Ongole Politics: వేడెక్కిన ఒంగోలు.. ఒక్కటైన మాగుంట, బాలినేని కుటుంబాలు
Ongole Politics: ఒంగోలు రాజకీయాలు రసవత్తరంగా మారాయి. మంత్రి పదవి కోల్పోయిన తర్వాత జిల్లా బాధ్యతలు కూడా దక్కకపోవడంతో ప్రాంతీయ సమన్వయకర్త పదవిని కూడా బాలినేని వదిలేసుకున్నారు. మరోవైపు జిల్లాపై పట్టు నిలుపుకునేందుకు మాగుంటతో జట్టు కట్టారనే ప్రచారం జరుగుతోంది.
Ongole Politics: వచ్చే ఎన్నికల్లో ఒంగోలులో పట్టు నిలుపుకోవాలని భావిస్తున్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి ఇప్పటి నుంచి పావులు కదపడం ప్రారంభించారు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో సీటు దక్కుతుందో లేదోననే టెన్షన్‌తో ఉన్న మాగుంటను కూడా తనతో జట్టు కలుపుకోవడం జిల్లా రాజకీయాలను రసవత్తరంగా మార్చింది.
ప్రకాశం జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి.ఇళ్ల పట్టాల వ్యవహారంలో తాను అక్రమాలకు పాల్పడినట్టు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని మాజీ మంత్రి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఆగష్టు 15 వేడుకల్లో సవాల్ విసిరారు.
జిల్లాలో నిస్వార్దంగా పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తున్నామని, బురద చల్లడానికి ప్రయత్నం చేస్తే పేదలు క్షమించరని, స్కామ్‌లు నిరూపించలేకపోతే రాజకీయ సన్యాసం చేస్తారా అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి తీరుతానని బాలినేని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను ఒంగోలు అసెంబ్లీ నుంచి, ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఒంగోలు నుంచే పోటీ చేస్తామని బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.
ఒంగోలు నగర పాలకసంస్థ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకలకు ఎంపీ మాగుంటతో కలిసి ఆయన హాజరయ్యారు. వచ్చే ఎన్నికల్లో తాను నియోజకవర్గం మారుతానంటూ వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. కొందరు కావాలనే ఇటువంటి ప్రచారం చేస్తున్నారని, వాటిని నమ్మొద్దన్నారు.ఒంగోలు ఎమ్మెల్యేగా తాను, ఎంపీగా మాగుంట శ్రీనివాసులురెడ్డి పోటీ చేయటం తథ్యమని చెప్పారు.
ఏం జరిగిందంటే….
ఒంగోలు రాజకీయాలపై పట్టు నిలుపుకునే విషయం ముఖ్యమంత్రి సమీప బంధువులైన వైవీ.సుబ్బారెడ్డికి, బాలినేని శ్రీనివాస రెడ్డి మధ్య విభేదాలు ఉన్నాయి. వైవీ సుబ్బారెడ్డి సోదరిని బాలినేని వివాహం చేసుకున్నారు. వైఎస్సార్ అనుచరుడిగా బాలినేని రాజకీయాల్లో ఎదిగారు. వైఎస్ మంత్రివర్గంలో పనిచేశారు. ఆ తర్వాత జగన్ కోసం కాంగ్రెస్ పార్టీని వీడారు.
ఈ క్రమంలో కొన్నాళ్లుగా బాలినేని, వైవీ సుబ్బారెడ్డి కుటుంబాల మధ్య పొసగడం లేదు. 2014 ఎన్నికల్లో ఒంగోలు ఎంపీగా వైవీ సుబ్బారెడ్డి పోటీ చేసి గెలుపొందారు. 2019ఎన్నికల్లో పోటీ చేయలేదు. 2024 ఎన్నికల్లో వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే బాలినేని, మాగుంట జట్టు కట్టినట్టు చెబుతున్నారు.
బాలినేని రాజకీయ భవితవ్యంపై గత కొన్నాళ్లుగా ప్రకాశం జిల్లాలో చర్చ సాగుతోంది. ఒకప్పుడు ఉమ్మడి ప్రకాశం జిల్లా మొత్తాన్ని తన గుప్పెట్లో ఉంచుకున్నారని బాలినేనిపై విమర్శలు ఉన్నాయి. మంత్రి వర్గంలో పదవి కోల్పోయిన తర్వాత కనీసం జిల్లా బాధ్యతలు తనకు ఇవ్వాలని కోరినా జగన్ అందుకు అంగీకరించలేదు. తాజాగా సుబ్బారెడ్డి కుటుంబం క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారనే వార్తలతో బాలినేని అలర్ట్ అయ్యారు.
బాలినేని కూాడ తన కుమారుడికి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నారు. అటు ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ కావడానికి ముందు మాగుంట రాఘవ వచ్చే ఎన్నికల్లో ఒంగోలు నుంచి పోటీ చేస్తారని ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి ప్రకటించారు. దీంతో ఒంగోలు పార్లమెంటు స్థానానికి పోటీ తీవ్రమైంది. జిల్లా రాజకీయాలపై పట్టు నిలుపుకోవడంతో పాటు భవిష్యత్తును కాపాడుకునే క్రమంలో బాలినేని, మాగుంట కుటుంబాలు ఒక్కటైనట్టు కనిపిస్తోంది. గతంలో వీరిద్ధరూ ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకున్నారు. ఎంపీ మాగుంటపై బాలినేని తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన ఉదంతాలు కూడా ఉన్నాయి.