Balineni Srinivas Reddy : బాలినేని ఏ గట్టునుంటారో? టీడీపీ ఎంపీ సీటు ఆఫర్ చేసిందా?-prakasam politics ysrcp key leader balineni not happy with local politics looking other party side ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Balineni Srinivas Reddy : బాలినేని ఏ గట్టునుంటారో? టీడీపీ ఎంపీ సీటు ఆఫర్ చేసిందా?

Balineni Srinivas Reddy : బాలినేని ఏ గట్టునుంటారో? టీడీపీ ఎంపీ సీటు ఆఫర్ చేసిందా?

Bandaru Satyaprasad HT Telugu
May 09, 2023 07:18 PM IST

Balineni Srinivas Reddy : ప్రకాశం జిల్లాలో వైసీపీ కీలక నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి దారెటు అంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. బాలినేని టీడీపీ నుంచి ఎంపీగా పోటీ చేస్తారన్న ప్రచారం తెరపైకి వచ్చింది.

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి (Twitter )

Balineni Srinivas Reddy : బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఎపిసోడ్ రోజుకో మలుపు తిరుగుతోంది. సొంత పార్టీ నేతలే తనపై కుట్ర చేస్తున్నారని ఇటీవల బాలినేని కంటతడి పెట్టుకున్నారు. పంచాయితీ సీఎం జగన్ వద్ద వరకూ వెళ్లినా కొలిక్కి రాలేదు. మంత్రి పదవి పోయినప్పటి నుంచి బాలినేని అసంతృప్తితో ఉన్నారు. మంత్రి పదవి తీసేసిన వైసీపీ అధిష్ఠానం.. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల కో-ఆర్టినేటర్ పదవి కట్టబెట్టింది. అవేవీ బాలినేనికి సంతృప్తినివ్వలేకపోయాయి. పార్టీలో తాను టికెట్లు ఇప్పించిన వాళ్లే తనను లెక్కచేయకపోవడంపై అసంతృప్తిగా ఉన్న బాలినేని.. ఇటీవల కో-ఆర్టినేటర్ పదవికి రాజీనామా చేశారు. నెల్లూరు జిల్లాలో ఎదురైన అనుభవంతో... ప్రకాశం జిల్లా పరిణామాలపై వైసీపీ అధిష్ఠానం ముందుగా స్పందించింది. బాలినేని శ్రీనివాస్ రెడ్డి తాడేపల్లికి పిలిపించి సీఎం జగన్ మాట్లాడారు.

సొంత పార్టీ నేతలపైనే విమర్శలు

సీఎం జగన్ తో మాట్లాడినా బాలినేనిలో సంతృప్తి కనిపించలేదు. సీఎం జగన్ తో భేటీ తర్వాత ఒంగోలు వచ్చిన బాలినేని ప్రెస్ మీట్ పెట్టి సొంత పార్టీ నేతలపైనే విమర్శలు చేశారు. తనపై కుట్ర జరుగుతోందని బహిరంగంగా విమర్శలు చేశారు. తాను పార్టీ మారబోతున్నట్టు వస్తున్న వార్తలను కూడా బాలినేని తిప్పికొట్టారు. తాను ఎవరిపైనా అధిష్టానానికి ఫిర్యాదు చేయలేదని, చేయబోనన్నారు. అది తన నైజం కాదన్న ఆయన.. కానీ తనపై చాలామంది అధిష్టానానికి ఫిర్యాదు చేస్తున్నారని ఆవేదన చెందారు. పార్టీ మారుతున్నానంటూ తప్పుడు ప్రచారం చేయిస్తున్నారన్నారు.

విజయసాయి రెడ్డి రంగంలోకి

బాలినేని శ్రీనివాస్ రెడ్డి రాజీనామా చేసిన కో-ఆర్టినేటర్ బాధ్యతలను సీఎం జగన్ విజ‌య‌సాయి రెడ్డికి అప్పగించారు. బాలినేని సీఎం జగన్ సమీప బంధువు అయినప్పటికీ ఉపేక్షించేది లేదన్న సంకేతాలు ఇచ్చారు. ఇటీవల సైలెంట్ అయిన విజయసాయి రెడ్డికి మళ్లీ పవర్స్ ఇచ్చారు. తాజా ప‌రిణామాలు చూస్తుంటే ప్రకాశం జిల్లాలో వైసీపీ గట్టి ఎదురుదెబ్బ తగిలేలా కనిపిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ప్రకాశం జిల్లాలో బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైసీపీకి కీలకనేత. పార్టీ పెట్టినప్పటి నుంచి జగన్ వెంట ఉన్న నేత. ఇప్పుడు బాలినేని పార్టీని వీడితే జిల్లాలో కోలుకోలేని దెబ్బ తగలుతుంది. అందుకే ఈ సమస్యను పరిష్కరించేందుకు వైసీపీ అధిష్ఠానం ట్రబుల్ షూట‌ర్ గా పేరున్న విజ‌య‌సాయిరెడ్డిని రంగంలోకి దింపారని సమాచారం.

బాలినేని, సుబ్బారెడ్డికి మధ్య గ్యాప్

బాలినేని, సుబ్బారెడ్డికి మధ్య గ్యాప్ పెరిగింది. ఇటీవల ప్రెస్ మీట్ లో వైవీ సుబ్బారెడ్డిపై బాలినేని పరోక్షంగా విమర్శలు చేశారు. అలాగే విజయసాయి రెడ్డి, సుబ్బారెడ్డి మధ్య సత్సంబంధాలు లేవని సమాచారం. ఇప్పుడు శ‌త్రువుకు శ‌త్రువు మిత్రుడు మాదిరిగా బాలినేని, విజయసాయిరెడ్డి ఒక‌టి అవుతారని వైసీపీ వ‌ర్గాల్లోని జోరుగా చర్చ జరుగుతోంది.

టీడీపీ ఎంపీగా పోటీ?

మరోవైపు బాలినేని టీడీపీ పార్టీ వైపు చూస్తున్నార‌ని జోరుగా ప్రచారం జరుగుతోంది. గ‌త ఎన్నిక‌ల సమయంలో కూడా బాలినేని టీడీపీ చేరతారని విస్తృతంగా ప్రచారం జ‌రిగింది. కానీ బాలినేని వైసీపీ నుంచి పోటీ చేశారు. ఇప్పుడు ప‌రిస్థితుల మారిపోవడంతో వైసీపీలో ఇమ‌డ‌లేక‌పోతున్నార‌ని, త్వరలో టీడీపీ చేరతారని ప్రచారం జరుగుతోంది. టీడీపీ నుంచి ఎంపీగా పోటీ చేస్తారని కూడా టాక్ వినిపిస్తుంది.

Whats_app_banner

సంబంధిత కథనం