Diwali in Kargil this time: ప్రధాని మోదీ దీపావళి వేడుకలు.. 8 ఏళ్లలో ఇలా..-prime minister reaches kargil to celebrate diwali with army find his 8 year celebrations details here ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Prime Minister Reaches Kargil To Celebrate Diwali With Army Find His 8 Year Celebrations Details Here

Diwali in Kargil this time: ప్రధాని మోదీ దీపావళి వేడుకలు.. 8 ఏళ్లలో ఇలా..

HT Telugu Desk HT Telugu
Oct 24, 2022 10:34 AM IST

భారత సేనలతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొనేందుకు ప్రధాన మంత్రి మోదీ కార్గిల్ చేరుకున్నారు.

కార్గిల్ చేరుకున్న ప్రధాన మంత్రి మోదీ
కార్గిల్ చేరుకున్న ప్రధాన మంత్రి మోదీ (PTI)

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈరోజు అక్టోబరు 24న కార్గిల్ చేరుకున్నారు. భారత సైన్యంతో కలిసి ఆయన దీపావళి పండగ జరుపుకోనున్నారు. ‘ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కార్గిల్ చేరుకున్నారు. మన సాహసోపేతమైన భారత సైనికులతో కలిసి ఆయన దీపావళి వేడుకలు జరుపుకోనున్నారు..’ అని ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. 2014 నుంచి భారత ప్రధాన మంత్రి ప్రతి దీపావళిని వేర్వేరు సైనిక స్థావరాల వద్ద జరుపుకున్నారు.

సరిహద్దు రక్షణలో నిమగ్నమై ఉన్న సైనిక బలగాలతో కలిసి ఆయన ప్రతి ఏటా దీపావళి జరుపుకుంటున్నారు. ఈ ఏడాది ఆయన రామజన్మభూమి కాంప్లెక్స్ సందర్శించి అక్కడి దీపోత్సవంలో కూడా పాల్గొన్నారు. రామ్ లల్లాకు పూజలు నిర్వహించారు. రామాలయ నిర్మాణ పనులను కూడా ఆయన పరిశీలించారు. సరయూ నది ఒడ్డున ఈ ఏడాది రికార్డు స్థాయిలో 15 లక్షల దీపాలతో దీపోత్సవం నిర్వహించి అయోధ్య వార్తల్లోకి ఎక్కింది.

2014లో మోదీ సియాచిన్‌లో దీపావళి వేడుకలు జరుపుకున్నారు. ‘మంచు శిఖరాలతో కూడి ఉండే సియాచిన్ గ్లేసియర్‌లో ధైర్యవంతులైన ఆర్మీ జవాన్లు, అధికారులతో కలిసి దీపావళి వేడుక జరుపుకున్నాను. మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు..’ అని ఆయన నాడు ట్వీట్ చేశారు.

2015లో ప్రధాన మంత్రి మోదీ పంజాబ్‌లోని మూడు స్మారక ప్రాంతాలను సందర్శించారు. 1965లో భారత సేనల విజయాన్ని గుర్తు చేశారు. 1965 యుద్ధం 50వ వార్షికోత్సవం సందర్భంగా భారత సేనల త్యాగాలను గుర్తు చేసుకుంటూ.. వారు రక్తం చిందించిన ప్రతి ప్రాంతాన్ని సందర్శించాలని నిర్ణయించుకున్నారు.

2016 దీపావళి సందర్భంగా ప్రధాన మోదీ హిమాచల్ ప్రదేశ్ సందర్శించి చైనా సరిహద్దుల్లో రక్షణగా నిలిచిన సేనలతో దీపావళి వేడుక జరుపుకున్నారు.

2017లో సుమోధ్‌లో డోగ్రా స్కౌట్స్, ఆర్మీ, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ (ఐటీబీపీ)లతో కలిసి వేడుక జరుపుకున్నారు. ఉత్తర కశ్మీర్‌లోని గురేజ్ ప్రాంతంలో సైనికులతో కలిసి జరుపుకున్న వేడుకలు తనలో కొత్త శక్తిని నింపాయని చెప్పారు.

2018లో ప్రధాన మంత్రి మోదీ ఉత్తరాఖండ్‌‌లోని హార్సిల్‌లో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం ఆయన కేదార్‌నాథ్ ఆలయాన్ని సందర్శించారు. 2019లో జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీలో సైనికులతో కలిసి పండగ చేసుకున్నారు. 2020లో సరిహద్దులోని లోంగేవాలాలో పండగ జరుపుకున్నారు.

2021లో జమ్మూకశ్మీర్‌లోని నౌషేరా ప్రాంతంలో దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ‘నౌషేరాలోని సాహసోపేతమైన సేనలతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొనడం గౌరవంగా భావిస్తున్నా..’ అని నాడు ట్వీట్ చేశారు.

IPL_Entry_Point