YSRCP : బాలినేని కంటతడి...! MLAలతో సీఎంకు ఫిర్యాదు చేయించారంటూ సీరియస్ కామెంట్స్
Balineni Srinivas Reddy Latest News: మొదటి నుంచి పార్టీలో కీలకంగా వ్యవహరించానని చెప్పారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి. ఎట్టిపరిస్థితుల్లో వైసీపీని వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
Balineni Srinivas Reddy Comments: తనపై కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి, ఒంగోలు వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. శుక్రవారం ఒంగోలులో మీడియాతో మాట్లాడిన ఆయన... పార్టీ మారే ప్రసక్తే లేదన్నారు. తనపై కొందరు కుట్రలు చేస్తున్నారని... ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రికి కూడా ఫిర్యాదు చేయించారని చెప్పారు. ఇదంతా ఎవరు చేయిస్తున్నారో అందరికీ తెలుసన్నారు. తన విషయంలో ఇలా చేస్తున్న వాళ్లు ఎందుకు ఈ రకంగా వ్యవహరిస్తున్నారో ఆలోచించుకోవాలని చెప్పారు. బాధ్యతలు ఎక్కువగా ఉన్నందునే రీజినల్ కోఆర్డినేటర్ పదవికి రాజీనామా చేశానని స్పష్టం చేశారు. తన నియోజకవర్గంపై ఫోకస్ చేయాల్సి ఉందని అందుకే ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. ఓ దశలో బాలినేని బావోద్వేగానికి గురయ్యారు.
"నేను టికెట్ ఇప్పించినవాళ్లతోనే నాపై ఫిర్యాదులు చేయిస్తున్నారు. ఇదంతా ఎందుకు చూస్తున్నారో అర్థం కావటం లేదు. పార్టీ కోసం ఎంతో శ్రమించాను. ఎన్నో బాధలు పడ్డాను. తప్పు చేసినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటాను. నాకు వైఎస్ఆర్ రాజకీయభిక్షను పెట్టారు. గోనె ప్రకాశ్ రావు నా గురించి ఎందుకు మాట్లాడుతున్నారు. కావాలనే మాట్లాడించినట్లు అనిపిస్తోంది. నాపై కావాలనే కుట్ర చేస్తున్నారు. కుట్ర చేస్తున్నవారెవరో అందరికీ తెలుసు. వారి పేర్లను నేను చెప్పలేను" అంటూ బాలినేని శ్రీనివాస్ రెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు.
సొంత పార్టీవారే ప్రచారం చేస్తున్నారు…
"వైఎస్ఆర్ ఆశీస్సులతో రాజకీయంగా ఎదిగాను. మంత్రిగా కూడా నాకు అవకాశం ఇచ్చారు. వైఎస్ఆర్ లేకపోవటం నా జీవితంలో తీరనిలోటు. జగన్మోహన్ రెడ్డి ఓదార్పుయాత్రను తలపెట్టగా... మంత్రి పదవిని వదిలేసి మద్దతుగా నిలిచాను. జగన్ సీఎం అయ్యాక కూడా మంత్రిగా అవకాశం ఇచ్చారు. పార్టీ ఆవిర్భావం నుంచి కూడా అందరికోసం పని చేశాను. కీలక నాయకుడిగా ఉన్నాను. జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలోని వారితో సంబంధాలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో నాపై ఆరోపణలు వస్తున్నాయి. చెన్నై హవాలా, భూకబ్జాలు, సినిమాలో డబ్బులు అంటూ రకరకాల వార్తలు వస్తున్నాయి. గోనె ప్రకాష్ రావ్ అనే వ్యక్తి అర్థంలేని మాటలు చెబుతున్నాడు. వైవీ సుబ్బారెడ్డి దంపతులు దేవుళ్లు అంటూ మాట్లాడుతున్నాడు. అసలు నా గురించి గోనె ప్రకాశ్ ఎందుకు మాట్లాడుతున్నారు. ఓవైపు జగన్మోహన్ రెడ్డి దంపతులు జైలుకు వెళ్తారని అంటున్న గోనె ప్రకాశ్... వైవీ సుబ్బారెడ్డిని పొగడటమేంటి..? నేను మొదట్నుంచి కార్యకర్తల కోసం పని చేశాను. డబ్బులు సంపాదించుకోవడానికి రాజకీయాలు చేయటం లేదు. పార్టీ కోసం ఎన్ని కష్టాలు పడ్డానో నాకు తెలుసు. ఏమీ చేయకుండానే నాపై నిందలు, ఆరోపణలు చేస్తున్నారు. నేను భరించలేకపోతున్నాను. కార్యకర్తలకు న్యాయం చేస్తున్న నాపై ఫిర్యాదులు చేయటం బాధాకరం.నాపైనే కాకుండా నా కుమారుడిపై కూడా ఆరోపణలు చేస్తున్నారు. వీటిపై దమ్ముంటే ఆధారాలు చూపించాలి..? నేను తప్పు చేస్తే రాజకీయాలనే మానుకుంటాను. పార్టీ మారుతున్నానంటూ సొంత పార్టీ నేతలే ప్రచారం చేస్తున్నారు. ఎందుకు ఇలా టార్చర్ చేస్తున్నారు. ఇది మంచి పద్ధతేనా?" అంటూ బాలినేని ఘాటుగా మాట్లాడారు.
తనని ఎన్ని ఇబ్బందులు పెట్టినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదన్నారు. నమ్ముకున్న కార్యకర్తలు, అభిమానుల కోసం ఏ త్యాగానికైనా సిద్ధమైనని బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.