Tirumala Laddu SIT Investigation : తిరుమల లడ్డూ వివాదంపై సిట్ దర్యాప్తు నిలిపివేత, ఏపీ సర్కార్ కీలక నిర్ణయం
Tirumala Laddu SIT Investigation : తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సిట్ దర్యాప్తును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తదుపరి నిర్ణయం ఉంటుందని డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు.
తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ను నియమించిన విషయం తెలిసిందే. తాజాగా సిట్ దర్యాప్తును తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ మేరకు డీజీపీ ద్వారకా తిరుమలరావు ప్రకటన చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తున్న న్యాయవాదుల సూచనతో సిట్ దర్యాప్తును నిలిపివేస్తున్నట్లు డీజీపీ ప్రకటించారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా తదుపరి విచారణ కొనసాగిస్తామన్నారు.
సిట్ దర్యాప్తు నిలిపివేత
తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి వాడారన్న వివాదం దేశవ్యాప్తంగా సంచలనం అయ్యింది. ఈ వ్యవహారంపై సిట్ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం సిట్ దర్యాప్తును నిలిపివేస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. సుప్రీంకోర్టులో పిటిషన్ల విచారణ కారణంగా ఈనెల 3 వరకు సిట్ దర్యాప్తును నిలిపివేస్తున్నట్లు డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు.
స్వతంత్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని సుప్రీంకోర్టులో వైసీపీ నేతలు పిటిషన్లు వేశారు. దీనిపై కేంద్రం అభిప్రాయాన్ని కోరింది సుప్రీంకోర్టు. గురువారం ఈ పిటిషన్లపై విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో సిట్ దర్యాప్తును తాత్కాలికంగా వాయిదా వేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించినట్టు డీజీపీ తెలిపారు. ఇప్పటికే సిట్ టీటీడీకి నెయ్యి సరఫరా అవుతున్న విధానం, వినియోగించిన తీరుపై దర్యాప్తు చేసింది.
తిరుమలలో మీడియాతో మాట్లాడిన డీజీపీ ద్వారకా తిరుమలరావు.. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఈ నెల 4 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. ధ్వజారోహణం రోజున రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం చంద్రబాబు పట్టు వస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు. బ్రహ్మోత్సవాల నిర్వహణకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. సీసీ కెమెరాలు, మొబైల్ డివైజ్ ద్వారా ఫింగర్ ప్రింట్ టెక్నాలజీని వినియోగిస్తున్నామన్నారు. అలాగే ట్రాఫిక్, పార్కింగ్ విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు చెప్పారు. అలాగే ఆర్టీసీ అదనపు బస్సులు భక్తులకు అందుబాటులో ఉంటాయన్నారు.
కోర్టులకు ఆ హక్కులు ఉంటుందా? -పురంధేశ్వరి
తిరుమల లడ్డూ వ్యవహారం, సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి స్పందించారు. అధికారులతో సమీక్ష చేసి, తనకు వచ్చిన సమాచారంతో సీఎం చంద్రబాబు లడ్డూ వ్యవహారంపై ప్రకటన చేశారన్నారు. ముఖ్యమంత్రిగా జరిగిన అపచారం గురించి ప్రజలకు తెలియజేశారన్నారు. ప్రభుత్వ నిర్ణయాలు ఎలా అమలవుతున్నాయో కోర్టు పరిగణలోకి తీసుకుంటుందన్నారు. సీఎంను మీరు అలా ఎందుకు మాట్లాడారు అని కోర్టులకు అడిగే హక్కు ఉంటుందా? అనేది అందరూ ఆలోచన చేయాలన్నారు.
తిరుమల లడ్డూ వివాదంపై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఏపీ ప్రభుత్వం తరఫున న్యాయవాదులు అందించిన రిపోర్టులు, ఇతర అంశాలపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కల్తీ నెయ్యిని లడ్డూల తయారీకి వినియోగించలేదని ల్యాబ్ రిపోర్టులు తెలియజేస్తున్నాయని అభిప్రాయపడింది. దేవుళ్లను రాజకీయాలకు దూరంగా ఉంచాలని సూచించింది. కల్తీ నెయ్యి వ్యవహారంలో సీఎం ప్రెస్ ముందుకు ఎందుకు వెళ్లారని ప్రశ్నించింది. సిట్ దర్యాప్తు కొనసాగించాలా? స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించాలా? నిర్ణయిస్తామని ధర్మాసనం తెలిపింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరింది.
సంబంధిత కథనం