Tirumala Laddu Row : పవన్ కల్యాణ్ బెదిరింపులకు భయపడేది లేదు: పేర్ని నాని
Tirumala Laddu Row : తిరుమల లడ్డూ వ్యవహారం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. కూటమి ప్రభుత్వం, వైసీపీ మధ్య డైలాగ్ వార్ ముదురుతోంది. తాజాగా.. మాజీమంత్రి పేర్ని నాని పవన్ కల్యాణ్‌పై ఫైర్ అయ్యారు. అటు పేర్ని నాని ఇంటిని జనసేన కార్యకర్తలు ముట్టడించారు. దీంతో హెటైన్షన్ నెలకొంది.
తిరుమల లడ్డూ, నెయ్యి వ్యవహారం ఆంధ్రా రాజకీయాలను కుదిపేస్తోంది. ఇటీవ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఏపీలో హాట్ టాపిక్‌గా మారాయి. అటు పవన్ వ్యాఖ్యలకు వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. తాజాగా.. మాజీమంత్రి పేర్ని నాని పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై స్పందించారు. పవన్ కల్యాణ్‌పై పేర్ని నాని ఫైర్ అయ్యారు.
'పవన్‌కల్యాణ్ బెదిరింపులకు భయపడేది లేదు. పవన్ కల్యాణ్‌కు ఒక సిద్ధాంతం లేదు. పవన్ వ్యాఖ్యలు మతాల మధ్య చిచ్చుపెట్టేలా ఉన్నాయి. గతంలో కులాల మధ్య చిచ్చు పెట్టాలని చూశారు. ఇప్పుడు మతాల మధ్య విద్వేషాలు సృష్టిస్తున్నారు' అని పేర్ని నాని వ్యాఖ్యానించారు. పేర్ని నాని మాట్లాడిన కాసేపటికే.. జనసేన కార్యకర్తలు ఆయన ఇంటిని ముట్టిడించారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
అటు మాజీమంత్రి చెల్లుబోయిన వేణు కూడా తిరుమల లడ్డూ వ్యవహారంపై ఘాటుగా స్పందించారు. 'జూన్ 12 నుంచి ఏఆర్ డెయిరీ నెయ్యి సప్లై మొదలైంది. జూన్ 12 నాటికి కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంది. జూన్ 12 తర్వాత నెయ్యి క్వాలిటీ లేదని.. వెనక్కి పంపామని చెప్పారు. లడ్డూల్లో కల్తీ నెయ్యి కలిసిందనడానికి ఆధారాలు లేవు. ప్రాయశ్చిత్త దీక్ష చేయాల్సింది చంద్రబాబు. తప్పు చేశారు కాబట్టే పవన్ ప్రాయశ్చిత్త దీక్ష చేశారు' అని చెల్లుబోయిన వేణు వ్యాఖ్యానించారు.
అటు ప్రకాశ్ రాజ్ కూడా పవన్ కళ్యాణ్‌పై పరోక్షంగా విరుచుకుపడుతున్నారు. వరుస ట్వీట్లతో పవన్ కల్యాణ్‌పై విమర్శలు చేస్తున్నారు. 'గెలిచేముందు ఒక అవతారం.. గెలిచిన తర్వాత ఇంకో అవతారం.. ఏంటీ అవాంతరం.. ఏందుకు మనకీ అయోమయం.. ఏది నిజం? జస్ట్ ఆస్కింగ్?' అంటూ ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు. 'చేయని తప్పుకి సారీ చెప్పించుకోవడంలో ఆనందమేంటో! జస్ట్ ఆస్కింగ్' అంటూ అంతకు ముందు ట్వీట్ చేశారు.
ఇటీవల బెజవాడ కనకదుర్గ ఆలయంలో శుద్ధి కార్యక్రమాలు చేపట్టిన పవన్ కల్యాణ్.. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రకాశ్ రాజ్ చేసిన ట్వీట్‌కు కౌంటర్ ఇచ్చారు. తిరుమల లడ్డూ కల్తీ అయ్యిందని తాము బాధపడి పోరాటం చేస్తుంటే మధ్యలో ప్రకాశ్ రాజ్‌కు ఏం సంబంధం అని ప్రశ్నించారు. తాను ఏ మతాన్ని తక్కువ చేయలేదని.. అలాంటప్పుడు ప్రకాష్ రాశ్ ఎందుకు మాట్లాడుతున్నారంటూ నిలదీశారు.
పవన్ వ్యాఖ్యలకు ప్రకాశ్ రాజ్ మరోసారి స్పందించారు. తాను ప్రస్తుతం విదేశాల్లో షూటింగ్‌లో ఉన్నాని.. ఇండియాకు తర్వాత దీనిపై స్పందిస్తానని చెప్పారు. పవన్ ప్రెస్‌మీట్ చూశానన్న ప్రకాశ్ రాజ్.. తన ట్వీట్‌ను పవన్ తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు. వీలైతే తన ట్వీట్‌ను మరోసారి చదువుకుని అర్థం చేసుకోవాలంటూ పవన్‌పై సెటైర్లు వేశారు.