Alla Ramakrishna Reddy Joins Ysrcp : మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(Alla Ramakrishna Reddy) తిరిగి సొంత గూటికి చేరారు. మంగళవారం సీఎం జగన్ సమక్షంలో ఎమ్మెల్యే ఆర్కే వైసీపీలో చేరారు. ఆర్కేకు సీఎం జగన్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మంగళగిరి వైసీపీ ఇన్ ఛార్జ్ ను మార్చడంపై అలిగిన ఆర్కే... ఎమ్మెల్యే పదవి, వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆ తర్వాత వైఎస్ షర్మిల వెంట నడుస్తాంటూ... కాంగ్రెస్ చేరారు. కాంగ్రెస్ లో చేరిన నెల వ్యవధిలోనే ఆళ్ల రామకృష్ణా రెడ్డి మనసు మార్చుకున్నారు. తిరిగి వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. వైసీపీ ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డితో పాటు తాడేపల్లి క్యాంప్ ఆఫీస్‌కు వచ్చిన ఆర్కే.. సీఎం జగన్‌ను కలిసి ఆ పార్టీలో చేరారు. ఇన్ ఛార్జ్ మార్పుచేర్పుల్లో వైసీపీ...మంగళగిరి నియోజకవర్గ ఇన్ ఛార్జ్ గా టీడీపీ నుంచి వైసీపీలో చేరిన గంజి చిరంజీవిని వైసీపీ(Ysrcp) అధిష్టానం నియమించింది. దీంతో అప్పట్లో పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆర్కే... ఏకంగా వైసీపీకి రాజీనామా చేశారు. కానీ ఇంతలోనే మనసు మార్చుకుని తిరిగి సొంత గూటికి చేరారు.
తిరిగి వైసీపీలో చేరడంపై ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(Alla Ramakrishna Reddy Joins Ysrcp) తన సన్నిహితులతో మాట్లాడుతూ... 'కాంగ్రెస్ పార్టీ సీఎం జగన్ ను తిట్టమని ఆదేశించింది. నాకు నచ్చలేదు, జగన్ నన్ను రెండు సార్లు ఎమ్మెల్యే చేశారు. అక్కడ పద్దతీ పాడు ఏమీ లేదు. రాజకీయాల్లో రాజకీయం గురించి మాట్లాడాలి. కాంగ్రెస్ పార్టీ కానీ షర్మిల విధానం అలా లేదు. కేవలం వ్యక్తిగతంగానే విమర్శిస్తున్నారు. ఈ విషయంపై ఎన్నోసార్లు ఆమెతో పాటు పార్టీకి చెప్పి చూశాను కానీ వినలేదు. జగన్ పై వ్యక్తిగతంగా మాట్లాడడం నాకు నచ్చలేదు అందుకే ఆమెతో నడవడం ఇష్టం లేక సొంత గూటికి వస్తున్నాను' అని అన్నారు.
2014లో తొలిసారి ఎమ్మెల్యే ఎన్నికైన ఆళ్ల రామకృష్ణారెడ్డి 2019లో రెండోసారి విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో టీడీపీ నాయకుడు నారాలోకేష్‌పై విజయం సాధించారు. రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆళ్ల రామకృష్ణారెడ్డిలో అసంతృప్తి పెరిగినట్టు ప్రచారం జరిగింది. మంత్రి పదవి ఆశించినా సామాజిక సమీకరణల నేపథ్యంలో ఆయనకు అవకాశం దక్కలేదు. గత ఎన్నికల సమయంలో ఆర్కేను మంత్రి చేస్తామని జగనే స్వయంగా చెప్పారు. కానీ ఆ తర్వాత అది సాధ్యపడలేదు. ఇలా పలు కారణాలతో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. స్పీకర్ ఫార్మాట్‌లో తన రాజీనామా లేఖను స్పీకర్ కార్యాలయంలో అందించారు. రాజీనామా చేసిన తర్వాత తన గన్‌మెన్‌లను తిప్పి పంపారు.
ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఆళ్ల రామకృష్ణారెడ్డి అప్పట్లో వైసీపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో మళ్లీ చేరే ప్రసక్తే లేదన్నారు. నియోజకవర్గానికి ఒక రూపాయి ఇవ్వలేదని విమర్శించారు. అభివృద్ధి చేయకుండా మళ్లీ ఓటు ఎలా అడగాలంటూ ప్రశ్నించారు. షర్మిల వెంట నడవాలని నిర్ణయించుకున్నారని, ఆమె ఏ నిర్ణయం తీసుకున్నా ఆమె వెంటే నడుస్తానని చెప్పుకొచ్చారు. అనంతరం కాంగ్రెస్ లో చేరారు. కానీ ఇంతలోనే వివిధ కారణాలు చెప్తూ ఆర్కే కాంగ్రెస్ ను వీడి తిరిగి సొంత గూటికి వచ్చారు.
సంబంధిత కథనం