Balineni Blackmailing: బాలినేని మనసులో ఏముంది..తాడోపేడో తేల్చుకోడానికి సిద్ధమయ్యారా?-is balineni blackmailing cm jagan for control of prakasam district ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Balineni Blackmailing: బాలినేని మనసులో ఏముంది..తాడోపేడో తేల్చుకోడానికి సిద్ధమయ్యారా?

Balineni Blackmailing: బాలినేని మనసులో ఏముంది..తాడోపేడో తేల్చుకోడానికి సిద్ధమయ్యారా?

HT Telugu Desk HT Telugu
May 03, 2023 09:10 AM IST

Balineni Blackmailing: ముఖ్యమంత్రి బుజ్జగింపులకు బాలినేని శ్రీనివాసరెడ్డి లొంగకపోవడం వైసీపీలో చర్చనీయాంశంగా మారింది. పార్టీ ప్రాంతీయ సమన్వయకర్త పదవికి రాజీనామా చేసిన బాలినేని ముఖ్యమంత్రితో చర్చల తర్వాత కూడా మెత్తబడలేదు. పార్టీలో గౌరవం, గుర్తింపు మసకబారిందనే భావనలోనే బాలినేని ఉన్నారు.

ముఖ్యమంత్రి జగన్‌తో బాలినేని శ్రీనివాసరెడ్డి (ఫైల్)
ముఖ్యమంత్రి జగన్‌తో బాలినేని శ్రీనివాసరెడ్డి (ఫైల్)

Balineni Blackmailing: పార్టీ పదవులకు రాజీనామా చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యవహారం ఎటూ తేలలేదు. మంగళవారం బాలినేని శ్రీనివాసరెడ్డిని తాడేపల్లి సిఎం కార్యాలయానికి పిలిపించి మాట్లాడినా ఆయన మెత్తబడలేదు. వైసీపీలో ఏ నాయకుడిని బుజ్జగించని విధంగా ముఖ్యమంత్రి స్వయంగా బాలినేని శ్రీనివాసరెడ్డిని సముదాయిస్తున్నా ఆయన బెట్టు వీడలేదు.

మంగళవారం సిఎం జగన్‍తో బాలినేని చర్చలు విఫలమైనట్లు తెలుస్తోంది. ఆరోగ్యం సరిగా లేని కారణంగా రీజినల్ కో-ఆర్డినేటర్‍గా బాధ్యతలు నిర్వర్తించలేనని బాలినేని తేల్చి చెప్పారు. సొంత నియోజకవర్గంపై దృష్టి పెట్టాల్సి ఉందని, జిల్లాలో జరుగుతున్న పరిణామాలపై తన వైఖరిని స్పష్టంగా చెప్పినట్లు తెలుస్తోంది.

ప్రకాశం జిల్లా బాధ్యతల నుంచి తప్పించడంపై బాలినేని అసంతృప్తి వ్యక్తం చేసినా ఫలితం లేకపోయింది. ప్రకాశం జిల్లా బాధ్యతలు బాలినేనికి అప్పగించేందుకు జగన్ విముఖత చూపినట్లు ప్రచారం జరుగుతోంది. వైసీపీలో ఎవరికి సొంత జిల్లా బాధ్యతలు అప్పగించలేదని బాలినేనికి జగన్ గుర్తు చేసినట్లు చెబుతున్నారు. ఒక్కరి కోసం ఉన్న పద్ధతులు మార్చలేమనే అభిప్రాయాన్ని జగన్ వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్‍గా కొనసాగాల్సిందిగా బాలినేనికి జగన్ సూచించడంతో బాలినేని నిరాకరించినట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రితో భేటీ తర్వాత మరో మార్గంలో కార్యాలయం నుంచి బాలినేని బయటకు వెళ్లిపోయారు.

బాలినేని దూకుడుపై పార్టీలో చర్చ…

ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలలో అసంతృప్తికి బాలినేని కారణమనే నివేదికలు ముఖ్యమంత్రికి అందడంతోనే సొంత జిల్లా బాధ్యతలు అప్పగించడానికి విముఖత చూపినట్లు తెలుస్తోంది. టీడీపీ నుంచి బలమైన నేతలు వైసీపీలోకి రావడం వల్ల అయా ప్రాంతాల్లో ఇప్పటికే ఉన్న వారిలో కొంత అసంతృప్తి ఉంది. జిల్లాకు చెందిన మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి పెత్తనం ఎక్కువ ఉందనే భావన మిగిలిన ఎమ్మెల్యేలలో ఉండటంపై పలు సందర్భాల్లో ముఖ్యమంత్రి నివేదికలు అందాయి.

