Chennai news: చెన్నైలో గ్యాంగ్ స్టర్ బాలాజీ ఎన్ కౌంటర్; సినీ ఫక్కీలో ఛేజింగ్, ఎదురుకాల్పులు-gangster shot dead in chennai 10kg drugs sickle seized from car ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Chennai News: చెన్నైలో గ్యాంగ్ స్టర్ బాలాజీ ఎన్ కౌంటర్; సినీ ఫక్కీలో ఛేజింగ్, ఎదురుకాల్పులు

Chennai news: చెన్నైలో గ్యాంగ్ స్టర్ బాలాజీ ఎన్ కౌంటర్; సినీ ఫక్కీలో ఛేజింగ్, ఎదురుకాల్పులు

Sudarshan V HT Telugu

చెన్నైలో ఒక గ్యాంగ్ స్టర్ ను పోలీసులు సినీ ఫక్కీలో ఛేజ్ చేసి ఎన్ కౌంటర్ చేశారు. చెన్నైలోనివ్యాసర్పాడిలో గ్యాంగ్ స్టర్ బాలాజీ(40)ని పోలీసులు కాల్చి చంపారు. పోలీసులపై ఆ గ్యాంగ్ స్టర్ రెండు రౌండ్లు కాల్పులు జరిపాడని, దాంతో చెన్నై పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో చనిపోయాడని పోలీసులు తెలిపారు.

చెన్నైలో గ్యాంగ్ స్టర్ ఎన్ కౌంటర్; సినీ ఫక్కీలో ఛేజింగ్

Chennai encounter: చెన్నై వ్యాసర్పాడిలో 40 ఏళ్ల గ్యాంగ్ స్టర్ 'కక్కతోప్' బాలాజీని పోలీసులు కాల్చి చంపారు. పోలీసులపై గ్యాంగ్ స్టర్ బాలాజీ కాల్పులు జరపడంతో, ఆత్మ రక్షణ కోసం పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో చనిపోయాడు. గ్యాంగ్ స్టర్ బాలాజీ తన తుపాకీతో పోలీసులపై రెండు రౌండ్లు కాల్పులు జరిపాడని చెన్నై పోలీసులు తెలిపారు.

వాహన తనిఖీల్లో భాగంగా..

ఈ నెల 18న ఉదయం 4.32 గంటలకు పోలీసు సిబ్బంది సాధారణ వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా, ఆ మార్గంలో వచ్చిన ఒక కారును కూడా తనిఖీ కోసం ఆపారు. ఆ కారులో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వారితో పాటు ఒక పెద్ద బ్యాగ్ ఉంది. పోలీసులు వారిని బయటకు రమ్మని చెప్పడంతో డ్రైవర్, మరో వ్యక్తి బయటకు రావడానికి మొదట సంకోచించారు. పోలీసులు పట్టుబట్టడంతో ఒక ప్రయాణికుడు బ్యాగ్ తో పాటు కిందకు దిగాడు. ఈ లోపు డ్రైవర్ సీట్లో ఉన్న గ్యాంగ్ స్టర్ బాలాజీ అక్కడి నుంచి వేగంగా కారును నడుపుకుంటూ పరారయ్యాడు. పోలీసులు వెంటనే నగరంలోని కంట్రోల్ రూమ్ కు సమాచారం అందించారు.

సినీ ఫక్కీలో చేజింగ్..

కంట్రోల్ రూమ్ కు సమాచారం ఇవ్వడంతో పాటు తమ వాహనంలో ఆ కారును పోలీసులు ఛేజ్ చేయడం ప్రారంభించారు. తెల్లవారు జామున 4.50 గంటల సమయంలో పోలీసులు రూట్ ను బ్లాక్ చేయడంతో గ్యాంగ్ స్టర్ బాలాజీ కారును ఆపాల్సి వచ్చింది. బాలాజీ కారు వెనుక ఉన్న పోలీసు వాహనంలో నుంచి ఒక ఇన్ స్పెక్టర్ కిందకు దిగుతుండగా, బాలాజీ కారు దిగి ఆ ఇన్ స్పెక్టర్ ను లక్ష్యంగా చేసుకుని తుపాకీతో కాల్పులు జరిపాడు. అయితే బుల్లెట్ పోలీసు వాహనం ముందు అద్దాలను తాకింది. కాల్పులు జరపొద్దని పోలీసులు హెచ్చరించారు. కానీ, అతను మళ్లీ రెండో రౌండ్ కాల్పులు జరపడంతో అది పోలీసు వాహనం ముందు డోర్ ను తాకింది.

పోలీసుల ఎన్ కౌంటర్

ఆత్మరక్షణ కోసం ఓ పోలీస్ ఇన్స్పెక్టర్ బాలాజీపై కాల్పులు జరపడంతో అతడు వెంటనే కింద పడిపోయాడు. బుల్లెట్ బాలాజీ ఎడమ ఛాతీలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో పోలీసులెవరూ గాయపడలేదు. పోలీసులు గ్యాంగ్ స్టర్ ను పోలీసు వాహనంలో స్టాన్లీ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులు కారును తనిఖీ చేయగా బ్యాగులో 10 కిలోల గంజాయి, వెనుక సీట్లో కొడవలి కనిపించాయి.

6 హత్య కేసులు సహా 58 కేసులు

బాలాజీ హిస్టరీ షీటరని, అతనిపై ఆరు హత్య కేసులు, 17 హత్యాయత్నం కేసులు, ఒక గంజాయి కేసుతో సహా 58 కేసులు ఉన్నాయని చెన్నై నార్త్ జోన్ డిప్యూటీ కమిషనర్ ప్రవేశ్ కుమార్ తెలిపారు. మెజిస్టీరియల్ విచారణ కోసం వ్యాసర్పాడి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశామన్నారు. బాలాజీ గత నెలలో జైలు నుంచి బయటకు వచ్చాడు. కాగా, కారులో అతడితో పాటు ఉన్నది అతడి సహచరుడు సత్యమూర్తి అని పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఆయన కూడా కస్టడీలో ఉన్నారు.

ఇది పోలీసులు చేసిన హత్య

పోలీసులే ఈ హత్యకు పాల్పడ్డారని బాలాజీ తల్లి కన్మణి ఆరోపించారు. బాలాజీ ని చంపాలని పోలీసులు ముందే నిర్ణయించుకున్నారని ఆరోపించారు. తన కుమారుడు తిరుపతి నుంచి తిరిగి వస్తుండగా.. సమాచారం తెలుసుకున్న పోలీసులు పక్కా ప్రణాళికతో తన కుమారుడిని చంపేశారన్నారు.

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.