Mla RK Resign : మంగళగిరి వైసీపీలో ముసలం, ఆళ్ల రాజీనామాకు కారణలేంటి?-mangalagiri news in telugu mla alla rama krishna reddy resigned to ysrcp what are reasons ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Mla Rk Resign : మంగళగిరి వైసీపీలో ముసలం, ఆళ్ల రాజీనామాకు కారణలేంటి?

Mla RK Resign : మంగళగిరి వైసీపీలో ముసలం, ఆళ్ల రాజీనామాకు కారణలేంటి?

Bandaru Satyaprasad HT Telugu
Dec 11, 2023 03:57 PM IST

Mla RK Resign : మంగళగిరిలో ఆళ్ల రామకృష్ణారెడ్డిని గెలిపిస్తే మంత్రిని చేస్తానని జగన్ ఎన్నికల ప్రచారంలో అన్నారు. అనంతరం రాజకీయ పరిస్థితులతో ఆళ్లకు మంత్రి పదవి దక్కలేదు. దీంతో అసంతృప్తితో ఉన్న ఆయన, మంగళగిరిలో మారిన రాజకీయ సమీకరణాలతో రాజీనామా చేశారు.

ఆళ్ల రామకృష్ణా రెడ్డి
ఆళ్ల రామకృష్ణా రెడ్డి

Mla RK Resign : ఏపీలో అధికార వైసీపీకి గట్టి షాక్ తగిలింది. మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తన పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. మంత్రి పదవి ఖాయం అనుకున్న స్థాయి నుంచి ఆళ్లకు రాజీనామా చేసే పరిస్థితి ఎందుకు వచ్చిందని జోరుగా చర్చ జరుగుతోంది. ఆళ్ల రాజీనామా ఏపీ రాజకీయాల్లో కీలకం కానుందా? వైసీపీ అధిష్ఠానం రియాక్షన్ ఎలా ఉంటుందో అనే చర్చ మొదలైంది. కొంత కాలంగా వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న ఆళ్ల రామకృష్ణా రెడ్డి... అధిష్ఠానం తీరుపై అసంతృప్తిగా ఉన్నారని ఆయన అనుచరులు అంటున్నారు.

బీసీ నేతకు టికెట్!

వచ్చే ఎన్నికల్లో మంగళగిరి వైసీపీ ఇన్‎ఛార్జ్‎గా గంజి చిరంజీవిని నియమించే అవకాశం ఉందనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆళ్ల తీవ్ర మనస్థాపానికి గురైనట్లు సమాచారం. బీసీ సామాజిక వర్గానికి చెందిన గంజి చిరంజీవి ఇటీవలె వైసీపీలో చేరారు. గంజి చిరంజీవి వైసీపీలో చేరగానే ఆప్కో ఛైర్మన్‎గా నియమించింది ప్రభుత్వం. మంత్రి పదవి దక్కలేదని అసంతృప్తితో ఉన్న ఆళ్ల...మంగళగిరిలో తాజా రాజకీయ పరిణామాలతో వైసీపీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.

పార్టీ కార్యక్రమాలకు దూరంగా

వైసీపీ అధిష్ఠానంపై గత కొంత కాలంగా అసంతృప్తితో ఉన్న ఆళ్ల రామకృష్ణారెడ్డి.. ఎమ్మెల్యేగా అధికారిక కార్యక్రమాలకు మాత్రమే హాజరయ్యేవారు. వైసీపీ కార్యక్రమాలకు మాత్రం దూరంగా ఉంటున్నారు. వచ్చే ఎన్నికల్లో మంగళగిరి సీటు బీసీలకు కేటాయిస్తారనే ప్రచారం వైసీపీ ముమ్మరం అయింది. దీంతో ఆళ్ల వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. వైసీపీ అధిష్ఠానం కూడా తనను పిలిపించి మాట్లాడలేదని మరింత ఆవేదన చెందిన ఆళ్ల... సోమవారం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.

కొనసాగుతున్న రాజీనామాలు

మంగళగిరి వైసీపీలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. వైసీపీ సీనియర్‌ నేత, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇవాళ రాజీనామా చేశారు. దీంతో వైసీపీ పదవులకు తాడేపల్లి పట్టణ అధ్యక్షులు బుర్ర ముక్కు వేణుగోపాలస్వామి రెడ్డి రాజీనామా చేశారు. తాడేపల్లి రూరల్ మండల అధ్యక్షులు కూడా వైసీపీని వీడారు. వీరితో పాటు మంగళగిరి వైసీపీకి చెందిన కీలక నేతలు రాజీనామాల బాటపట్టారు. కొత్త వచ్చిన వాళ్ల ప్రోత్సహిస్తూ... ఇన్నాళ్లు పార్టీ కోసం కష్టపడిన వారికి గుర్తించడంలేదని వైసీపీ నేతలు కొందరు అసంతృప్తిగా ఉన్నారని సమాచారం.

గంజి చిరంజీవి ఎంట్రీ మారిన సీన్

మంగళగిరి వైసీపీలో పెద్ద ఎత్తున చీలికలు మొదలయ్యాయి. ఇటీవల టీడీపీ నుంచి గంజి చిరంజీవిని వైసీపీలోకి ఆహ్వానించిన తర్వాత సమీకరణలు మారిపోయాయి. మంగళగిరిలో సామాజిక సమీకరణలను దృష్టిలో ఉంచుకుని పద్మశాలీ వర్గానికి ఈసారి టికెట్ ఇవ్వాలనే ఆలోచనలో వైసీపీ అధిష్టానంలో ఉన్నట్టు తెలుస్తోంది. నియోజక వర్గ ఇన్‌ఛార్జ్ గా గంజి చిరంజీవిని నియమించేందుకు పార్టీ నిర్ణయించడం ఆళ్ల రామకృష్ణారెడ్డికి మింగుడు పడనట్టు తెలుస్తోంది. పార్టీ పెద్దలు తనను కనీసం సంప్రదించకపోవడంతో మనస్తాపంతో ఆర్కే ఎమ్మె్ల్యే పదవికి రాజీనామా చేశారని తెలుస్తోంది. మంగళగిరి నియోజకవర్గానికి కనీసం నిధులు కూడా ఇవ్వడంలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Whats_app_banner