మంత్రి వర్గ పునర్వ్యస్థీకరణ ముందు వరకు జిల్లాలో ఉన్న నేతలెవరు తమకు స్వతంత్రత లేదని భావించే వారు. జిల్లా కలెక్టర్‌., ఎస్పీ పూర్తిగా మంత్రి బాలినేని చెప్పు చేతల్లో ఉండటం వల్ల తమకు గుర్తింపు., ప్రాధాన్యత లేకుండా పోయిందని ఎమ్మెల్యేలు భావించే వారు. బాలినేని పదవిలో ఉన్న సమయంలో మరో మంత్రి ఆదిమూలపు సురేష్‌, బాలినేని ఎదుట మాట్లాడేందుకు సైతం సాహసించే వారు కాదని జిల్లా నేతలు గుర్తు చేస్తున్నారు.

ఇరువురు ఒకేచోట ఉండాల్సిన వచ్చినపుడు ఆయన మౌనంగా ఉండిపోయేవారని చెబుతున్నారు. జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట కూడా, ఎమ్మెల్యేలు ఇతర సామాజిక వర్గానికి చెందిన వారైతే, పనుల కోసం వచ్చే వారు నేరుగా మంత్రి బాలినేని వద్దకే వెళ్లేవారు. కాంట్రాక్టులు., ఇతర పనుల కోసం అధికారులు ఎమ్మెల్యేల సిఫార్సులను సైతం పరిగణలోకి తీసుకునే వారు కాదని గుర్తు చేస్తున్నారు. మంత్రి వర్గ ప్రక్షాళన ముందు వరకు పేరుకు మాత్రమే తాము ఎమ్మెల్యేలమనే భావన చాలామందిలో ఉంది. ఈ భావనలు పార్టీకి దీర్ఘకాలంలో నష్టం చేసే అవకాశం చేస్తాయనే ఆలోచనలతోనే సిఎం బాలినేనికి చెక్ పెట్టినట్టు చెబుతారు.

బాలినేని వర్సెస్‌ వైవి సుబ్బారెడ్డి

బాలినేని అలక వెనుక జిల్లా రాజకీయాలే ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. మార్కాపురం సభలో ప్రోటోకాల్‌ వివాదం, డిఎస్పీ నియామకం కంటే ఇతర కారణాలతోనే బాలినేని బెట్టు వీడటం లేదని ప్రచారం జరుగుతోంది. ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఆధిపత్య పోరు కూడా తారాస్థాయికి చేరుకుంది. గత ఏడాది టిటిడి ఛైర్మన్‌ ా పదవీ కాలం ముగియడంతో జిల్లా రాజకీయాల్లో మళ్లీ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని వైవి సుబ్బారెడ్డి ప్రయత్నించారు. ఆ సమయంలో వైవీ సుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ, మంత్రి పదవి దక్కకుండా బాలినేని అడ్డుపడ్డారని ప్రచారం జరిగింది.

ప్రకాశం జిల్లాలో నామినేటెడ్ పదవుల విషయంలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రతిపాదించిన వారికే అధిక ప్రాధాన్యత ఇచ్చారు. పార్టీ లో సీనియర్స్, ఎన్నికల్లో కష్టపడ్డ వారిని వై వి. వర్గం అన్న ముద్రతో దూరం పెట్టినట్టు తెలుస్తోంది. టిడిపి నుంచి వచ్చిన జూపూడి ప్రభాకరరావుకు పదవి ఇవ్వడంపై పట్ల వైఎస్సార్సీపీలో అసంతృప్తి ఉంది. కొండపి నియోజకవర్గంలో ఇంఛార్జి మద్రాసు వెంకయ్య కి మళ్లీ డీసీసీబీ బ్యాంక్ చైర్మన్ పదవి ఇవ్వడం, సింగరాయకొండలో బత్తుల అశోక్ రెడ్డి భార్యకు రీజనల్ ఆర్టీసి చైర్మన్ పదవి కేటాయింపు, మద్య విమోచన కమిటీ చైర్మన్ లక్షణ రెడ్డి నియామకాల్లో బాలినేని చక్రం తిప్పారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాను తన చెప్పు చేతల్లో ఉంచుకోడానికి బాలినేని చేస్తున్న ప్రయత్నాలకు చెక్ పెట్టడం కోసమే సిఎం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారనే ప్రచారం ఉంది.

రాజీనామా అస్త్రానికి ముఖ్యమంత్రి లొంగకపోవడం, జిల్లా బాధ్యతలు అప్పగించడానికి విముఖత చూపడంతో బాలినేని ఎలా వ్యవహరిస్తారనేది కీలకంగా మారింది.

Whats_app_banner