Balineni Politics: వైసీపీలో బాలినేని ఒక్కడే ప్రత్యేకం ఎందుకు? బంధుత్వంతోనే అసలు బాధలు?
Balineni Politics: వైఎస్సార్సీపీకి మాజీ మంత్రి బాలినేని కొరకరాని కొయ్యగా మారారు. ఓ వైపు బంధుత్వం.. మరోవైపు రాజకీయంగా పట్టు ఉండటంతోనే బాలినేని పంతం ఇన్నాళ్లు నెగ్గిందా?
Balineni Politics: వైసీపీ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఏ జిల్లాలో లేనన్ని సమస్యలు ప్రకాశం జిల్లాలో తలెత్తాయి. ఒకప్పుడు ఉమ్మడి ప్రకాశం జిల్లాను తన కనుసన్నల్లో నడిపించిన బాలినేని ఇప్పుడు అసంతృప్తితో రగిలిపోతున్నారు.
ఒంగోలు ఎంపీ అభ్యర్థిత్వం విషయంలో మాగుంట శ్రీనివాసులురెడ్డి కోసం తీవ్రంగా ప్రయత్నించి బాలినేని భంగపడ్డారు. చివరి వరకు మాగుంట అభ్యర్థిత్వం కోసం విశ్వ ప్రయత్నాలు చేసినా అవి ఫలించలదు. చివరకు తన కుమారుడికి టిక్కెట్ ఇప్పించుకోవాలని చేసిన ప్రయత్నాలు కూడా సఫలం కాలేదు.
మాగుంట ఎంపీ అభ్యర్థి అయితే జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకూ లాభమనే ఉద్దేశంతోనే తాను పట్టుబట్టానని బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పారు. జిల్లాలోని ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు మాగుంట విషయంలో పట్టీపట్టనట్లు వ్యవహరిస్తుంటే, తాను మాత్రమే అధిష్ఠానంతో ఎందుకు ఘర్షణ పడాలని వ్యాఖ్యానించారు.
ఎంపీగా ఒక స్థాయి ఉన్న అభ్యర్థి అయితే మంచిదనేది తన భావనని తెలిపారు. ఎంపీ అభ్యర్థిగా ఎవరిని ప్రకటించినా తనకు అభ్యంతరం లేదని ప్రకటించారు. ఒంగోలులో పాతిక వేల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తానని చెప్పిన హామీని నిలబెట్టుకునే పని మీదే తాను దృష్టి కేంద్రీకరించినట్లు చెప్పారు.
బాలినేనిదే పెత్తనం….
వైసీపీ ఆవిర్భావం నుంచి ప్రకాశం జిల్లాలో పార్టీపై బాలినేని పెత్తనం కొనసాగింది. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే దానిని భరించలేక ఎమ్మెల్యేలలో అసంతృప్తి ఎక్కువైంది.బాలినేనితో మిగిలిన వారు కలిసి రాకపోవడానికి అదే కారణమని చెబుతున్నారు. .
జిల్లాకు చెందిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి పెత్తనంతో జిల్లాలో ఉన్న నేతలెవరు తమకు స్వతంత్రత లేదని భావించారు. మంత్రిగా ఉన్న సమయంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ పూర్తిగా మంత్రి బాలినేని చెప్పు చేతల్లో ఉండటం వల్ల తమకు గుర్తింపు, ప్రాధాన్యత లేకుండా పోయిందని ఎమ్మెల్యేలు భావించారు.
జిల్లాకు చెందిన మరో మంత్రి ఆదిమూలపు సురేష్ జిల్లాలో మాట్లాడేందుకు సైతం సాహసించని పరిస్థితి ఉండేదని గుర్తు చేస్తున్నారు. ఇరువురు ఒకేచోట ఉండాల్సిన వచ్చినపుడు ఆయన మౌనంగా ఉండిపోతారని చెబుతున్నారు. జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట కూడా, సదరు ఎమ్మెల్యేలు ఇతర సామాజిక వర్గానికి చెందిన వారైతే, ప్రభుత్వంలో పనుల కోసం వచ్చే వారు జిల్లా మంత్రి వద్దకే వెళ్లే వారు.
ఇక కాంట్రాక్టులు, ఇతర పనుల కోసం అధికారులు ఎమ్మెల్యేల సిఫార్సులు పరిగణలోకి తీసుకునే వారు కాదని సిట్టింగ్ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. పేరుకు మాత్రమే తాము ఎమ్మెల్యేలమనే భావన వారిలో బలంగా ఉంది.
బాలినేని వర్సెస్ వైవి సుబ్బారెడ్డి
ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఆధిపత్య పోరు ఎప్పుడో తారాస్థాయికి చేరుకుంది. టిటిడి ఛైర్మన్‌గా పదవీ కాలం ముగిసిన సమయంలో జిల్లా రాజకీయాల్లో మళ్లీ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని వైవి సుబ్బారెడ్డి ప్రయత్నించారు. ఇందులో భాగంగా రాష్ట్ర మంత్రి వర్గంలో చోటు దక్కించుకోవాలని ప్రయత్నించారు.
అప్పట్లో సుబ్బారెడ్డి రాకను మంత్రి బాలినేని తీవ్రంగా వ్యతిరేకించారు. అవకాశం వస్తే మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించారు. ముఖ్యమంత్రికి సైతం తన మనసులో మాటను చెప్పానని వివరించారు. దీంతో బాలినేని వేగంగా పావులు కదిపారు. సుబ్బారెడ్డికి మంత్రి వర్గంలో చోటు దక్కకుండా చేశారని ప్రచారం జరిగింది. ఫలితంగానే ఇప్పుడు బాలినేని వెంట నడిచే వారు లేకుండా పోయారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
గతంలో బాలినేని తీరుతో ఇబ్బందులు పడిన వారు, మంత్రి పదవిలో ఉండగా మిగిలిన వారితో వ్యవహరించిన తీరును గుర్తుంచుకుని అదను చూసి దెబ్బ కొట్టినట్టు ప్రచారం జరుగుతోంది. పార్టీలో తనకు ప్రాధాన్యత దక్కడం లేదంటూ బాలినేని పార్టీ మారుతారనే ప్రచారం కూడా జరిగింది. ముఖ్యమంత్రి స్వయంగా బుజ్జగించడంతో ఆయన ఆ ప్రయత్నాలు విరమించుకున్నారు.