Delhi Liquor Case: లిక్కర్ కేసులో వైసీపీ ఎంపీ మాగుంట కుమారుడు అరెస్ట్-ycp mp magunta sreenivasulu reddy son raghava arrest in delhi liquor case ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Delhi Liquor Case: లిక్కర్ కేసులో వైసీపీ ఎంపీ మాగుంట కుమారుడు అరెస్ట్

Delhi Liquor Case: లిక్కర్ కేసులో వైసీపీ ఎంపీ మాగుంట కుమారుడు అరెస్ట్

HT Telugu Desk HT Telugu
Feb 11, 2023 09:34 AM IST

Magunta Raghava Arrest: ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ దూకుడు పెంచుతోంది. తాజాగా వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడిని అరెస్ట్ చేసింది.

ఢిల్లీ లిక్కర్ కేసులో మరో అరెస్ట్
ఢిల్లీ లిక్కర్ కేసులో మరో అరెస్ట్

Delhi Liquor Case Updates: ఢిల్లీ లిక్కర్ కేసులో రోజుకో పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఓవైపు ఛార్జ్ షీట్లలో పలువురి పేర్లను ప్రస్తావించిన ఈడీ… మరోవైపు అరెస్ట్ ల పర్వం కొసాగిస్తోంది. తాజాగా ఏపీకి చెందిన వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు మాగుంట రాఘవను అరెస్ట్ చేసింది. ఈ కేసులో బాలాజీ గ్రూప్ కూడా పేరు ఉండగా.. దీనికి రాఘవ యజమానిగా ఉన్నారు. ఇప్పటికే ఎమ్మెల్సీ కవిత చార్టెడ్ అకౌంటెంట్‌ గోరంట్ల బుచ్చి బాబును కూడా అరెస్ట్ చేసింది ఈడీ. తాజాగా ఎంపీ కుమారుడిని అరెస్ట్ చేయటం సంచలనంగా మారింది.

గత ఏడాది ఆగష్టు చివర్లో ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం వెలుగు చూసిన తర్వాత సిబిఐ ఈ వ్యవహారంపై దర్యాప్తు ప్రారంభించింది. ఢిల్లీ లిక్కర్‌ పాలసీలో పలువురిని ప్రశ్నించే క్రమంలో హైదరాబాద్‌లో బిఆర్‌ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ కుమార్తె పేరు కూడా తెరపైకి వచ్చింది. ఈ క్రమంలోనే కవితకు వ్యక్తిగత ఆడిటర్‌గా పనిచేస్తున్న గోరంట్ల బుచ్చిబాబు పేరు తెరపైకి వచ్చింది. దీంతో ఆయన్ను అరెస్ట్ చేసింది ఈడీ. ఢిల్లీ లిక్కర్ పాలసీ వ్యవహారంలో గత వారంలో సిబిఐ దాఖలు చేసిన అభియోగాల్లో ఎమ్మెల్సీ కవితతో పాటు ఏపీకి చెందిన మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేరు కూడా తెరపైకి వచ్చింది. ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో సౌత్ గ్రూప్ పేరిట చక్రం తిప్పడంలో పలువురు ప్రముఖులు కీలక పాత్ర పోషించారని, వ్యాపార ప్రయోజనాలు పొందడానికి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఈడీ ఆరోపిస్తోంది. ఇప్పటికే దాఖలు చేసిన ఛార్జీషీట్లలో పలువురి పేర్లను ప్రధానంగా ప్రస్తావించింది.

Delhi Liquor Scam Chargesheet: ఇదే కేసుకు సంబంధించి తాజాగా ఈడీ ఛార్జీషీట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రమేయం గురించి ప్రస్తావించింది. ఇక నిందితుల జాబితాలో మాత్రం 17 మంది పేర్లను పేర్కొంది. ఇందులో అభిషేక్ బోయినపల్లి, అమిత్ అరోరా, సమీర్ మహేంద్రు, శరత్ చంద్రా, విజయ్ నాయర్, బినోయ్ బాబుతో పాటు పలువురి పేర్లను వెల్లడించింది.ఈడీ దాఖలు చేసిన ఈ సప్లిమెంటరీ చార్జ్ షీట్ ను ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ ప్రత్యేక కోర్టు పరిగణనలోకి తీసుకుంది. తదుపరి విచారణను ఫిబ్రవరి 23కి వాయిదా వేసింది. ఈ కేసులోని నిందితులకు నోటీసులు కూడా జారీ చేసింది.

ఈడీ ప్రస్తావించిన కీలక అంశాలు:

లిక్కర్ కేసుకు సంబంధించి జనవరి 6న 13,657 పేజీల అనుబంధ ఛార్జిషీట్‌ను దాఖలు చేసింది ఈడీ.

