Mudragada Join YSRCP : ఈనెల 14న వైసీపీలో చేరుతున్నాను - పోటీపై 'ముద్రగడ' కీలక ప్రకటన-mudragada padmanabham ready to join in ysrcp on march 14 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Mudragada Join Ysrcp : ఈనెల 14న వైసీపీలో చేరుతున్నాను - పోటీపై 'ముద్రగడ' కీలక ప్రకటన

Mudragada Join YSRCP : ఈనెల 14న వైసీపీలో చేరుతున్నాను - పోటీపై 'ముద్రగడ' కీలక ప్రకటన

Maheshwaram Mahendra Chary HT Telugu
Mar 10, 2024 12:05 PM IST

Mudragada Padmanabham Join in YCP : వైసీపీలో చేరటంపై ముద్రగడ పద్మనాభం ప్రకటన చేశారు. మార్చి 14వ తేదీన పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు.

ముద్రగడ పద్మనాభం(ఫైల్ ఫొటో)
ముద్రగడ పద్మనాభం(ఫైల్ ఫొటో) (Mudragada Padmanabham FB)

Mudragada Padmanabham News : వైసీపీలో చేరికపై కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం(Mudragada Padmanabham) అధికారికంగా ప్రకటన చేశారు. ఈనెల 14వ తేదీన జగన్మోహన్ రెడ్డి(YS Jagan) సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు తెలిపారు. తన కుమారుడు కూడా పార్టీలో చేరుతారని వెల్లడించారు. ఎలాంటి షరతులు లేకుండానే వైసీపీలో చేరుతున్నామని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను కానీ, కుమారుడు కానీ పోటీపై ఎలాంటి కండిషన్లు పెట్టలేదన్నారు. ఏలాంటి పదవులు కూడా ఆశించడం లేదని… ప్రజలకు సేవ చేయటమే తన లక్ష్యమన్నారు.  వైఎస్ జగన్ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గోంటానని వెల్లడించారు.

"సీఎం జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు వైసీపీలో చేరుతాను. మార్చి 14వ తేదీన సాయంత్రం చేరుతాను. వైసీపీ నేతలు పార్టీలోకి రావాలని చర్చలు జరిపారు. మరిన్ని సంక్షేమ పథకాలు రావాలనే ఉద్దేశ్యంతో వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నాను. పోటీపై ఎలాంటి కండిషన్ లేకుండానే చేరుతున్నాను. మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైనా పదవి ఇస్తే తీసుకోవటానికి సముఖంగా ఉన్నాను. ప్రస్తుతానికి అయితే పోటీ చేసే ఉద్దేశ్యం లేదు. నా కుమారుడు కూడా చేయడు. జగన్ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటాను. వైసీపీ అధికారంలోకి వచ్చేందుకు నా వంతు కృషి చేస్తాను అని జగన్ కు చెప్పాను" అని ముద్రగడ వెల్లడించారు.

ఫలించిన వైసీపీ ఆపరేషన్

కొద్ది వారాల క్రితం ముద్రగడ పద్మనాభం జనసేనలో Janasenaకి వెళ్తారని ప్రచారం జరిగింది. ముద్రగడతో చర్చలు జరిపేందుకు పవన్ కళ్యాణ‌ ఆయన ఇంటికి వస్తారని వార్తలు వెలువడ్డాయి. ఆ తర్వాత ఏమి జరిగిందో కానీ పవన్ కళ్యాణ్‌ రాకపోవడం, టీడీపీ-జనసేన కూటమి అభ్యర్థుల జాబితాను ప్రకటించడం జరిగిపోయాయి. దీంతో ముద్రగడ మరో లేఖను విడుదల చేశారు. 24 సీట్లలో మాత్రమే పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్‌కు తమ అవసరం ఉండకపోవచ్చని పేర్కొన్నారు. ఇదే సమయంలో  రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సోదరుడు, గణేష్‌ ముద్రగడతో చర్చలు జరిపారు. ఉమ్మడి గోదావరి జిల్లా కో ఆర్డినేటర్ మిథున్‌ రెడ్డితో మాట్లాడించారు. ఆ తర్వాత స్వయంగా మిథున్ రెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి… ముద్రగడ నివాసానికి వెళ్లారు. పార్టీలోకి రావాలని ఆహ్వానించారు.

Mudragada Padmanabham Politicla Carrer: కాపు ఉద్యమ నేతగా గుర్తింపు పొందిన ముద్రగడ పద్మనాభం(Mudragada Padmanabham) నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రత్తిపాడు నియోజక వర్గం నుంచి ముద్రగడ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1978, 1983, 1985,1989 ఎన్నికల్లో ముద్రగడ పద్మనాభయం ఎమ్మల్యేగా గెలిచారు. 1978లో జనతా పార్టీ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ముద్రగడ, 1983, 1985లో టీడీపీ తరపున పోటీ చేసి గెలిచారు. 1989లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలుపొందారు. 1994లో పోటీ చేసి ఓడిపోయారు. ప్రత్తిపాడు నియోజక వర్గం లో ముద్రగడ కుటుంబం ఆరుసార్లు గెలుపొందింది. పద్మనాభం ఓసారి ఎంపీగా కూడా గెలిచారు. ఎన్టీఆర్, చెన్నారెడ్డి మంత్రివర్గాల్లో పనిచేశారు.

1994లో కాంగ్రెస్‌ పార్టీ తరపున పోటీ చేసిన ఓడిపోయిన ముద్రగడ 1999లో టీడీపీ తరపున ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత 2009లో కాంగ్రెస్ పార్టీ తరపున పిఠాపురంలో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి క్రియా‎శీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. కాపు రిజర్వేషన్ల కోసం టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ఉద్యమించారు.ఆ తర్వాత కాలంలో ఆయన ఏదొక రాజకీయ పార్టీలో చేరుతారని పలు సందర్బాల్లో ప్రచారం జరిగింది. తాజా పరిణామాల నేపథ్యంలో వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు.  ఓరకంగా ముద్రగడను పార్టీలోకి రప్పించే విషయంలో వైసీపీ ఆపరేషన్ సక్సెస్ అయిందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

Whats_app_banner