MLA Alla Resignation: వైసీపీకి, పదవికి రాజీనామా చేసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే-mangalagiri mla alla resigned from ycp membership and mla post ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Mla Alla Resignation: వైసీపీకి, పదవికి రాజీనామా చేసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే

MLA Alla Resignation: వైసీపీకి, పదవికి రాజీనామా చేసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే

Sarath chandra.B HT Telugu
Dec 11, 2023 01:11 PM IST

MLA Alla Resignation: మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా లేఖను స్పీకర్‌కు పంపించారు. స్పీకర్‌ అందుబాటులో లేకపోవడంతో ఓఎస్డీకి అందచేసినట్టు ఆళ‌్ళ తెలిపారు.

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి
మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి

MLA Alla Resignation: మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. స్పీకర్‌ ఫార్మాట్‌లో తన రాజీనామా లేఖను స్పీకర్‌ కార్యాలయంలో అందచేశారు. రాజీనామా అమోదించాల్సిందిగా కోరేందుకు వెళ్లానని, స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో ఓఎస్డీకి లేఖను అందచేసినట్టు చెప్పారు. రాజీనామా చేసిన తర్వాత తన గన్‌మెన్‌లను తిప్పి పంపారు.

గత కొంత కాలంగా ఆళ్ల రామకృష్ణా రెడ్డికి పార్టీతో దూరం పెరుగుతోందనే ప్రచారం వైసీపీలో జరుగుతోంది. 2024 ఎన్నికల్లో ఆయనకు టిక్కెట్ దక్కకపోవచ్చని ప్రచారం జరుగుతోంది. ఈ దఫా ఎన్నికల్లో మంగళగిరి స్థానాన్ని బీసీ సామాజిక వర్గానికి కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది.

ఈ నేపథ్యంలోనే పార్టీకి, పదవికి రాజీనామా చేయాలని ఆర్కే నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.. పార్టీ నాయకత్వం తనను సంప్రదించకుండా పలు నిర్ణయాలు తీసుకోవడంపై కూడా కినుక వహించారు. ఆదివారం మంగళగిరి పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమం గురించి స్థానిక ఎమ్మెల్యేకు కనీస సమాచారం లేకపోవడం ఆళ్లను మనస్తాపానికి గురి చేసినట్టు సన్నిహితులు చెబుతున్నారు.

2014లో తొలిసారి ఎమ్మెల్యే ఎన్నికైన ఆళ్ల రామకృష్ణారెడ్డి 2019లో రెండోసారి విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో టీడీపీ నాయకుడు నారాలోకేష్‌పై విజయం సాధించారు. రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆళ్ల రామకృష్ణారెడ్డిలో అసంతృప్తి పెరిగినట్టు ప్రచారం జరిగింది.మంత్రి పదవి ఆశించినా సామాజిక సమీకరణల నేపథ్యంలో ఆయనకు అవకాశం దక్కలేదు.

మరోవైపు మంగళగిరి వైసీపీలో పెద్ద ఎత్తున చీలికలు వచ్చాయి. గ్రూపులుగా నాయకులు విడిపోయారు. టీడీపీ నుంచి గంజి చిరంజీవిని వైసీపీలోకి ఆహ్వానించిన తర్వాత సమీకరణలు మారిపోయాయి.మంగళగిరిలో సామాజిక సమీకరణలను దృష్టిలో ఉంచుకుని పద్మశాలీ వర్గానికి ఈసారి టిక్కెట్ ఇవ్వాలనే ఆలోచన వైసీపీ అధిష్టానంలో ఉన్నట్టు తెలుస్తోంది. నియోజక వర్గ ఇన్‌ఛార్జిగా గంజి చిరంజీవిని నియమించేందుకు పార్టీ నిర్ణయించడం ఆళ్లకు మింగుడు పడనట్టు తెలుస్తోంది.

పార్టీ పెద్దలు తనను కనీసం సంప్రదించక పోవడంతో మనస్తాపం చెందిన ఆర్కె పదవికి రాజీనామా చేశారు. మరోవైపు ఆళ్ల రామకృష్ణారెడ్డితో వైసీపీ నేతలు సంప్రదించేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఆదివారం వైసీపీ ప్రాంతీయ పరిశీలకుడు వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి ఆధ్వర్యంలో మంగళగిరి ఆళ్ల ప్రత్యర్థులతో చర్చలు జరపడం కూడా ఆళ్లను అసంతృప్తికి గురి చేసినట్టు తెలుస్తోంది.

మరోవైపు మంగళగిరి నియోజకవర్గానికి నిధులు ఇవ్వడం లేదని అసంతృప్తితో ఆళ్ల ఉన్నారు. నియోజక వర్గం కోసం రూ.1250 కోట్లు నిధులు ఇస్తామని హామీ ఇచ్చి మాట తప్పారని కూడా ఆగ్రహంతో ఉన్నారు. ఉద్దేశపూర్వకంగా తనను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆళ్ల రామకృష్ణా రెడ్డి భావిస్తున్నారు. ఈ కారణాలతోనే ఆళ్ల రాజీనామా చేశారని అనుచరులు చెబుతున్నారు.

గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీ నేతల మధ్య విభేదాలు ఇటీవలి కాలంలో తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఇటీవల పోటాపోటీగా కార్యాలయాలు సైతం ఓపెన్ చేశారు. ఆళ్ల రామకృష్ణారెడ్డికి వ్యతిరేకంగా, మంగళగిరి తాడేపల్లి నగర అధ్యక్షుడు దొంతిరెడ్డి వేమారెడ్డి పార్టీ పేరుతో కార్యాలయం ఏర్పాటు చేశారు. ఇప్పటికే మంగళగిరిలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీ కార్యాలయం ఉండగా వేమారెడ్డి కార్యాలయం ఓపెన్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. మరోవైపు గంజి చిరంజీవికి బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం కూడా ఆళ్లను అసంతృప్తికి గురి చేసింది.

ఆళ్ల రాజీనామా లేఖ
ఆళ్ల రాజీనామా లేఖ
Whats_app_banner