Court Notices To Pawan Kalyan : పవన్ కల్యాణ్ కు హైదరాబాద్ సిటీ కోర్టు నోటీసులు, నవంబర్ 22న కోర్టుకు రావాలని ఆదేశాలు
Court Notices To Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు నోటీసులు ఇచ్చింది. నవంబర్ 22న వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. తిరుమల లడ్డూ విషయంలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఓ లాయర్ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై కోర్టు విచారణ చేసింది.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు సమన్లు జారీ చేసింది. నవంబర్ 22న వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ జరిగిందని పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు... భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయని న్యాయవాది రామారావు.. ఇటీవల హైదరాబాద్ సిటీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారించిన కోర్టు పవన్ కల్యాణ్ కు నోటీసులు జారీ చేసింది.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో ఇటీవల ఓ పిటిషన్ దాఖలైంది. సిటీ సివిల్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందు న్యాయవాది రామారావు ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. తిరుమల లడ్డు విషయంలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు భక్తులు మనోభావాలను దెబ్బతీశాయని, ఆయనపై చర్యలు తీసుకోవాలని పిటీషనర్ కోర్టును కోరారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు ఇంటర్నెట్ నుంచి తొలగించాలని కోరారు. పవన్ వ్యాఖ్యలు ఇంటర్నెట్ నుంచి తొలగించేలా తెలంగాణ సీఎస్, హోంమంత్రిని ఆదేశించాలని పిటీషనర్ తన పిటిషన్ లో తెలిపారు. అలాగే పవన్ కల్యాణ్ తన అనుచిత ధోరణిని కొనసాగించకుండా గాగ్ ఉత్తర్వులు ఇవ్వాలన్నారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన కోర్టు ... తాజాగా పవన్ కల్యాణ్ కు సమన్లు జారీ చేసింది.
తిరుమల లడ్డూ వ్యవహారంలో
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం ఇటీవల కలకలం రేపింది ఏపీ సీఎం చంద్రబాబు... తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి కలిపారని ఆరోపించారు. ఈ విషయం సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. ఈ విషయంపై స్వతంత్ర విచారణకు సుప్రీం ఆదేశించింది. ఈ వ్యవహారంపై సీబీఐ, ఏపీ పోలీసులు, ఎఫ్ఎస్ఎస్ఏఐ అధికారులతో సిట్ ఏర్పాటు చేసి విచారించనున్నారు. అయితే లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి వినియోగంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు. తిరుపతిలో వారాహి డిక్లరేషన్ సభలో లడ్డూ వివాదం, సనాతన ధర్మంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
తిరుపతి సభలో సనాతన ధర్మాన్ని ఎవరూ అంతం చేయలేరని, అలా ఎవరైనా ప్రయత్నిస్తే వాళ్లే కొట్టుకుపోతారంటూ పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. సనాతన ధర్మం ఎప్పటికీ నిలిచే ఉంటుందన్నారు. గతంలో సనాతన ధర్మంపై తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలకు పవన్ కల్యాణ్ కౌంటర్ ఇచ్చారు. సనాతన ధర్మం మలేరియా, డెంగ్యూ అని దాన్ని నిర్మూలిస్తామని కొందరు అంటున్నారని, వారే కాలంతో పాటు కొట్టుకుపోతారని పవన్ కల్యాణ్ అన్నారు. ఈ సభలో చేసిన వ్యాఖ్యలపై పలువురు కోర్టు్లో పిటిషన్ దాఖలు చేశారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు భక్తుల మనోభావాలను కించపరిచేలా ఉన్నాయని ఆరోపించారు.
సంబంధిత కథనం