్తున్న పిచ్ పై సన్ రైజర్స్ మంచి స్కోరే సాధించినట్లు క్రికెట్ పండితులు చెబుతున్నారు. ఇక టీమ్ ను ఫైనల్ కు తీసుకెళ్లే భారం బౌలర్లపైనే ఉంది.
సన్ రైజర్స్ వికెట్లు టపాటపా
ఈ కీలకమైన మ్యాచ్ లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది రాజస్థాన్ రాయల్స్. లీగ్ మొత్తం మెరుపులు మెరిపిస్తున్న సన్ రైజర్స్ ఓపెనర్లు ఈసారైనా చెలరేగుతారన్న ఆశ అభిమానుల్లో కలిగింది. అయితే తొలి ఓవర్లోనే ఒక సిక్స్, ఒక ఫోర్ కొట్టి ఊపు మీద కనిపించిన అభిషేక్ శర్మ (12) ఔటయ్యాడు. దీంతో 13 పరుగులకే తొలి వికెట్ పడిపోయింది.
ఈ దశలో హెడ్ తో కలిసిన రాహుల్ త్రిపాఠీ వచ్చీ రాగానే మెరుపులు మెరిపించాడు. అతడు కేవలం 15 బంతుల్లోనే 5 ఫోర్లు, 2 సిక్స్ లతో 37 రన్స్ చేశాడు. అభిషేక్ ఫెయిలైనా ఆ లోటు త్రిపాఠీ తీరుస్తున్నాడనుకునేలోపే అతడు ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఏడెన్ మార్‌క్రమ్ (1) మరోసారి నిరాశపరిచాడు. దీంతో సన్ రైజర్స్ 57 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది.
హెడ్, క్లాసెన్ కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. ఈ ఇద్దరూ చివరి వరకూ ఉన్నా భారీ స్కోరు ఖాయం అన్న భరోసా ఉంది. కానీ హెడ్ కూడా 28 బంతుల్లో 34 రన్స్ చేసి ఔటయ్యాడు. దీంతో 99 పరుగుల దగ్గర నాలుగో వికెట్ పడింది. నితీష్ కుమార్ (5), అబ్దుల్ సమద్ (0) వరుస బంతుల్లో ఔటయ్యారు. దీంతో 120 పరుగులకే 6 వికెట్లు పడిపోయాయి. ఈ దశలో ఇక 200 స్కోరు అసాధ్యమని తేలిపోయింది.
క్లాసెన్ మెరుపులు సన్ రైజర్స్ ను ఆ దిశగా తీసుకెళ్తాయని అనుకున్నా.. అతడూ 19వ ఓవర్ తొలి బంతికే ఔటయ్యాడు. దీంతో సన్ రైజర్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 175 పరుగులకే పరిమితమైంది.