Tirumala Ghee Effect: తిరుమల కల్తీ నెయ్యి ఎఫెక్ట్.. దేవాదాయ శాఖ అప్రమత్తం, తెలంగాణ ఆలయాల్లో తనిఖీలు..-tirupati ghee effect inspections in telangana temples devadaya department alerted ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tirumala Ghee Effect: తిరుమల కల్తీ నెయ్యి ఎఫెక్ట్.. దేవాదాయ శాఖ అప్రమత్తం, తెలంగాణ ఆలయాల్లో తనిఖీలు..

Tirumala Ghee Effect: తిరుమల కల్తీ నెయ్యి ఎఫెక్ట్.. దేవాదాయ శాఖ అప్రమత్తం, తెలంగాణ ఆలయాల్లో తనిఖీలు..

HT Telugu Desk HT Telugu
Sep 26, 2024 09:51 AM IST

Tirumala Ghee Effect: తిరుమల తిరుపతి లడ్డూ వివాదం ఎంతటి హాట్ టాపిక్ గా మారిందో తెలిసిన విషయమే.ఆ లడ్డూల్లో కల్తీ నెయ్యి,జంతువుల కొవ్వు కలుపుతున్నారనే ఆరోపణలు రాగా.. ఈ విషయంపై ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చ నడుస్తోంది.ఈ నేపథ్యంలో తెలంగాణలోని ప్రముఖ ఆలయాల లడ్డుల నాణ్యత ఎలా ఉందనే చర్చ భక్తుల్లో మొదలైంది.

తెలంగాణ దేవాలయాల్లో ప్రసాదాల తయారీ పరీక్షలు
తెలంగాణ దేవాలయాల్లో ప్రసాదాల తయారీ పరీక్షలు

Tirumala Ghee Effect: తిరుమల శ్రీవారి లడ్డూల తయారీలో వినియోగించే నెయ్యి నాణ్యతపై వివాదం నేపథ్యంలో తెలంగాణ దేవాదాయ శాఖ అప్రమత్తమైంది. ప్రసాదాల తయారీ నాణ్యతపై భక్తులకు క్లారిటీ ఇవ్వడంతో పాటు అసలు వాస్తవాలను తెలుసుకునేందుకు రాష్ట్రంలో వివిధ ఆలయాలకు సంబంధించిన లడ్డూ , పుళిహోర ప్రసాదాన్ని పరీక్షించేందుకు దేవాదాయ శాఖ చర్యలు చేపట్టింది.

ఇందులో భాగంగానే రెండు రోజులుగా రాష్ట్రంలోని నాలుగు ప్రముఖ ఆలయాల్లో లడ్డూ, ఇతర తీర్థ ప్రసాదాలకు సంబంధించిన క్వాలిటీ టెస్ట్ చేసేందుకు యాక్షన్ స్టార్ట్ చేసింది. ఆలయాల్లో తీర్థ ప్రసాదాలకు వినియోగించే నూనె, నెయ్యి, పప్పులు, పల్లీలు, యాలకుల పొడి, జీడిపప్పు, బూందీ, చక్కెర తదితర ముడి పదార్థాలకు క్వాలిటీకి సంబంధించిన టెస్టులు చేస్తోంది.

ఫుడ్ సేఫ్టీ అధికారులను రంగంలోకి దించగా.. జిల్లాల్లో ఎంపిక చేసిన ఆలయాల్లో సంబంధిత ఈవోల ఆధ్వర్యంలో వాళ్లు టెస్టులు చేసి శాంపిల్స్ సేకరిస్తున్నారు. ఈ మేరకు వాటి శాంపిల్స్ ను హైదరాబాద్ లోని ఫుడ్ సేఫ్టీ ల్యాబ్కు తరలించి, టెస్టులు నిర్వహిస్తున్నారు.

ఐదు ఆలయాల్లో శాంపిల్స్ సేకరణ

దేవాదాయ శాఖ ఆదేశాలతో రంగంలోకి దిగిన ఫుడ్ సేఫ్టీ అధికారులు మొదట రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో తనిఖీలు చేపట్టారు. ప్రముఖంగా నిత్యం లక్షలాది మంది తరలి వచ్చే వేములవాడ రాజరాజేశ్వర ఆలయం, యాదగిరిగుట్ట నరసింహస్వామి దేవస్థానం, భద్రాచలం రాములోరి గుడి, బాసర సరస్వతీ ఆలయం, ఓరుగల్లు ఇంద్రకీలాద్రిగా పేరుగాంచిన భద్రకాళి ఆలయాలను మొదటి దశలో ఎంపిక చేసి రెండు రోజుల పాటు తనిఖీ చేశారు.

ఈ మేరకు తీర్థ ప్రసాదాలు తయారు చేసే విధానాలను ఫుడ్ సేఫ్టీ అధికారులు పరిశీలించారు. ప్రసాదాల తయారీకి వినియోగిస్తున్న పాల నుంచి ఇతర ముడి సరుకులను పరిశీలించి, వాటి శాంపిల్స్ సేకరించారు. వాటిని వివిధ క్వాలిటీ టెస్టుల కోసం హైదరాబాద్ లోని ల్యాబ్ కు పంపించగా.. నాలుగైదు రోజుల్లో వాటిపై పూర్తి నివేదిక వచ్చే అవకాశం ఉందని ఫుడ్ సేఫ్టీ అధికారులు చెబుతున్నారు.

కాగా వరంగల్ లోని భద్రకాళి ఆలయాన్ని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కృష్ణమూర్తి తనిఖీ చేశారు. వాస్తవానికి భద్రకాళి ఆలయానికి భోగ్(బీహెచ్ఓజీ) సర్టిఫికేట్ ఉంది. నాణ్యత ప్రమాణాలతో కూడిన ముడి సరుకులను వినియోగించడంతో పాటు ప్రసాదాలు తయారు చేసే ప్రదేశంలో కూడా పరిశుభ్రత పాటించే ఆలయాలకు భారత ప్రభుత్వ ఆహార పరిరక్షణ ప్రమాణాల అధికారిక సంస్థ ఈ సర్టిఫికేట్ ఇస్తుంది.

భోగ్ సర్టిఫికేట్ ఉన్న భద్రకాళి ఆలయంలో ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం లేదని టెంపుల్ ఆఫీసర్లు చెబుతున్నారు. ఈ సర్టిఫికేట్ లేని ఆలయాల్లో కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించి, శాంపిల్స్ సేకరించగా.. ఈ నెలాఖరు వరకల్లా పూర్తి నివేదికలు వస్తాయని ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పష్టం చేస్తున్నారు.

(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)

Whats_app_banner