Guntur hostel Girls: గుంటూరులో ఘోరం, సోషల్ వెల్ఫేర్ హాస్టల్ విద్యార్థినుల కిడ్నాప్, ఒకరిపై అత్యాచారం
Guntur hostel Girls: గుంటూరు నగరంలో దారుణ ఘటన జరిగింది. ఐదు రోజుల క్రితం పరిచయమైన హాస్టల్ విద్యార్థినులను ఇద్దరు యువకులు కిడ్నాప్ చేశారు. సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చదువుకుంటున్న బాలికల్ని బయటకు తీసుకెళ్లి ఒకరిపై అత్యాచారానికి పాల్పడ్డారు. హాస్టల్ సిబ్బంది ఫిర్యాదుతో నిందితులపై కేసు నమోదు చేశారు.
Guntur hostel Girls: సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చదువుకుంటున్న ఇద్దరు ఇంటర్ విద్యార్థునుల్ని ఇద్దరు యువకులు కిడ్నాప్ చేశారు. హాస్టల్ సిబ్బంది ఏమరు పాటుగా ఉన్న సమయంలో హాస్టల్ నుంచి వారిని బయటకు తీసుకెళ్లారు. ఇద్దరు విద్యార్థినుల్లో ఒకరిపై అత్యాచారం జరిగింది. హాస్టల్ విద్యార్థినుల కిడ్నాప్, అత్యాచారం ఘటనలు కలకలం సృష్టించారు.
గుంటూరు నగరంలోని సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న ఇద్దరు బాలికలు సోమవారం సాయంత్రం అదృశ్యమయ్యారు. హాస్టల్లో ఉంటూ ఇంటర్మీడియట్ ఫస్టియర్ చదువుతున్న బాలికలకు ఓ యువకుడు కొద్ది రోజుల క్రితం పరిచయం అయ్యాడు. మాయమాటలతో వారికి దగ్గరయ్యాడు.
సోమవారం రాత్రి భోజనం చేసిన తర్వాత బాలికల్ని కిడ్నాప్ చేసిన యువకులు రాత్రంతా వారిని నగరంలోని రాజీవ్ గృహకల్ప అపార్ట్ మెంట్ ప్లాట్లలో ఉంచారు. ఆ సమయంలో ఓ విద్యార్ధినిపై యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. మరో బాలికపై అతని స్నేహితుడు అసభ్యంగా ప్రవర్తించడంతో ఆమె ప్రతిఘటించింది.
బాపట్ల జిల్లా చెరుకుపల్లి, గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలాలకు చెందిన ఇద్దరు బాలికలు గుంటూరు నగరంలో జూనియర్ ఇంటర్‌లో చేరారు. వీరు పట్టాభిపురం చంద్రమౌళీశ్వర ఆగ్రహారంలో ఉన్న సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఉంటున్నారు. ఇద్దరు బాలికల్లో ఒకరికి వారం క్రితం గుంటూరు జిల్లా స్పెషల్ బ్రాంచ్‌లో సీఐగా పనిచేస్తున్న అధికారి వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్న పగడాల గోపితో పరిచయం ఏర్పడింది. హాస్టల్ నుంచి కాలేజీకి వెళుతున్న సమయంలో బాలికతో మాటలు కలిపాడు.
ఈ క్రమంలో సోమవారం రాత్రి 9 గంటల సమయంలో గోపీ తన స్నేహితుడు మణికంఠతో కలిసి హాస్టల్ వద్దకు వచ్చాడు. ఆ సమయంలో హాస్టల్ వాచ్‌మాన్, వార్డెన్ అందుబాటులో లేరు. అనారోగ్యంతో ఉన్న బాలికను చూడటానికి విద్యార్ధిని తల్లి దండ్రులు రావడంతో మహిళా సెక్యూరిటీ సిబ్బంది వారిని హాస్టల్లోకి తీసుకెళ్లినట్టు చెబుతున్నారు.
ఈ సమయంలో ఇంటర్ విద్యార్థినులు హాస్టల్ నుంచి బయటకు వచ్చాారు. ఈ ఘటనలో హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యం ఉందని పోలీసులు చెబుతున్నారు. బయటకు వచ్చిన విద్యార్ధినుల్ని గోపి, మణికంఠలు తమ ద్విచక్రహనాలపై అడవి తక్కెళ్ళపా డులోని రాజీవ్ గృహకల్ప అపార్టుమెంట్లకి తీసుకెళ్లారు. వారిని వేర్వేరు గదుల్లోకి తీసుకెళ్లి రాత్రంతా అసభ్యంగా ప్రవర్తించారు.
గోపి ఓ బాలికపై అత్యాచారా నికి పాల్పడ్డాడు. మరో బాలికపై అత్యాచారానికి ప్రయత్నించిన మణికంఠను ఆమె ప్రతిఘటించింది. సోమవారం రాత్రి హాస్టల్లో బాలికలు కనిపించడం లేదని వార్డెన్ అనురాధ మంగళవారం పట్టాభిపురం పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశారు. అప్రమత్తమైన పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. బాలికల కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.
మంగళవారం ఉదయం నిందితులు ద్విచక్రవాహనాలపై బాలికలను హాస్టల్ వద్దకు తెచ్చారు. అక్కడే ఉన్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు గోపి పోలీస్ శాఖకు సంబంధం లేదని గుంటూరు పోలీసులు స్పష్టం చేశారు. పల్నాడు జిల్లా అమరావతి మండలం లింగాపురంకు చెందిన నిందితుడు డిగ్రీ చదివి సీఐ వద్ద పర్సనల్ కార్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. రెండో నిందితుడు మణికంఠ శ్యామలనగర్ శివారులోని సీతారాం కాలనీలో ఉంటున్నాడు. ప్రస్తుతం బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నట్టు గుర్తించారు.