ఇందులో ఐదుగురి పేర్లతో పాటు ఏడు కంపెనీలను చేర్చింది. విజయ్‌నాయర్‌, అభిషేక్‌ బోయినపల్లి, శరత్‌ చంద్రారెడ్డి, బినోయ్‌బాబు, అమిత్‌ అరోరాలను నిందితులుగా చేర్చింది.

మనీలాండరింగ్‌కు సంబంధించి మొత్తం 12 మంది పేర్లను సప్లిమెంటరీ ఛార్జిషీట్‌లో ఈడీ పేర్కొంది. తీహార్‌ జైల్లో ఉన్న సమీర్‌ మహేంద్రు, శరత్‌రెడ్డి, అభిషేక్‌ బోయినపల్లి, విజయ్‌ నాయర్‌, బినోయ్‌ బాబు, అమిత్‌ అరోరా, ఇటీవల అప్రూవర్‌గా మారిన దినేష్ అరోరాతో పాటు ముందస్తు బెయిల్‌తీసుకున్న ఇద్దరు మాజీ అధికారులు కుల్దీప్‌సింగ్‌, నరేంద్ర సింగ్‌, ముత్తా గౌతమ్‌, అరుణ్‌ పిళ్లై, సమీర్‌ మహేంద్ర కంపెనీలను ఛార్జిషీట్‌లో ప్రస్తావించింది.

మొత్తం ఛార్జిషీట్‌పై 428 పేజీలతో ఈడీ ఫిర్యాదు నివేదికను కోర్టుకు అందించింది.

లిక్కర్ స్కామ్ కు సంబంధించి మొత్తం 65 మందిని విచారించి స్టేట్ మెంట్స్ రికార్డు చేసినట్లు ఈడీ పేర్కొంది. ఇందులో ఎమ్మెల్సీ కవిత అనుచరుడు వి.శ్రీనివాసరావును విచారించినట్టు వివరించింది. వి.శ్రీనివాసరావు వాంగ్మూలాన్ని ఛార్జిషీట్‌లో ప్రస్తావించింది. కవిత ఆదేశంతో అరుణ్‌పిళ్లైకి శ్రీనివాసరావు రూ.కోటి ఇచ్చారని పేర్కొంది.

ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పన వివరాలను కూడా ఛార్జీషీట్ లో ఈడీ క్లుప్తంగా తెలిపింది. ఇందులో కమిటీలలోని వ్యక్తుల పేర్లతో పాటు కంపెనీల వివరాలను కూడా వివరించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పేరును కూడా ఈడీ ప్రస్తావించింది. ఎక్సైజ్‌ పాలసీ రూపొందించే సమయంలో అరవింద్ కేజ్రీవాల్‌కు అత్యంత సన్నిహితుడైన విజయ్‌ నాయర్‌తో మాట్లాడినట్లు ఈడీ చార్జిషీట్‌లో పేర్కొంది.

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ను మొత్తం నడిపించింది విజయ్‌ నాయర్‌ అని ఈడీ తెలిపింది.

ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సెక్రటరీ అరవింద్ పేరు కూడా ఈడీ ఛార్జ్‌షీట్‌లో ఉంది. కీలక నిందితుడు విజయ్ నాయర్ కేజ్రీవాల్ క్యాంపు ఆఫీసు నుండి కార్యకలాపాలు కొనసాగించారని ఈడీ వెల్లడించింది.

సౌత్ గ్రూపు నుంచి 100 కోట్లు ముడుపులు విజయ్ నాయర్ అందుకున్నారని, సౌత్ గ్రూపునకు, ఆప్ లీడర్లకు మధ్య ఒప్పందంలో భాగంగానే ఈ ముడుపులు అందుకున్నారని ఈడీ రాసుకొచ్చింది. సౌత్ గ్రూపులో కవిత, శరత్ చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాసుల రెడ్డి, రాఘవ సభ్యులుగా ఉన్నారు. సౌత్ గ్రూపు తరపున అభిషేక్ బోయిన్ పల్లి, రామచంద్రన్ పిళ్ళై, బుచ్చిబాబు ప్రతినిధులుగా వ్యవహరించినట్లు ప్రస్తావించింది.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి గతేడాది ఆగస్టులో సీబీఐ కేసు నమోదు చేసినట్లు ఈడీ పేర్కొంది. గతేడాది నవంబరులో సీబీఐ తొలి ఛార్జీషీట్ ను ఫైల్ చేసింది. ఇందులో ఆరుగురిని నిందితులుగా పేర్కొంది. విజయ్ నాయర్, అభిషేక్ బోయినపల్లితో పాటు పలువురి పేర్లు ఇందులో ఉన్నాయి.

Whats_app_banner

సంబంధిత కథనం