SC On Tirumala Laddu : దేవుళ్లను రాజకీయాలకు దూరంగా ఉంచండి, తిరుమల లడ్డూ పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు-supreme court key comments put god away from politics on tirumala laddu row ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Sc On Tirumala Laddu : దేవుళ్లను రాజకీయాలకు దూరంగా ఉంచండి, తిరుమల లడ్డూ పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

SC On Tirumala Laddu : దేవుళ్లను రాజకీయాలకు దూరంగా ఉంచండి, తిరుమల లడ్డూ పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Bandaru Satyaprasad HT Telugu
Sep 30, 2024 02:34 PM IST

SC On Tirumala Laddu : తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ వివాదంపై సిట్ విచారణకు ఆదేశిస్తే... ముఖ్యమంత్రి ప్రెస్ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించింది. దేవుళ్లను రాజకీయాలకు దూరంగా ఉంచాలని అభిప్రాయపడింది.

దేవుళ్లను రాజకీయాలకు దూరంగా ఉంచండి, తిరుమల లడ్డూ పిటిషన్లపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
దేవుళ్లను రాజకీయాలకు దూరంగా ఉంచండి, తిరుమల లడ్డూ పిటిషన్లపై సుప్రీం కీలక వ్యాఖ్యలు

SC On Tirumala Laddu : తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై దాఖలైన పిటిషన్లపై సోమవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ పిటిషన్ల విచారణ సందర్భంగా...దేవుళ్లను రాజకీయాలకు దూరంగా ఉంచాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. దేవుళ్లను రాజకీయాలకు దూరంగా ఉంచుతారని భావిస్తున్నామంది. ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి ఎందుకు ప్రెస్‌ ముందుకు వెళ్లారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. లడ్డూ వివాదంపై విచారణకు ఆదేశించినట్లైతే ప్రెస్ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఏంటని అభిప్రాయపడింది. తిరుమల లడ్డూ వ్యవహారంపై వైసీపీ రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తరఫున న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి, మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి పిటిషన్లు దాఖలు చేశారు.

కల్తీ నెయ్యితో లడ్డూలు తయారీ చేసినట్లు ఏమైనా ఆధారాలు ఉంటే తప్ప...ఈ వాదనలు అర్థరహితం అని సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది. ల్యాబ్ రిపోర్ట్ మేరకు కల్తీ నెయ్యిని లడ్డూ తయారీలో ఉపయోగించలేదని తెలుస్తోందంది. ఈ ల్యాబ్ రిపోర్ట్ స్పష్టంగా లేదు, ఆ నెయ్యిను తిరస్కరించారని ల్యాబ్ రిపోర్ట్ ప్రాథమికంగా సూచిస్తోందని కోర్టు తెలిపింది.

తిరుమల లడ్డూల తయారీలో కల్తీ నెయ్యిని వాడినట్లు స్పష్టంగా తెలియనప్పుడు ప్రెస్ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఏముందని సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

కనీసం దేవుళ్లను రాజకీయాలకు దూరంగా ఉంచాలని తాము ఆశిస్తున్నామని కోర్టు వ్యాఖ్యానించింది. ప్రమాణాలకు అనుగుణంగా లేని నెయ్యిని లడ్డూల తయారీకి ఉపయోగించారా? అని జస్టిస్ బీఆర్ గవాయ్ టీటీడీ తరఫున వాదిస్తున్న, సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రాను ప్రశ్నించారు. దీనిపై విచారణ జరుపుతున్నట్లు లూథ్రా కోర్టుకు తెలిపారు. మతపరమైన మనోభావాలను గౌరవించాలని జస్టిస్ గవాయ్ అన్నారు.

లడ్డూ రుచి సరిగా లేదని ప్రజలు ఫిర్యాదు చేశారని లూథ్రా కోర్టుకు తెలిపారు. ప్రసాదం తయారీలో కలుషిత నెయ్యిని ఉపయోగించారని రుజువు చేయాలని సుప్రీంకోర్టు కోరింది.

ఏపీ ప్రభుత్వం, టీటీడీకి ప్రశ్నలు

తిరుపతి లడ్డూల వివాదంపై కోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. తిరుమల లడ్డూల తయారీకి కల్తీ నెయ్యి వినియోగిస్తున్నారంటూ ఏపీ సీఎం చంద్రబాబు బహిరంగంగా ఆరోపణలు చేయడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. కేసు విచారణ సమయంలో సీఎం ఇలాంటి ప్రకటనలు చేయడం సరికాదని అభిప్రాయపడింది. అయితే తిరస్కరణకు గురైన నెయ్యిని పరీక్షకు పంపినట్లు ల్యాబ్ నివేదికలు తెలుపుతున్నాయని కోర్టు గమనించింది.

సీబీఐ విచారణ అవసరమా? లేదా? అనే దానిపై కేంద్ర ప్రభుత్వం నుంచి సూచనలు కోరాలని ధర్మానసం సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ఆదేశించింది. ఈ కేసులో తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. తిరుమల లడ్డూ పిటిషన్లను గంటపాటు విచారించింది.

ఈ విచారణలో రాష్ట్ర ప్రభుత్వాన్ని, టీటీడీని కోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. లడ్డూల తయారీలో ఉపయోగించిన నెయ్యి.. ఇది కాదని ల్యాబ్ నివేదిక ప్రాథమికంగా తెలియజేస్తోందని జస్టిస్ విశ్వనాథన్... ఏపీ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తున్న ముకుల్ రోహత్గీని ప్రశ్నించారు.

సిట్ విచారణకు ఆదేశించినప్పుడు, ప్రెస్‌ ముందుకు వెళ్లవలసిన అవసరం ఏమిటి? అని జస్టిస్ గవాయ్ ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాజ్యాంగబద్ధమైన పదవిని నిర్వహిస్తున్నప్పుడు.. దేవుళ్లను రాజకీయాలకు దూరంగా ఉంచుతారని ఆశిస్తున్నామన్నారు. జులైలో కల్తీ నెయ్యిపై నివేదిక వచ్చినప్పుడు... సెప్టెంబర్ 18న పబ్లిక్ గా స్టేట్మెంట్ ఎలా ఇస్తారని ప్రశ్నించింది. కచ్చితమైన నిర్థారణ లేకపోతే ప్రెస్ ముందుకు ఎలా వెళ్లారని జస్టిస్ విశ్వనాథన్ ప్రశ్నించారు.

ఈ అంశంపై విచారణ అవసరమని ధర్మాసనం అభిప్రాయపడింది. విచారణ రాష్ట్ర సర్కార్ ఏర్పాటు చేసిన సిట్ ద్వారా చేయాలా? లేదా? అనేది ప్రశ్న అని ధర్మాసనం పేర్కొంది.

Whats_app_banner

సంబంధిత కథనం