Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో నిందితుల ఆస్తుల జప్తు….-enforcement directorate seizes properties and bank accounts of delhi liquor scam accused ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో నిందితుల ఆస్తుల జప్తు….

Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో నిందితుల ఆస్తుల జప్తు….

HT Telugu Desk HT Telugu
Jan 26, 2023 07:49 AM IST

Delhi Liquor Scam ఢిల్లీ లిక్కర్ స్కాంలో నిందితుల ఆస్తుల్ని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ స్వాధీనం చేసుకుంది. లిక్కర్ స్కాంలో నిందితుడిగా ఉన్న హైదరాబాద్‌కు చెందిన అరుణ్ రామచంద్ర పిళ్లైకు చెందిన రూ.2.25కోట్ల విలువైన భూమిని ఈడీ జప్తు చేసింది. ఇతర నిందితుల ఆస్తుల్ని కూడా కేంద్ర దర్యాప్తు సంస్థ అటాచ్ చేసింది.

ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో ఈడీ దర్యాప్తులో దూకుడు
ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో ఈడీ దర్యాప్తులో దూకుడు (HT_PRINT)

Delhi Liquor Scam దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్‌ స్కాం వ్యవహారంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. హైదరాబాద్‌కు చెందిన అరుణ్ రామచంద్ర పిళ్లైకు వట్టి నాగులపల్లిలో ఉన్న రూ.2.25కోట్ల రుపాయల విలువైన భూమిని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ స్వాధీనం చేసుకుంది.

ఢిల్లీ మద్యం కుంభకోణంలో నిందితులుగా ఉన్న పిళ్లైతో పాటు సమీర్ మహీంద్రు, అమిత్ అరోరా, విజయ్ నాయర్‌, దినేష్ అరోరా, సమీర్ మహీంద్రు భార్య గీతక మహేంద్ర, ఇండో స్పిరిట్స్ సంస్థకు చెందిన స్థిర, చర ఆస్తులను కూడా జప్తు చేసినట్లు ఈడీ ప్రకటించింది. సమీర మహేంద్రు, గీతికలకు చెందిన ఢిల్లీలో రూ.35కోట్ల రుపాయల విలువైన నివాసం, గురుగ్రామ్‌ మగ్నోలియాస్‌లో అమిత్ అరోరాకు చెందిన రూ.7.68కోట్ల రుపాయల ఖరీదు చేసే ఇల్లు, ముంబై పార్లేలోని విజయ్‌నాయర్‌కు చెందిన రూ.1.77కోట్ల ఖరీదు చేసి నివాసం, దినేష్ అరోరాకు చెందిన చికా, లా రోసా, అన్ ప్లగ్డ్ కోర్డ్ యార్ట్ రెస్టారెంట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి రూ.3.18కోట్లు గా ఈడీ ప్రకటించింది.

ఇండో స్పిరిట్స్‌ సంస్థకు చెందిన 50వాహనాలను కూడా జప్తు చేశారు. ఇవి దాదాపు రూ.10.23 కోట్ల ఖరీదు చేస్తాయి. డిల్లీ లిక్కర్ స్కాం కేసులో నిందితులుగా ఉన్న వ్యక్తులకు సంబంధించిన బ్యాంకు ఖాతాల్లో ఉన్న నగదు, ఫిక్సిడ్ డిపాజిట్ల నగదు రూ.14.39కోట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటన్నింటితో కలిపి ఈడీ రూ.76.54కోట్ల రుపాయల విలువైన ఆస్తుల్ని స్వాధీనం చేసుకుంది.

బెయిల్ కోసం నిందితుల దరఖాస్తు….

ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టైన నిందితులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై ఫిబ్రవరి9న తీర్పు వెలువడనుంది. అక్రమ నగదు తరలింపు వ్యవహారంలో ఫెమా నిబంధనల ఉల్లంఘనతో పాటు అక్రమ లావాదేవీలపై నిందితులపై కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసులో అరెస్టైన నిందితులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై బుధవారం కోర్టులో వాదనలు జరిగాయి. ఈ కేసులో హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి బోయినలపల్లి అభిషేక్‌తో పాటు ఐదుగురు నిందితులు తిహార్ జైల్లో ఉన్నారు. నిందితులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎం.కె.నాగపాల్‌ విచారణ జరిపారు. వాదనలు పూర్తయ్యాక తీర్పును రిజర్వ్ చేశారు. ఫిబ్రవరి 9న తీర్పు వెలువరిస్తామని ప్రకటించారు.

Whats_app_banner