Deepavali 2022 : ఆ ఊరిలో 200 ఏళ్ల నుంచి దీపావళి జరుపుకోరు.. కారణం ఏంటంటే?
Deepavali 2022 : దీపావళి వచ్చింది. అంతా ఊళ్లకు చేరారు. పండగా ఘనంగా జరుపుకొంటున్నారు. కానీ ఒక్క గ్రామం మాత్రం.. ఏం పట్టనట్టుగా ఉంటుంది. అసలు దీపావళి పండగే మాకు తెలియదనట్టుగా ఉంది. ఇంతకీ ఏ ఊరు? అక్కడ దీపావళి ఎందుకు జరుపుకోరు?
దీపావళి(Deepavali) పండగతో గ్రామాలన్నీ కళకళలాడుతున్నాయి. చిన్నా పెద్దా సంతోషంగా పండగ జరుపుకొంటున్నారు. ఎక్కడెక్కడో ఉండేవాళ్లు గ్రామాలకు చేరారు. కానీ ఓ గ్రామంలో దీపావళి రోజు దీపం వెలగనివ్వరు. ఒక్క టపాసు కూడా పేలినట్టుగా శబ్ధం వినిపించదు. ఇది ఈ మధ్య కాలంలో కాదు.. వందల ఏళ్ల నుంచి ఇక్కడ అదే సంప్రదాయం కొనసాగుతోంది. కారణం ఏంటో తెలుసుకుందాం..
దేశమంతా దీపావళి పండగ నిర్వహించుకుంటోంది. కానీ శ్రీకాకుళం (Srikakulam)జిల్లా రణస్థలం మండలం పున్ననపాలెంలో మాత్రం ఒక్క దీపం కూడా వెలగదు. సుమారు 200 ఏళ్లుగా ఇక్కడ దీపావళి పండగను నిర్వహించుకోరు. చీకటిలోనే ఆ గ్రామం ఉంటుంది. పెద్దగా ఈ పండగను పట్టించుకోరు. చుట్టుపక్కల గ్రామాలు.. కళకళలాడుతూ కనిపించినా.. చేసుకోనియండిలే అనుకుంటారు. మనం చేసుకోవాల్సిన అవసరం లేదని.. గ్రామం అంతా.. ఒకే మాటపై ఉంటారు.
పున్ననపాలెం(Punnanapalem) ఆచారం చూసి.. చాలామంది ఏంటిది అనుకుంటారు. కానీ వాళ్లకుండే నమ్మకం వాళ్లకు ఉంది. సుమారు 200 ఏళ్లనాటి జరిగిన సంఘటనను తరతరాలుగా.. ఫాలో అవుతూ ఇప్పటికీ పాటిస్తూనే ఉన్నారు. అలా ఊరి కట్టుబటుని ఎవరూ కాదనరు. దీని వెనక అక్కడ కథ చెబుతారు. అప్పటి నుంచి అదే విషయాన్ని ఫాలో అవుతున్నారు. ఇంతకీ ఆ కథేంటో తెలుసా?
సుమారు 200 ఏళ్ల క్రితం కిందటి మాట. పున్ననపాలెంలో దీపావళి, నాగులచవితి రోజున పాము కాటుతో ఊయలలో ఓ చిన్నారి చనిపోయిందట. అంతేకాదు రెండు ఎద్దులు కూడా మరణించాయి. దీంతో పండగ జరుపుకొంటే మంచి జరగడం లేదని, అప్పటి నుంచి నిర్వహించుకోవట్లేదు. ఇదే కట్టుబాటు వందల ఏళ్లైనా కొనసాగుతూనే ఉంది.
దీపావళి అనే ఊరూ ఉంది
శ్రీకాకుళం నగరానికి మీరు కొత్తగా వెళ్తే.. అక్కడ కొంతమంది ఏదైనా వాహనాన్ని.. దీపావళికి వెళ్తుందా.. దీపావళి(Deepavali)కి వెళ్తుందా అంటూ అడుగుతారు. అలా అని మీరు ఇదేంటి పండగకు వెళ్లడం అనుకుంటే పొరబడినట్టే. తప్పులో కాలేసినట్టే. దీపావళి ఇప్పుడు పండగే. కానీ అక్కడో ఊరు ఉంది అదే పేరుతో. విచిత్రంగా ఉంది కదా. కానీ చాలా ఏళ్ల నుంచి ఆ పేరుతో ఊరు ఉంది. శ్రీకాకుళం(Srikakulam) నుంచి 9 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గార మండలంలోకి వస్తుంది. ఇలా పేరును ఊరికి పెట్టడం చూసి షాక్ అవుతారు. దీనికి ఓ కథ కూడా ఉంది.
శ్రీకాకుళాన్ని అప్పట్లో ఓ రాజు పాలించేవారు. ఆయన గారా మండలం దగ్గర నుంచి గుర్రంపై వెళ్లేవారు. ఓ రోజు వెళ్తూ.. వెళ్తూ.. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో నాలో స్పృహ తప్పిపడిపోయారు. రాజును చూసిన పొలం పనులను వదిలి వేసి ఆయన దగ్గరకు వచ్చారు. ఆయనకు సపర్యలు చేశారు. అదే రోజు దీపావళి కావడంతో ఆ ఊరికి దీపావళి అనే నామకరణం చేశారు. అప్పటి నుంచి ఈ గ్రామానకి ఆ ఊరి పేరు వచ్చింది.