YS Sharmila : రామభక్తులని చెప్పుకుంటే సరిపోతుందా? హోదాపై మోదీ ఇచ్చిన మాట ఏమైంది?- వైఎస్ షర్మిల
YS Sharmila : వైసీపీ, టీడీపీ బీజేపీకి బానిసలు అని వైఎస్ షర్మిల విమర్శించారు. హోదా విషయంలో జగన్, చంద్రబాబు ఇద్దరూ విఫలం అయ్యారన్నారు. వామపక్షాలతో పొత్తులపై త్వరలో క్లారిటీ వస్తుందన్నారు.
YS Sharmila : వైసీపీ, టీడీపీ బీజేపీకి(BJP) తొత్తులుగా మారి ఏపీ హక్కులను కాలరాస్తున్నారని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) విమర్శించారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆమె.. వైసీపీ, టీడీపీ బీజేపీకి బానిసలుగా మారారన్నారు. రాష్ట్ర హక్కుల కోసం పోరాడేది పార్టీ కాంగ్రెస్ మాత్రమే అన్నారు. ఈ ప్రయాణంలో భాగంగా వామపక్షాలతో పొత్తు పెట్టుకుంటున్నామన్నారు. ఏపీ హక్కుల కోసం కలిసి పోరాడే అంశంపై చర్చించామన్నారు. కలిసి కట్టుగా లేకపోతే ఈ పెద్ద పర్వతాలను దించడం అసాధ్యమన్నారు. అనంతపురం సభకు సీపీఐ, సీపీఐలను ఆహ్వానించామన్నారు. ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చలు జరుగుతున్నాయన్నారు. పొత్తులపై త్వరలో క్లారిటీ వస్తుందన్నారు. కాంగ్రెస్(Congress) 2014 అధికారంలో వచ్చి ఉంటే రాష్ట్రానికి 10 ఏళ్లు ప్రత్యేక హోదా వచ్చేదన్నారు. హోదా విషయంలో జగన్, చంద్రబాబు(Jagan Chandrababu) ఇద్దరూ విఫలం అయ్యారని షర్మిల విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలో వచ్చి ఉంటే పోలవరం పూర్తి అయ్యేదన్నారు. ప్రధాని మోదీ తిరుపతిలో హోదాపై మాట ఇచ్చి తప్పారని ఆరోపిచారు. రామభక్తులు అని చెప్పుకుంటే సరిపోతుందా? అని ప్రశ్నించారు.
"ఆళ్ల రామకృష్ణా రెడ్డి నాకు దగ్గర మనిషి. ఆయన ఎక్కడున్నా బాగుండాలి, సంతోషంగా ఉండాలి. ఆయన మీద తీవ్ర స్థాయిలో ఒత్తిడులు ఉన్నాయి. ఆయన చెల్లెలిగా నేను అర్థం చేసుకున్నాను. ఒక మంచి పర్సన్, రాంగ్ ప్లేస్ లో ఉన్నారు"- వైఎస్ షర్మిల
ఒక్క శాతం ఓట్లు లేని బీజేపీ ఏపీని శాసిస్తుంది
బీజేపీ ఏపీకి తీరని ద్రోహం చేసిందని సీపీఎం నేత శ్రీనివాస్ రావు ఆరోపించారు. బీజేపీ, వైసీపీ, టీడీపీ మీదనే మా పోరాటం అన్నారు. ఈ కూటములు రాష్ట్రాన్ని ఘోరంగా మోసం చేశాయని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఒక్క శాతం కూడా ఓటు షేర్ లేని బీజేపీ ఏపీని శాసిస్తుందన్నారు. బీజేపీ మీద దుమ్మెత్తి పోసిన చంద్రబాబు ఇప్పుడు పొర్లు దండాలు పెడుతున్నారన్నారు. బీజేపీ ముఖ్యమంత్రులు కూడా ఇన్ని సార్లు దిల్లీ చుట్టూ తిరగడం లేదన్నారు. ఇన్ని సార్లు తిరిగినా ఒక్క హామీ కూడా అమలు కాలేదని ధ్వజమెత్తారు. రాష్ట్ర రాజధానికి నిధులు లేవన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ సహకారం తీసుకుంటామని, అందరం కలిసి కట్టుగా ఎన్నికల్లో పోటీ చేస్తామన్నారు. ఈ దుష్ట కూటమిలను ఓడగొడతామన్నారు. బీజేపీని, వారికి కాపు గాసే వారిని సాగనంపుతామన్నారు.
జగన్, చంద్రబాబు, పవన్ మోదీకి దాసోహం
"బీజేపీది మతతత్వ రాజకీయం. బీజేపీ మళ్లీ అధికారంలో వస్తే అంబేడ్కర్ రాజ్యాంగాన్ని మారుస్తారు. దేశం అత్యంత ప్రమాదంలో ఉంది. ప్రధానమైన ప్రాంతీయ పార్టీలు బీజేపీకి భయపడుతున్నాయి. జగన్, చంద్రబాబు, పవన్ మోదీకి దాసోహం అంటున్నారు. తెలుగు ప్రజల ఆత్మ గౌరవం బీజేపీ దగ్గర తాకట్టు పెట్టారు. దేశంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి రాకూడదు. జగన్ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం సర్వనాశనం అయింది. ప్రజలను బిచ్చగాళ్లను చేశారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు. ఈ ప్రభుత్వం సిగ్గుపడాలి. పీసీసీ అధ్యక్షురాలిని అరెస్ట్ చేయడం దారుణం."- సీపీఐ రాష్ట్రకార్యదర్శి రామకృష్ణ
సంబంధిత కథనం