Tadepalli : అమ్మో! కిలేడీ-పైకి బట్టల వ్యాపారం, వాట్సాప్ లో పిల్లల అమ్మకం!
Tadepalli : వాట్సాప్ లో చిన్నారులను విక్రయిస్తున్న కిలాడీ లేడీ గుట్టురట్టైంది. చీరలు, వస్త్రాల వ్యాపారం ముసుగులో...పిల్లలు లేని ధనవంతులను, పిల్లలున్న పేద వాళ్ల వివరాలు తెలుసుకుని...చిన్నారుల ఫొటోలు పంపి అమ్మకం, కొనుగోలు గుట్టుగా చేస్తుంది.
Tadepalli : సోషల్ మీడియా వచ్చిన తరువాత అన్ని పనులు సులువుగా అయిపోతున్నాయి. అలాగే కమ్యూనికేషన్ ఈజీగా జరుగుతోంది. అయితే అదే సోషల్ మీడియాను కొంత మంది అసాంఘిక చర్యలకు వాడుకుంటున్నారు. తాజాగా ఒక కిలాడీ లేడీ వాట్సాప్ ద్వారా చిన్నారులను అమ్మకానికి పెడుతోంది. ఈ వ్యవహారం ఆలస్యంగా బయటపడింది. చీరలు, వస్త్రాల వ్యాపారం ముసుగులో ఈ అక్రమాలకు పాల్పడుతోంది.
గుంటూరు జిల్లాలో తాడేపల్లి మండలంలోని నులకపేటలో ఒక వ్యక్తికి వాట్సాప్ లో కిలాడీ లేడీ ఒక ఆఫర్ పెట్టింది. దీంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సంతానం లేని డబ్బున్న వారిని, కుటుంబాన్ని పోషించలేని దంపతులను టార్గెట్ చేస్తోంది. కుటుంబాన్ని పోషించలేని వారివద్ద నుంచి చిన్నారులను తీసుకొని, సంతానం లేని వారికి అమ్ముతోంది. సోషల్ మీడియా ద్వారా పసికందుల ఫొటోలను పంపి అమ్మకం, కొనుగోళ్లను గుట్టుగా చేస్తోంది. ఈ వ్యవహారం బుధవారం బయటపడింది.
తాడేపల్లి మండలంలోని నులకపేటలో సామ్రాజ్యం అనే మహిళ చీరలు, వస్త్రాల వ్యాపారం చేస్తోంది. స్థానికంగా ఉండే మహిళలను పరిచయం చేసుకుంటుంది. ఒక వ్యక్తితో సహజీవనం చేస్తూ నులకపేటలో ఉంటోంది. తాము భార్యా భర్తలుగా స్థానికులను నమ్మించింది. ఈ నేపథ్యంలో కొంతమంది సంతానం లేని దంపతులకు, కుటుంబ పోషణ సరిగాలేని వారిని టార్గెట్‌గా చేసుకొని వారి ఫోన్ నెంబర్లను తీసుకుంటుంది. చిన్నారుల, పసికందుల ఫొటోలు వాట్సాప్ ద్వారా పంపించి, చిన్నారుల అమ్మకాలు, కొనుగోలు గుట్టుగా సాగిస్తోంది. తమ వద్ద చిన్నారులు ఉన్నారని, ఒక్కో చిన్నారి నాలుగు, ఐదు లక్షల రూపాయలకు అమ్మకానికి పెడుతోంది. అవసరమైన వారు ఎవరైనా ఉంటే, తనకు సమాచారం ఇవ్వాలని పేర్కొంటుంది. ఇలా ఒక వ్యక్తికి వాట్సాప్‌లో చిన్నారుల ఫొటోలు పంపించింది. దీంతో గుట్టురట్టు అయింది.
ఈ మహిళ చిన్నారుల అమ్మకంతో పాటు కిడ్నీల అమ్మకం, మెట్రిమోని మోసాలు, అవయవాలు, వీర్యకణాల అమ్మకం దందాలో కీలకపాత్ర పోషిస్తుంది. సహజీవనం పేరుతో పురుషులను టార్గెట్ చేసి, ఆ కిలాడీ లేడీ లక్షల్లో దోచుకుంటుంది. ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకుని పేద, ఒంటరి మహిళలే టార్గెట్‌గా గుట్టుచప్పుడు కాకుండా కిడ్నీ రాకెట్‌ను నడుపుతోంది. మోసపోయామని గ్రహించి పరువు పోతుందని బాధితులు మిన్నకుండిపోతున్నారు. ఈ మహిళ గతంలో కుటుంబ వివాదాల్లో, వివిధ కేసుల వ్యవహారాల్లో తాడేపల్లి పోలీస్ స్టేషన్‌కు తిరుగుతూ తనకు పోలీస్ అధికారులు, సిబ్బందితో సత్సంబంధాలు ఉన్నాయని స్థానికులను మభ్యపెడుతూ వచ్చింది. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి మోసాలను కొనసాగిస్తూ వచ్చింది. తనకు బలమైన అండ కోసం దుర్బుద్ధితో గతంలో పదేళ్ల పాటు సహజీవనం చేసిన వ్యక్తిని సైతం వదిలేసింది.
మ్యాట్రిమోనీ వెబ్‌సైట్ ద్వారా ఓ సైనిక ఉద్యోగిని కొద్ది నెలల క్రితమే వివాహం చేసుకుని హైదరాబాద్‌కు మకాం మార్చింది. దేశాన్ని రక్షించాల్సిన సైనిక ఉద్యోగి, తన భార్య చేస్తున్న అక్రమ నేరాలను ప్రోత్సహిస్తున్నాడు. తాడేపల్లిలో ఓ సామాన్య మహిళలను టార్గెట్ చేస్తూ కిలాడీ గుట్టుగా నేరాలను చేస్తుంది. ఆమె నేరాలపై సమగ్ర విచారణ జరిపి, కిలాడీ ఆట కట్టించాలని స్థానికులు కోరుతున్నారు.
జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం