Samineni Udayabhanu : పవన్‌తో అరగంట పాటు చర్చ.. 22న జనసేనలో చేరనున్న సామినేని-samineni udayabhanu will join janasena party on 22nd of this month ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Samineni Udayabhanu : పవన్‌తో అరగంట పాటు చర్చ.. 22న జనసేనలో చేరనున్న సామినేని

Samineni Udayabhanu : పవన్‌తో అరగంట పాటు చర్చ.. 22న జనసేనలో చేరనున్న సామినేని

Basani Shiva Kumar HT Telugu
Sep 19, 2024 05:12 PM IST

Samineni Udayabhanu : అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత.. వైసీపీని వీడేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఏళ్ల తరబడి జగన్ వెంట నడిచిన నేతలు కూడా వైసీపీకి గుడ్‌బై చెబుతున్నారు. తాజాగా.. జగన్ నమ్మిన బంట్లు బాలినేని, సామినేని పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు. ఈ ఇద్దరు జనసేన చేరడానికి రెడీ అయ్యారు.

సామినేని ఉదయభాను
సామినేని ఉదయభాను

వైసీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను జనసేన పార్టీలో చేరబోతున్నారు. గురువారం మధ్యాహ్నం జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌తో భేటీ అయిన సామినేని.. స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. పవన్‌తో అరగంట పాటు వివిధ అంశాలపై సామినేని ఉదయభాను చర్చించారు. 'ఈ నెల 22న జనసేనలో చేరుతున్నా . రేపు పార్టీ కార్యకర్తలతో సమావేశం అవుతా. జనసేన బలోపేతానికి నా వంతు కృషి చేస్తా. వివాదాలకు తావులేకుండా నడుచుకుంటా' అని సామినేని ఉదయభాను వ్యాఖ్యానించారు.

వైసీపీ తరఫున 2019లో జగ్గయ్యపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఉదయభాను.. సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నారు. కాంగ్రెస్‌ పార్టీలో ఎమ్మెల్యేగా పనిచేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండుసార్లు మంత్రి పదవి ఆశించినా.. సామాజిక సమీకరణల్లో భాగంగా కృష్ణా జిల్లాలో పేర్ని నానికి పదవి వరించింది.

ఉదయభాను రాకను స్వాగతిస్తూ జనసేన శ్రేణులు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు కూడా పెడుతున్నారు. ఉదయభాను వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత జనసేనలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. పార్టీలో చేరికకు సంబంధించి ఇప్పటికే జనసేన ముఖ‌్య నాయకులతో సంప్రదింపులు పూర్తి చేసినట్టు జనసేన వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్, వైసీపీల తరపున ఉమ్మడి కృష్ణా జిల్లాలో గుర్తింపు పొందిన నాయకుడిగా.. మూడు సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు ప్రభుత్వ విప్‌గా పనిచేసిన అనుభవం సామినేని ఉదయభానుకి ఉంది.

అటు బాలినేని శ్రీనివాస్ రెడ్డి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. 'నాడు వైఎస్‌ కోసమే రాజకీయాల్లోకి వచ్చా. జగన్‌ నిర్ణయాలను వ్యతిరేకించా. పార్టీలో ఎన్నో అవమానాలు భరించా. కాంగ్రెస్‌లో మంత్రి పదవి వదులకుని జగన్‌ వెంట వెళ్లా. జగన్‌ ప్రభుత్వంలో రెండున్నరేళ్లు మంత్రిగా కొనసాగా. జగన్‌ కొత్తవారికి మంత్రి పదవులు ఇవ్వాలని భావించారు. జగన్‌ నిర్ణయాన్ని స్వాగతించా. కానీ పార్టీలో అవమానాలను తట్టుకోలేకపోయాను' అని బాలినేని శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించారు.

ఒంగోలు ఎంపీ అభ్యర్థిత్వం విషయంలో మాగుంట శ్రీనివాసులు రెడ్డి కోసం తీవ్రంగా ప్రయత్నించి బాలినేని భంగపడ్డారు. మాగుంట అభ్యర్థిత్వం కోసం విశ్వ ప్రయత్నాలు చేసినా అవి ఫలించలదు. చివరకు తన కుమారుడికి టిక్కెట్ ఇప్పించుకోవాలని చేసిన ప్రయత్నాలు కూడా సఫలం కాలేదు. మాగుంట ఎంపీ అభ్యర్థి అయితే జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకూ లాభమనే ఉద్దేశంతోనే తాను పట్టుబట్టానని అప్పట్లో బాలినేని శ్రీనివాస రెడ్డి చెప్పారు.

వైసీపీ ఆవిర్భావం నుంచి ప్రకాశం జిల్లాలో పార్టీపై బాలినేని హవా కొనసాగింది. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే దానిని భరించలేక ఎమ్మెల్యేలలో అసంతృప్తి ఎక్కువైంది. బాలినేనితో మిగిలిన వారు కలిసి రాకపోవడానికి అదే కారణమని వైసీపీ నేతలు చెబుతున్నారు. .