BRS to Congress : బీఆర్ఎస్ నుంచి మరో ఎమ్మెల్యే ఔట్ - కాంగ్రెస్ లో చేరిన ప్రకాశ్ గౌడ్
MLA Prakash Goud joined Congress: బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి ఎమ్మెల్యేల వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్.. సీఎం రేవంత్ సమక్షంలో హస్తం కండువా కప్పుకున్నారు.
MLA Prakash Goud joined Congress: బీఆర్ఎస్ పార్టీకి మరో ఎమ్మెల్యే షాక్ ఇచ్చారు. గ్రేటర్ హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ నుంచి గెలిచిన ప్రకాశ్ గౌడ్ కాంగ్రెస్ లో చేరారు. జూబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రకాశ్ గౌడ్ చేరికతో బీఆర్ఎస్ నుంచి చేరిన ఎమ్మెల్యేల సంఖ్య ఏనిమిదికి చేరింది.
గ్రేటర్ హైదరాబాద్ లోని రాజేంద్ర నగర్ నియోజకవర్గం నుంచి ప్రకాశ్ గౌడ్ 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2009, 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన ఆయన… ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున రెండుసార్లు విజయం సాధించారు. మొన్నటి అసెంబ్లీ బీఆర్ఎస్ తరపున బరిలో ఉన్న ఆయన… 32,096 ఓట్ల తేడాతో విక్టరీ కొట్టారు.
కొద్దిరోజుల ముందే ప్రకాశ్ గౌడ్ కాంగ్రెస్ లో చేరుతారనే వార్తలు బలంగా వినిపించాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత…. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. అదే సమయంలో పార్టీ మార్పు ఖాయమని అంతా భావించారు. కానీ ఆయన యూటర్న్ తీసుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి తరపున ప్రచారం కూడా చేశారు. పార్టీ మారటం లేదని చెప్పుకొచ్చారు. దీంతో ఆయన బీఆర్ఎస్ లోనే కొనసాగుతారన్న చర్చ సాగింది.
2023 డిసెంబర్ లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున మొత్తం 39 మంది ఎమ్మెల్యేలుగా గెలిచారు. వీరిలో దానం నాగేందర్, కడియం శ్రీహరి. తెల్లా వెంకట్రావ్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ సంజయ్ కుమార్, కాలె యాదయ్య హస్తం, బండ్ల కృష్ణామోహన్ రెడ్డి గూటికి చేరారు. తాజాగా ప్రకాశ్ గౌడ్ చేరితో బీఆర్ఎస్ నుంచి చేరిన ఎమ్మెల్యేల సంఖ్య ఎనిమిదికి చేరింది. మరికొంత మంది కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీని వీడి…. కాంగ్రెస్ గూటికి చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ నుంచే మరో నాలుగు నుంచి ఐదు మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ను వీడుతారని తెలుస్తోంది.
త్వరలోనే బీఆర్ఎస్ఎల్పీ విలీనం - ఎమ్మెల్యే దానం కామెంట్స్
శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్,,, హాట్ కామెంట్స్ చేశారు. ఈ రెండు రోజుల్లో ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతారని అన్నారు. త్వరలోనే బీఆర్ఎల్పీ… కాంగ్రెస్ లో విలీనం అవుతుందని చెప్పుకొచ్చారు.
బీఆర్ఎస్ పార్టీలో ముగ్గురు లేదా నలుగురు ఎమ్మెల్యేలే మిగులుతారని దానం వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పార్టీలో ఏ ఒక్క ఎమ్మెల్యే ఉండే పరిస్థితి లేదన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో ఎమ్మెల్యేలకు కనీసం గౌరవం ఉండేది కాదన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించే అవకాశం ఉండేది కాదని చెప్పారు. కేవలం కేటీఆర్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు ఉన్న నియోజకవర్గాలకు మాత్రమే నిధులు ఇచ్చుకున్నారని విమర్శించారు.ఆత్మగౌరవం ఉన్న ఏ ఎమ్మెల్యే కూడా అక్కడ ఉండరని కామెంట్స్ చేశారు.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఎమ్మెల్యేలకు తగిన గౌరవం ఉంటుందని దానం చెప్పారు. ప్రజా సమస్యలను కూడా పరిష్కరించుకునే అవకాశం ఉంటుందన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇచ్చే నిధులు కూడా గత ప్రభుత్వంలో రాలేదని…. ప్రస్తుతం అలాంటి పెండింగ్ పనులన్నీ ఇప్పుడే జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు.